చెల్లి హత్యకు ప్రతీకారంగానే బావను హత్య

21 Aug, 2019 08:46 IST|Sakshi
నిందితుల వివరాలు వెల్లడిస్తున్న సీఐ శ్రీనివాస్‌రావు  

సత్యనారాయణ హత్యకేసు వివరాలను వెల్లడించిన పోలీసులు 

ప్రధాన నిందితులుగా మృతుడి బావమర్ది వెంకటేశ్, అతని స్నేహితులు 

సోమవారం బీదర్‌కు పారిపోతుండగా పోలీసులకు చిక్కిన వెంకటేశ్, ఆనందం 

సాక్షి, వికారాబాద్‌: వారం రోజుల క్రితం వికారాబాద్‌ పట్టణంలో జరిగిన ఓ వ్యక్తి దారుణ హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను పట్టుకున్న పోలీసులు మంగళవారం కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ శ్రీనివాస్‌రావు హత్య వివరాలను వెల్లడించారు. రామయ్యగూడకు చెందిన మృతుడు బసిరెడ్డిపల్లి సత్యనారాయణ (49) 2008లో పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన తన మేన మరదలైన దివ్యను వివాహం చేసుకున్నాడు. ఐతే వివాహం చేసుకున్న 45రోజుల్లోపే దివ్యను అతి దారుణంగా హత్య చేశాడు. ఈ హత్య అప్పట్లో పట్టణంలో సంచలనం రేపింది. హత్య జరిగిన సమయంలో దివ్య అన్న పుట్ట వెంకటేశ్‌ అలియాస్‌ జాంబ (17) చిన్న వయసులో ఉన్నాడు. అప్పటి (2008) నుంచి సత్యనారాయణపై కక్ష పెంచుకున్నాడు. కొంత కాలంగా అవకాశం కోసం ఎదురుచూసిన వెంకటేష్‌ ఈ నెల 14న సత్యనారాయణను స్నేహితులతో కలిసి హత్య చేశాడు.

చెల్లిని గుర్తు చేసుకొని... 
సత్యనారాయణను హత్య చేసేందుకు చాలారోజులుగా ఎదురుచూస్తున్న పుట్ట వెంకటేశ్‌ అలియాస్‌ జాంబ అందుకు తన ముగ్గురు స్నేహితుల సహకారం తీసుకున్నాడు. 14వ తేదీ సాయంత్రం వెంకటేశ్‌ తన మిత్రులు నర్సింలు, ఆనందం, శ్రీకాంత్‌ కలిసి ఓ వైన్స్‌షాపులో మద్యం సేవించారు. 15వ తేదీన రాఖీ పండుగ ఉండటంతో వెంకటేశ్‌ తన చెల్లెలు దివ్యను గుర్తుచేసుకొని తన మిత్రుల ముందు కన్నీరు పెట్టుకున్నాడు. తన చెల్లెలు చావుకు కారణమైన బావను హత్య చేస్తానని అందుకు మీ సహకారం కావాలని స్నేహితులను కోరాడు. దీంతో నర్సింలు, ఆనందం, శ్రీకాంత్‌లు సరేనని అంగీకరించారు.

ఎదురుపడ్డ సత్యనారాయణ.. 
సత్యనారాయణను హత్య చేయాలని అనుకున్న ఆ నలుగురు ఇందిరానగర్‌ చౌరస్తాకు వెళ్లి ఓ హోటల్‌ ఎదుట నిల్చున్నారు. ఇదే సమయంలో సత్యనారాయణ ద్విచక్ర వాహనంపై అక్కడికి వచ్చి సిగరేట్‌ తీసుకొని తాగుతుండగా ఈ నలుగురికి కనిపించాడు. దీంతో సత్యనారాయణ వద్దకు వచ్చిన వెంకటేశ్‌ తనకు మద్యం తాగించాలని సత్యనారాయణను అడిగాడు. బావమర్ది అయిన వెంకటేశ్‌ అడగటంతో సత్యనారాయణ కాదనలేక పట్టణంలోకి వచ్చి మద్యం తీసుకొచ్చాడు. బావ బావమర్దులు కలిసి ఇందిరానగర్‌లోని కల్లు దుకాణం వద్ద తమతోటి తెచ్చుకున్న మద్యం తాగారు. కొంతసేపటి తరువాత సత్యనారాయణ పక్కనే ఉన్న ఓ పాన్‌ డబ్బా వద్దకు వెళ్లి సిగరేట్‌ తాగుతున్నాడు. ముందే పథకం వేసుకున్న వెంకటేష్‌ ఇంటికి వెళ్లి పదునైన కత్తిని తెచ్చుకున్నాడు. అనంతరం వెంకటేశ్, నర్సింలు, ఆనందంలు కలిసి సత్యనారాయణపై దాడి చేశారు. స్థానికులు గొడవను అడ్డుకొని గాయపడ్డ సత్యనారాయణను ఓ ఆటోలో ఎక్కించి ఆస్పత్రికి పంపించారు.

అప్పటికే కత్తితో వచ్చిన వెంకటేశ్‌ అదే ఆటోలో ఎక్కి ఆటో నడుస్తుండగానే సత్యనారాయణ విచక్షణా రహితంగా దాడిచేశాడు. అప్పటికే నర్సింలు, ఆనంద్‌లు ద్విచక్ర వాహనంపై ఆటో వెనకాల వచ్చారు. శివరాంనగర్‌ సమీపంలోకి రాగానే సత్యనారాయణను ఆటోలో నుంచి కిందికితోసేశారు. అప్పటికే  స్పృహకోల్పోయిన సత్యనారాయణను వెంకటేష్‌ అతడి స్నేహితులు విక్షణా రహితంగా పొడిచి అక్కడి నుంచి  వెళ్లిపోయారు. దీంతో సత్యనారాయణ అక్కడికక్కడే మృతిచెందాడు. సత్యనారాయణ హత్యలో వెంకటేష్, నర్సింలు ప్రత్యక్షంగా పాల్గొన్నారని, ఆనంద్, శ్రీకాంత్‌లు వారికి సహకరించినట్లు పోలీసులు తెలిపారు. హత్య అనంతరరం తప్పించుకొని తిరుగుతున్న నిందితులు వెంకటేశ్, ఆనందం సోమవారం బీదర్‌కు వెళ్తుండగా కొత్తగడి సమీపంలో పోలీసులకు పట్టుబడినట్లు తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఐ తెలిపారు. పరారిలో ఉన్న శ్రీకాంత్, నర్సింలు కోసంగాలిస్తున్నట్లు సీఐ శ్రీనివాస్‌రావు తెలిపారు.

మరిన్ని వార్తలు