4,100 మందికి లబ్ధి

26 Dec, 2019 04:24 IST|Sakshi

పదవీ విరమణ పెంపుతో ఆర్టీసీపై రూ.450 కోట్ల అదనపు భారం 

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీలో పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంచటం వల్ల 4,100 మందికి లబ్ధి జరగనుంది. దీని ప్రభావంతో ఆర్టీసీపై జీతాల రూపంలో దాదాపు రూ.450 కోట్ల అదనపు భారం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెలలో రిటైర్‌ కావాల్సిన వారికి వచ్చే రెండేళ్ల పాటు గరిష్టస్థాయి వేతనం చెల్లించాల్సి రావడంతో కార్పొరేషన్‌పై భారీ భారాన్నే మోపనుంది. ప్రస్తుతం ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం అనుకూలంగా లేదు. పైగా పదవీ విరమణ చేసే వారికి చెల్లించాల్సిన బెనిఫిట్స్‌ మొత్తం దాదాపు రూ.900 కోట్ల వరకు ఉంటుంది. అంతమొత్తం భరించే పరిస్థితి లేనందున, దానికంటే ఈ వేతనం అదనపు మొత్తాన్ని భరించటమే కొంతమేర అనుకూలంగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఇటీవల బస్సు చార్జీలు పెంచినందున రోజువారీ ఆదాయంలో దాదాపు రూ.1.8 కోట్ల పెరుగుదల కనిపిస్తోంది. 

ఫలితంగా ఆర్థిక పరిస్థితి మెరుగై, రెండేళ్ల తర్వాత రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ చెల్లించటం పెద్ద ఇబ్బంది కాకపోవచ్చని చెబుతున్నారు. కాగా, పదవీ విరమణ వయసు పెంపుతో వచ్చే రెండేళ్లలో రిటైర్‌మెంట్స్‌ ఉండవు. మరోవైపు 1,334 అద్దె బస్సులు రావటంతో డ్రైవర్ల అవసరం తగ్గనుంది. ఫలితంగా వచ్చే కొన్నేళ్ల వరకు కొత్త నియామకాల అవసరమే ఉండదు. దీంతో ఆర్టీసీలో వృద్ధుల సంఖ్య పెరిగి యువకుల సంఖ్య పడిపోనుంది. ఇది దుష్ఫలితాలు చూపుతుందన్న భావన వ్యక్తమవుతోంది. రిటైర్‌ కావాల్సిన వారికిచ్చే వేతనంతో అంతకు మూడు రెట్ల మంది కొత్త వారిని నియమించుకోవచ్చని కొందరు అధికారులు గుర్తు చేస్తున్నారు.  

సమ్మె కాలానికి వేతనాలిస్తాం
ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ హామీ
సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులకు ఆ కాలానికి సంబంధించిన వేతనా లు ప్రభుత్వమే చెల్లిస్తుందని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అక్టోబర్‌ 5న మొదలైన సమ్మె ఏకధాటిగా 52 రోజులపాటు కొనసాగింది. ఈ నేపథ్యంలో సమ్మె కాలానికి సంబంధించిన వేతనాల ను చెల్లిస్తామని గతంలో సీఎం హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఆ మొత్తాన్ని చెల్లించేందుకు కట్టుబడి ఉందని బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆయన స్పష్టం చేసినట్టు తెలిసింది. ఆ భారం ఆర్టీసీపై వేయకుండా ప్రభుత్వమే ఆ మొత్తాన్ని విడుదల చేస్తుందని చెప్పినట్టు సమాచారం. దీంతో సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులందరికీ వేత న బకాయిల విడుదలకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో పలు డిపోల్లో ఆర్టీసీ ఉద్యోగులు సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు