భూ ఆక్రమణ.. వాల్టా ఉల్లంఘన!

4 Mar, 2020 02:02 IST|Sakshi

1.21 ఎకరాల ప్రభుత్వ భూమిలో ప్రహరీ నిర్మాణం 

రేవంత్‌రెడ్డి భూమి అక్రమ మ్యుటేషన్ల వ్యవహారంపై తుది నివేదిక 

సాక్షి, రంగారెడ్డి జిల్లా: టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వ భూమిని ఆక్రమించడంతో పాటు నీటి వనరులను ధ్వంసం చేసినట్లు రెవెన్యూ అధికారుల విచారణలో తేలింది. ఆక్రమించిన భూమి చుట్టూ ప్రహరీ నిర్మించి గేట్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌కు తుది విచారణ నివేదికను రాజేంద్రనగర్‌ ఆర్డీవో చంద్రకళ సమర్పించారు. శేరిలింగంపల్లి మండలం గోపనపల్లిలోని సర్వే నంబర్‌ 127లో 12.02 ఎకరాలకు ప్రహరీ నిర్మించినట్లు క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా వెల్లడైంది.

ఈ విస్తీర్ణంలో సర్వే నంబర్‌ 34 పరిధిలో 1.21 ఎకరాల భూమి ఉందని తేల్చారు. బండ్లబాటగా ఉన్న మరో 10 గుంటలు నామ రూపాల్లేకుండా పోయిందని గుర్తించా రు. ఈక్రమంలో భూ ఆక్రమణల చట్టాన్ని ప్రయోగించి చర్యలు తీసుకోవచ్చని సిఫారసు చేశారు. 126 సర్వే నంబర్‌ పరిధి కిందికి వచ్చే కోమటికుంట చెరువులోకి నీరు వెళ్లకుండా అడ్డుకునేలా ప్రహరీ ఉందన్నారు.  సదరు ప్రహరీని రేవంత్‌రెడ్డి, ఆయన సోదరులు కొండల్‌రెడ్డి, కృష్ణారెడ్డి నిర్మించినట్లు విచారణలో తేలింది. సర్వే నంబర్‌ 127 లో 5.21 ఎకరాలకు వారసులు/హక్కుదారులు లేరని విచారణలో బహిర్గతమైంది. కోమటికుంట చెరువు ఆక్రమణల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన శేరిలింగంపల్లి తహశీల్దార్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. సర్వేనంబర్లు 127, 218, 34, 35, 160లో విస్తరించిన భూములపై విచారణ నిర్వహించారు. ఈ నివేదికను కలెక్టర్‌.. ప్రభుత్వానికి పంపించినట్లు తెలిసింది.  

ఓటుకు కోట్లు కేసులో కోర్టుకు రేవంత్‌  
సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో నిందితుడైన మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌ రెడ్డి మంగళవారం ఏసీబీ కోర్టు ముందు హాజరయ్యారు. 2015లో ఓటుకు కోట్లు కేసులో అరెస్టయిన రేవంత్‌రెడ్డి కొన్ని నెలలు జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయాలని ఆశ చూపుతూ నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ఇస్తుండగా రేవంత్‌రెడ్డి ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ కేసులో ఏ–1 నిందితుడిగా ఉన్న రేవంత్‌రెడ్డితో పాటు పలువురుపై కేసులు నమోదయ్యాయి. మంగళవారం నిందితులు ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచా రణ ఈ నెల 17వ తేదీకి వాయిదా పడింది.   

కేంద్రానికి దరఖాస్తు చేసుకోండి 
రేవంత్‌రెడ్డికి హైకోర్టు సూచన 
తనకు 4 ప్లస్‌ 4 భద్రత కల్పించేలా కేంద్రానికి మరోసారి దరఖాస్తు చేసుకోవాలని మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డికి హైకోర్టు సూచించింది. రెండు వారాల్లోగా దరఖాస్తు చేసుకుంటే అది అందిన ఆరు వారాల్లో కేంద్ర హోం శాఖ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మంగళవారం ఆదేశాలు జారీచేసింది. ఉమ్మడి ఏపీలో 4ప్లస్‌4 భద్రత ఉన్న తనకు తెలంగాణ వచ్చాక టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2ప్లస్‌2కు తగ్గించిందని, కేంద్ర భద్రత కల్పించాలని 2019 ఆగస్టు 28న కేంద్ర హోం శాఖకు చేసుకున్న దరఖాస్తు పెండింగ్‌లో ఉందంటూ రేవంత్‌ హైకోర్టులో రిట్‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయమూర్తి జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలీ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా