పదవీ విరమణ తప్పదా? 

21 Dec, 2018 00:27 IST|Sakshi

రిటైర్‌ కానున్న ఉద్యోగుల్లో గుబులు

అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ దీనిపైనే చర్చ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఏ ప్రభుత్వ కార్యాలయంలో చూసినా ఒకటే చర్చ. అన్ని స్థాయి ఉద్యోగుల్లో ఆ ఆంశంపైనే హాట్‌ హాట్‌ డిస్కషన్‌. ఉత్తర్వులు ఎప్పుడొస్తాయని ఉత్కంఠగా ఎదురుచూస్తు న్న అంశం. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంచనున్నట్లు టీఆర్‌ఎస్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్‌ మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ భారీ సీట్లతో గెలవడం, కేసీఆర్‌ సీఎంగా ప్రమాణం చేయడం అన్నీ జరిగిపోయాయి. అయితే ఆదేశాలు ఎప్పుడొస్తాయి.. ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయబోతున్న ఉద్యోగులకు తీపికబురు అందుతుందా లేదా అన్న దానిపై టెన్షన్‌ నెలకొంది.

1,200 మంది రిటైర్‌మెంట్‌
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఈ నెలాఖరు కు 1,200 మంది పదవీ విరమణ చేయబోతున్నట్లు సచివాలయ వర్గాలు తెలిపాయి. వీరిలో గెజిటెడ్‌ అధికారులు, కింది స్థాయి సిబ్బంది వరకు ఉన్నారు. వీరంతా సంబంధిత విభాగాధిపతులను కలసి పద వీ విరమణ పెంపుపై చర్యలు తీసుకుంటున్నారా.. ఎప్పటిలోపు ఆదేశాలొస్తాయి.. ఈ నెలలో ఆదేశాలొస్తాయా రావా అంటూ వాకబు చేస్తున్నారు.

ఎప్పటి నుంచి అమల్లోకి..
పదవీ విరమణ వయసు ఆదేశాలు ఈ నెల నుంచే అమల్లోకి తీసుకొస్తారా.. లేదా జూన్‌ 2 నుంచి అమల్లోకి తెస్తారా అన్న అంశాలపై జోరుగా చర్చ సాగుతోంది. కొత్త సంవత్సరం జనవరి నుంచి అమలు చేస్తే తాము నష్టపోతామని ఈ నెల పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు సీఎస్‌ ఎస్‌కే జోషిని కలసి వినతిపత్రం ఇచ్చారు. ఇప్పటికైతే ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎంకు ఎలాంటి ప్రతిపాదన ఫైలు వెళ్లినట్లు సచివాలయంలో కన్పించట్లేదు. వయసు పెంపు ఉంటుందా లేదా అన్న దానిపై ఏ అధికారిని అడిగినా సరైన రీతిలో స్పందన రావట్లేదని రిటైర్‌ కానున్న అధికారులు చెబుతున్నారు.

అధ్యయనం చేయబోతున్నారా?
రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ప్రభుత్వం పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచింది. కర్ణాటకలో విరమణ వయసు 62 ఏళ్లుగా ఉంది. ఆయా రాష్ట్రా ల్లో పదవీ విరమణ వయసు పెంచడం వల్ల ప్రభుత్వంపై ఆర్థికంగా ఎంత భారం పడుతుంది.. ఎంత మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.. తదితర అంశాలపై అధ్యయనం చేసే అవకాశం లేకపోలేదని సచివాలయ ఉద్యోగ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఉద్యోగుల పదవీ విరమణ వయసు ఈ నెల నుంచే పెంచితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై రూ. 260 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు అదనపు భారం పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

విభాగాల వారీగా జాబితా..
పదవీ విరమణ వయసు పెంపుపై ఇప్పటివరకు ఏ విభాగానికి కూడా సచివాలయం నుంచి గానీ ఆర్థిక శాఖ నుంచి ఎలాంటి సర్క్యులర్‌ వచ్చిన దాఖలాల్లేవు. దీంతో పదవీ విరమణ చేయాల్సిన అధికారులు సచివాలయంలో చక్కర్లు కొడుతున్నారు. ప్రజాప్రతినిధుల ద్వారా దీనిపై ఆరా తీస్తున్నారు. క్రిస్‌మస్‌ సెలవులు పోను పదవీ విరమణ చేయబోతున్న అధికారులు అధికారికంగా పనిచేసేది ఇంకా ఆరు రోజులే. ప్రభుత్వ సెలవులు, ఆప్షన్‌ హలిడే, ఆదివారాలు ఉండటంతో అసలు ఆదేశాలొచ్చే అవకాశం ఉండకపోవచ్చని పదవీ విరమణ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.  

మరిన్ని వార్తలు