ఆ కేసుల వివరాలిస్తే చాలని ‘సుప్రీం’ చెప్పింది..

7 Nov, 2018 02:19 IST|Sakshi

     హైకోర్టుకు రేవంత్‌ న్యాయవాది మోహన్‌రెడ్డి నివేదన

     రేవంత్‌ కోరిన కేసుల వివరాలు ఇచ్చామన్న పోలీసులు

     ఇరుపక్షాల వాదనల అనంతరం వ్యాజ్యం మూసివేత

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల అఫిడవిట్‌లో విచారణకు స్వీకరించదగ్గ కేసులు, సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేసిన కేసులు, అభియోగాలు నమోదైన కేసుల వివరాలను అభ్యర్థి పొందుపరిస్తే చాలంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి తరఫు న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. ఈ తీర్పు ప్రకారం అభ్యర్థి తనపై నమోదైన ప్రతీ కేసు వివరాలను అఫిడవిట్‌లో పొందుపరచాల్సిన అవసరం లేదన్నారు. ఇటు పోలీసులు సైతం రేవంత్‌ కోరిన కేసుల వివరాలన్నింటినీ సమర్పించినట్లు హైకోర్టుకు తెలిపారు. ఇరుపక్షాలు సమర్పించిన వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. రేవంత్‌ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని మూసివేసింది.

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఆకుల వెంకటశేషసాయి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తనపై రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్‌స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలు అందచేసేలా డీజీపీని ఆదేశించాలని కోరుతూ రేవంత్‌ ఇటీవల హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ శేషసాయి విచారణ జరిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమపై ఉన్న కేసుల వివరాలన్నింటినీ ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొనాలా.. లేక తమకు తెలిసిన కేసుల గురించి మాత్రమే వెల్లడించాలా.. అన్న అంశంపై స్పష్టతనివ్వాలని అటు పిటిషనర్‌ తరఫు న్యాయవాదిని, ఇటు రాష్ట్ర పోలీసులను ఆదేశించారు.

తాజాగా మంగళవారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా, రేవంత్‌ తరఫు న్యాయవాది  స్పందిస్తూ.. ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరచాల్సిన కేసుల వివరాలపై సుప్రీం ఇచ్చిన తీర్పును న్యాయమూర్తి పరిశీలించారు. అనంతరం రాష్ట్ర పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్‌ స్పందిస్తూ.. పిటిషనర్‌ కోరిన కేసుల వివరాలు తాము అందజేశామన్నారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ఈ వ్యాజ్యంలో తదుపరి విచారణ అవసరం లేదంటూ పిటిషన్‌ను మూసివేసింది.

మరిన్ని వార్తలు