కేంద్ర దర్యాప్తు సంస్థల పర్యవేక్షణలో జరిగేలా ఆదేశించండి

8 Aug, 2017 00:35 IST|Sakshi
డ్రగ్స్‌ కేసులో విచారణపై హైకోర్టులో రేవంత్‌రెడ్డి పిల్‌ 
 
సాక్షి, హైదరాబాద్‌: డ్రగ్స్‌ కేసు విచారణ కేంద్ర దర్యాప్తు సంస్థల పర్య వేక్షణలో జరిపేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఉమ్మడి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. డ్రగ్స్‌ నియంత్రణ విషయంలో నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ)ది కీలక పాత్రని, ఈ సంస్థ సాయం లేకుండా సిట్‌ దర్యాప్తు చేస్తోందని, దీనివల్ల దర్యాప్తు పూర్తిస్థాయిలో జరిగే అవకాశం ఉండదని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి, సిట్, ఎన్‌సీబీ, సీబీఐ, ఈడీ తదితరులను ప్రతివాదులుగా చేర్చారు. డ్రగ్స్‌ వ్యవహారంలో దర్యాప్తు చేస్తున్న సిట్, కేంద్ర స్థాయి దర్యాప్తు సంస్థలైన ఎన్‌సీబీ, రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ డైరెక్టరేట్, కేంద్ర ఆర్థిక ఇంటెలిజెన్స్‌ బ్యూరో, ఈడీ, సీబీఐ తదితర సంస్థల సాయం తీసుకోవడం లేదన్నారు. ఇది సిట్‌ సమన్వయ లోపానికి నిదర్శనమని తెలిపారు.

డ్రగ్స్‌ సమస్య జాతీయ స్థాయి వ్యవహారమని, అందువల్ల కేంద్ర స్థాయి దర్యాప్తు సంస్థల సాయం తీసుకుంటే అనేక కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంటుందన్నారు. కేవలం సినీ రంగానికే డ్రగ్స్‌ పరిమితం కాలేదని, కాలేజీ, పాఠశాల విద్యార్థులు, బహుళ జాతి సంస్థల ఉద్యోగులు బాధితులుగా ఉన్నారని తెలిపారు. గోవా నుంచి డ్రగ్స్‌ సరఫరా అవుతున్నట్లు సిట్‌ విచారణలో తేలిందన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థల పర్యవేక్షణలో కొనసాగించేలా సిట్‌ను ఆదేశించాలన్నారు. 
మరిన్ని వార్తలు