రేవంత్, సండ్ర సస్పెన్షన్‌

12 Mar, 2017 02:00 IST|Sakshi
రేవంత్, సండ్ర సస్పెన్షన్‌

గవర్నర్‌ ప్రసంగానికి అడ్డు తగిలినందుకు చర్యలు
ప్రస్తుత సమావేశాలు ముగిసేవరకు వర్తింపు
తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి హరీశ్‌.. ఆమోదించిన స్పీకర్‌
సస్పెన్షన్‌ అన్యాయమంటూ విపక్షాల అభ్యంతరం
క్షమాపణ చెబితే సస్పెన్షన్‌పై పునరాలోచిస్తామన్న హరీశ్‌రావు
నిరసనగా కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం సభ్యుల వాకౌట్‌  


సాక్షి, హైదరాబాద్‌: బడ్జెట్‌ సమావేశాల తొలి రోజున గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగానికి పదే పదే అడ్డుపడ్డారన్న కారణంతో టీడీపీ సభ్యులు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యలకు సస్పెన్షన్‌ వేటు పడింది. వారిని ప్రస్తుత సమా వేశాల మొత్తానికి శాసనసభ నుంచి సస్పెండ్‌ చేయాలంటూ శాసనసభ వ్యవహారాల మంత్రి హరీశ్‌ రావు తీర్మానాన్ని ప్రతిపాదించగా.. స్పీకర్‌ మధుసూదనాచారి మూజువాణి ఓటు తో ఆమోదించారు.  శనివారం శాసనసభ సమా వేశం ప్రారంభం కాగానే శుక్రవారం నాటి పరిణామాలను స్పీకర్‌ ప్రస్తావించారు. గవర్నర్‌ ప్రసంగం సందర్భంగా టీడీపీ సభ్యు లు వ్యవహరించిన తీరును, కాంగ్రెస్‌ వాకౌట్‌ ను తప్పుబట్టారు. అలా సభా సంప్రదాయా లకు భిన్నంగా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు.

అనంతరం మంత్రి హరీశ్‌ రావు మాట్లాడారు. స్పీకర్‌ స్వయంగా కోరినా, బీఏసీలో నిర్ణయం తీసుకున్నా కూడా టీడీపీ సభ్యులు పదే పదే సభకు అంతరాయం కలిగిం చారని పేర్కొన్నారు. రేవంత్, సండ్రలను సస్పెండ్‌ చేయాలని ప్రతిపాదిస్తూ హరీశ్‌ తీర్మా నం ప్రవేశపెట్టడం, అది వెంటనే సభ ఆమో దం పొందడం చకాచకా జరిగిపోయాయి. అయితే ఇది అన్యాయమంటూ కాంగ్రెస్‌ సభ్యులు తీవ్ర నిరసన తెలిపారు. ‘ఇది శాసనసభా.. టీఆర్‌ఎస్‌ సభా..? ప్రభుత్వం చేతిలో స్పీకర్‌ కీలుబొమ్మగా మారొద్దు.. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా.. రాచరిక ప్రభుత్వమా..? ’అంటూ నినాదాలు చేశారు.

గతంలో ఏం చేశారో ఆత్మవిమర్శ చేసుకోండి: జానా
కాంగ్రెస్‌ సభ్యుల ఆందోళనతో స్పీకర్‌ మధు సూదనాచారి ప్రతిపక్ష నేత జానారెడ్డికి మాట్లాడే అవకాశం కల్పించారు. దీంతో జానా మాట్లాడుతూ టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌ ప్రజా స్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ‘‘గతంలో ఇదే సభలో నిరసనలు తెలిపిన తీరుపై అధికార పక్ష సభ్యులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అప్పటి ప్రభుత్వం ఎలా వ్యవహ రించింది, ఎలాంటి చర్యలు తీసుకున్నదీ గమనించాలి. కేవలం కక్షతో, సభ్యులను భయభ్రాంతులను చేయాలన్న ఉద్దేశంతో సస్పెండ్‌ చేయడం మంచిది కాదు..’’అని విమర్శించారు. గవర్నర్‌ ప్రసంగంలో ప్రజా సంబంధ అంశాలు లేనందున తాము సైతం సభ నుంచి వెళ్లిపోయి, బయట నిరసన తెలిపామని చెప్పారు.

తాము వాకౌట్‌ కానీ, నిరసన కానీ తెలియజేయలేదన్నారు. అనం తరం బీజేపీపక్ష నేత జి.కిషన్‌రెడ్డి మాట్లాడారు. టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌ సరికాదని, ప్రస్తుతం అధికారంలో ఉన్న సభ్యులు గతంలో ఇంతకన్నా ఎక్కువే చేశారని స్పీకర్‌ దృష్టికి తెచ్చారు. సస్పెన్షన్‌పై పునరాలోచన చేయాలని కోరారు. సభ్యుల సస్పెన్షన్‌ను సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. విపక్షాల విజ్ఞప్తి పట్ల మంత్రి హరీశ్‌రావు స్పందిస్తూ.. సస్పెన్షన్‌కు గురైన సభ్యులు బేషరతుగా క్షమాపణ చెబితే పునరాలోచిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్‌ చేస్తే బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని.. అక్కడో సంప్రదాయం, ఇక్కడో సంప్రదాయమా అని నిలదీశారు. అయితే మంత్రి సమాధానాన్ని నిరసిస్తూ కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు.

విపక్షాల తీరు దురదృష్టకరం: సునీత
ప్రతిపక్షాల సభ్యులు గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకోవడం, వినకుండా వాకౌట్‌ చేయడం దురదృష్టకరమని టీఆర్‌ఎస్‌ సభ్యులు వ్యాఖ్యానించారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై పలువురు మాట్లాడారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ఓర్వలేక విపక్షాలు ఇలా వ్యవహరిస్తున్నాయని గొంగిడి సునీత వ్యాఖ్యానించారు. విపక్షాలకు తమ మనుగడ లేకుండా పోతోందనే భయం పట్టుకుందని, అందుకే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని పువ్వాడ అజయ్‌ పేర్కొన్నారు. తెలంగాణ రావడం చీకటి రోజని ప్రకటించిన పార్టీ కోసం ప్రధాన ప్రతిపక్షం వాకౌట్‌ చేయడం సిగ్గుచేటని విమర్శించారు.

సస్పెన్షన్‌ ఎత్తివేయండి: టీటీడీపీ
రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యలపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలంటూ సీఎల్పీ నేత కె.జానారెడ్డి, టీటీడీపీ నేతలు ఎల్‌.రమణ తదితరులు స్పీకర్‌ను కలసి విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు ఉందని, అంతమాత్రానికే సస్పెండ్‌ చేయడం సభ గౌరవానికి మంచిదికాదని జానారెడ్డి పేర్కొన్నారు. రేవంత్, సండ్రలపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరారు. దీనికి స్పీకర్‌ నిరాకరించడంతో.. కాంగ్రెస్‌ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల సభ్యులు లేకుండా సభ నడపడం మంచిదికాదని పేర్కొన్నారు. స్పీకర్‌ తీరుకు నిరసనగా అసెంబ్లీలో ఏర్పాటు చేసిన భోజనాలను కాంగ్రెస్‌ సభ్యులు తిరస్కరించారు.

మరిన్ని వార్తలు