మళ్లీ ఇంకు పడింది

4 Apr, 2015 01:47 IST|Sakshi

సర్టిఫికెట్లపై డిజిటల్ సిగ్నేచర్‌కు రెవెన్యూశాఖ స్వస్తి
వీఆర్వో నుంచి తహశీల్దార్ వరకు దరఖాస్తు పరిశీలన తప్పనిసరి
సర్టిఫికెట్ల జారీలో మరింత జాప్యం తప్పదంటున్న అధికారులు
 
 సాక్షి, హైదరాబాద్:కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియలో రెవెన్యూ యంత్రాంగం ప్రస్తుతం అవలంబిస్తున్న విధానాన్ని సమూలంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు కొత్త ఫార్మాట్‌ను సిద్ధం చేశారు. ధ్రువీకరణ పత్రాలపై గతంలో తహశీల్దారు చేసే డిజిటల్ సిగ్నేచర్‌కు బదులుగా ఇంకు సంతకం పెట్టాల్సిందేనని తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అలాగే దరఖాస్తు స్వీకరణ దగ్గర్నుంచి ధ్రువీకరణ పత్రం జారీ వరకు వివిధ స్థాయిల్లో (వీఆర్వో, ఆర్‌ఐ, డీటీ, తహశీల్దార్ వరకు) ఫైలుపై రిమార్కులు రాయడం తప్పనిసరి చేశారు. అయితే నూతన విధానం వ ల్ల ధ్రువీకరణ పత్రాల జారీలో మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని క్షేత్రస్థాయిలో ఉద్యోగులు, అధికారులు వాపోతున్నారు. మండల రెవెన్యూ కార్యాలయాల్లో సిబ్బంది కొరత, కంప్యూటర్లు పనిచేయకపోవడం, సర్వర్ డౌన్ కావడం, ఇంటర్నెట్ సమస్యలతో ప్రస్తుత విధానంలోనే ఎంతో జాప్యం జరుగుతుంటే ప్రభుత్వం కొత్త ఫార్మాట్ పేరిట మరింత మంది అధికారుల రిమార్కులను ఆన్‌లైన్‌లోనే పొందుపరచమనడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు. రోజూ వేలాది దరఖాస్తులు దాఖలయ్యే మండలాల్లో (ప్రత్యేకించి హైదరాబాద్ జిల్లాలోని ఆసిఫ్‌నగర్, అంబర్‌పేట్, బండ్లగూడ, బహదూర్‌పురా మొదలైనవి) కొత్త విధానం ద్వారా సర్టిఫికెట్ల జారీ సాధ్యం కాదంటున్నారు.
 
 ఇంకుతోనే సంతకం...
 
 దరఖాస్తులు సమర్పించిన మీ-సేవ కేంద్రాల్లోనే గతంలో సర్టిఫికెట్లను ముద్రించి ఇచ్చేవారు. అయితే నూతన విధానంలో ధ్రువీకరణ పత్రం ముద్రణ ఆప్షన్‌ను తహశీల్దారుకే పరిమితం చేశారు. కొత్త ఫార్మాట్ ప్రకారం మీ-సేవ కేంద్రాల నుంచి వచ్చే ఆన్‌లైన్ దరఖాస్తులను తహశీల్దారు సంబంధిత రెవెన్యూ ఇన్‌స్పెక్టర్(ఆర్‌ఐ)లకు ఆన్‌లైన్‌లో బదిలీ చేయాల్సి ఉంటుంది. ఆర్‌ఐలు తమ పరిధిలోని వీఆర్వో ద్వారా దరఖాస్తులోని వివరాలను విచారించాలి. విచారణ పూర్తయిన దరఖాస్తులకు సంబంధించిన రిమార్కులను ఆన్‌లైన్‌లోనే ఆర్‌ఐ నమోదు చేయాలి. ఆ వివరాలను ఆన్‌లైన్‌లోనే డిప్యూటీ తహశీల్దారు (డీటీ) పరిశీలించి తన రిమార్కులను, చెక్‌లిస్ట్ సహా పొందుపరచాలి. ఆపై సదరు దరఖాస్తు వివరాలను, కిందిస్థాయి అధికారుల రిమార్కులను తహశీల్దారు పరిశీలించి మీ-సేవ పత్రాలపై సర్టిఫికెట్‌ను ముద్రించాలి. ముద్రిం చిన పత్రాలపై తప్పనిసరిగా ఇంకు పెన్నుతోనే తహశీల్దారు సంతకం పెట్టాలి. సంతకంతోపాటు కార్యాలయ ముద్రను తప్పనిసరిగా సర్టిఫికెట్‌పై వేయాలని ఉన్నతాధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే తెల్లకాగితంపై మరో కాపీని ముద్రించి ఆఫీస్ కాపీ కింద భద్రపరచాలని ఆదేశించారు.
 
 కోరిన వాళ్లకు ఇంటికే సర్టిఫికెట్..
 
 ప్రభుత్వం నిర్దేశించిన కొత్త ఫార్మాట్ ద్వారా దరఖాస్తుదారు తన ధ్రువీకరణ పత్రాన్ని నేరుగా ఇంటికి వచ్చేలా ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. మీ-సేవ కేంద్రంలో దరఖాస్తు సమర్పించేటప్పుడు ‘పోస్ట్’ ఆప్షన్‌ను ఇస్తే సర్టిఫికెట్ తహశీల్దారు కార్యాలయం నుంచే నేరుగా దరఖాస్తులోని చిరునామాకు పోస్ట్ చేస్తారు. అలా కాని పక్షంలో సదరు సర్టిఫికెట్లు తహశీల్దారు కార్యాలయం నుంచి మీ-సేవ కేంద్రానికి పంపుతారు. దరఖాస్తుదారులు వారి ధ్రువీకరణ పత్రాలను అక్కడ్నుంచి పొందాల్సి ఉంటుంది.
 
 
 డిజిట ల్ విధానాన్నే కొనసాగించాలి
 ధ్రువీకరణ  పత్రాల జారీ ప్రక్రియలో ప్రస్తుతం ఉన్న
 డిజిటల్ విధానానికి అధికారులు అలవాటు పడుతున్న తరుణంలోనే ప్రభుత్వం కొత్త ఫార్మాట్‌ను తీసుకురావడం సరికాదు. క్షేత్రస్థాయిలో అధిక పనిభారాన్ని మోస్తున్న రెవెన్యూ యంత్రాంగానికి ఇది కచ్చితంగా అదనపు భారమే. ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విన్నవించాం. త్వరలోనే సానుకూల ఉత్తర్వులు వస్తాయని ఆశిస్తున్నాం.
 -లచ్చిరెడ్డి, తహశీల్దార్ల సంఘం అధ్యక్షుడు


 

మరిన్ని వార్తలు