అవినీతిని ఆధారాలతో బయటపెడతా  

28 Aug, 2019 09:33 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ రేవంత్‌రెడ్డి

సాక్షి, ఉప్పల్‌: సోలార్‌ విద్యుత్‌ కొనుగోలుపై జరిగిన అక్రమాలను ఆధార పత్రాలతో ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవినీతిని బట్టబయలు చేస్తానని మల్కాజిగిరి పార్లమెంట్‌ సభ్యులు రేవంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఉప్పల్‌లో పర్యటించిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ లక్ష్మణ్‌లు రాష్ట్ర ప్రభుత్వంతో లాలూచీ లేకపోతే, కమిషన్ల వాటా రాకపోతే ఆధారాలతో కూడిన ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నానని, తదుపరి ఏమి చర్యలు తీసుకుంటారో చూస్తానన్నారు.

బుధవారం, గురువారాలలో నిర్వహించే పత్రిక సమావేశంలో టీఆర్‌ఎస్, బీజేపీల పాము, ముంగిస ఆటలు బట్టబయలు చేస్తానని తెలిపారు.  ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు  కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.40 వేల కోట్ల అవినీతి జరిగిందని డాక్టర్‌ లక్ష్మణ్, జేపీ.నడ్డాలు ఆరోపిస్తున్నారే తప్పా అవినితీపై సీబీఐ విచారణ కానీ, విజిలెన్స్‌ కమిషన్‌ విచారణ కానీ ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. సోలార్‌ పవర్‌ కొనుగోలు మీద అవినీతి జరిగిందని  కేసీఆర్‌ను బ్లాక్‌మేల్‌ చేసి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇది బీజేపీ రాజకీయ ఎత్తుగడన్నారు.  టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్‌ బీజేపీకి మద్దతుగా త్రిబుల్‌ తలాక్‌కు ఓటు వేశారు.

ఆర్టికల్‌ 370 రద్దుకు సంపూర్ణ మద్దతు తెలిపారు. నామనాగేశ్వర్‌రావు బీజేపీ నాయకుల కన్నా ఎక్కువగా నరేంద్రమోడీ, అమిత్‌షాలను పొగుడ్తున్నారన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతామంటేనే హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ టీఆర్‌ఎస్‌కు ఓటు వేయ్యాలని మైనార్టీ సోదరులకు కోరడంతో 9 సీట్లు గెలిచారు. ఇప్పుడు ఏం చూసి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బీజేపీకి, నరేంద్రమోడీకి మద్దతు పలుకుతున్నారని ఇది మైనార్టీ ప్రజలను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు.

>
మరిన్ని వార్తలు