ఖజానాకు కాసుల పంట! 

2 Mar, 2019 02:29 IST|Sakshi

రికార్డులు బద్దలు కొడుతున్న రెవెన్యూ శాఖ 

ఫిబ్రవరిలో రూ.1,040 కోట్ల జీఎస్టీ రాబడి 

జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఇదే అత్యధికం.. సీజీఎస్టీ రూ.934 కోట్లు 

పెట్రో ఆదాయం మరో రూ.739 కోట్లు 

ఫిబ్రవరి 28న రూ.180 కోట్ల మద్యం విక్రయాలు 

సాక్షి, హైదరాబాద్‌: ఫిబ్రవరి నెల రాష్ట్ర ఖజానాకు కాసుల వర్షం కురిపించింది. వస్తు సేవల పన్ను(జీఎస్టీ) కిందే రూ.2 వేల కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. పెట్రో ఉత్పత్తులు, ఎక్సైజ్‌ అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం లెక్క కడితే  రూ.3,700 కోట్లకు చేరింది. జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఈ ఆదాయమే టాప్‌ కాగా, ఫిబ్రవరి 28న ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ.180 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. 

అంచనాలకు మించి.. 
సవరించిన అంచనాల ప్రకారం 2018–19 ఆర్థిక సంవత్సరానికి రూ.28,264 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకోగా ఆర్థిక సంవత్సరం ముగియడానికి నెల ముందుగానే లక్ష్యా న్ని మించి ఆదాయం వచ్చిందని రెవెన్యూ వర్గాలు చెబుతు న్నాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చాక 2018 ఏప్రిల్‌లో రాష్ట్ర జీఎస్టీ (ఎస్‌జీఎస్టీ) కింద రూ.1,021 కోట్ల ఆదాయం వచ్చింది. 2019 ఫిబ్రవరిలో అంతకు మించి రూ.1,040 కోట్లు రావ డం గమనార్హం. అంటే జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఇదే అత్యధిక రాబడి. ఎస్‌జీఎస్టీకి తోడు కేంద్రం ఇచ్చే జీఎస్టీ కింద ఈ నెలలో మరో రూ.934 కోట్లు వచ్చాయి. పెట్రో ఉత్పత్తుల అమ్మకాలపై వ్యాట్‌ కింద రూ.739 కోట్లు సమకూరింది. దీంతో ఒక్క వాణిజ్యపన్నుల శాఖ నుంచే ఈ నెలలో రూ.2,713 కోట్లు ఖజానాలో చేరాయి. 

ఎక్సైజ్‌ అమ్మకాల్లోనూ రికార్డు 
ఈ ఏడాది ఫిబ్రవరి ఎక్సైజ్‌ అమ్మకాల్లోనూ రికార్డు సృష్టించింది. ఈ నెల 28న ఒక్క రోజే రూ.180 కోట్ల మద్యం అమ్మ కాలు జరిగాయి. తెలంగాణ ఏర్పడ్డాక ఇంత పెద్ద మొత్తంలో ఒక్కరోజు మద్యం అమ్మకాలు జరగడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. ఈ నెలలో మొత్తం రూ.1,765 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్‌ వర్గాల లెక్కలు పేర్కొంటున్నారు. ఈ అమ్మకాలపై వ్యాట్‌ ద్వారా ప్రభుత్వానికి రూ.900 కోట్ల ఆదాయం సమకూరింది. 

సమష్టి కృషి వల్లే.. 
ఫిబ్రవరిలో రికార్డు స్థాయి ఆదాయానికి ఆయా శాఖల సిబ్బంది చేసిన కృషి కారణమని ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ వెల్లడించారు. ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని అభినందిస్తూ స్వయంగా ఉద్యోగులకు సందేశాలు పంపారు.  

మరిన్ని వార్తలు