కలెక్టర్‌ కట్టె పట్టినా అంతే!

24 Jul, 2019 10:13 IST|Sakshi

జిల్లాలో మొత్తం రైతుల ఖాతాలకు గాను 2,121 ఖాతాలకు సంబంధించి భూములకు ఎలాంటి ఇబ్బందులు లేకున్నా కేవలం సాంకేతిక కారణాలతో డిజిటల్‌ సంతకాలు కాలేదు. రైతులకు సంబంధించి ఆధార్‌ కార్డు నంబర్లు లేవని చెప్పడంతో పాటు ఇతర కారణాలతో వీటిని పక్కన పెట్టారు. ప్రభుత్వం పదేపదే చెబుతున్నా... జిల్లా కలెక్టర్‌ బరిగె పట్టుకున్నట్లుగా వెంటపడుతున్నా క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది తీరు మాత్రం మారడం లేదని చెప్పడానికి ఈ ఉదాహరణలు చాలేమో!

సాక్షి, హన్మకొండ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన(ఎల్‌ఆర్‌యూపీ) కార్యక్రమం జిల్లాలో ప్రహసనంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ ప్రతీ శనివారం ఎల్‌ఆర్‌యూపీ సమస్యలపై డీఆర్వో నుంచి వీఆర్వో స్థాయి వరకు అధికారులతో నేరుగా సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆ వారంలో సాధించిన, ఇంకా సాధించాల్సిన ప్రగతిపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.

ముఖ్యంగా ప్రజావాణికి వచ్చిన భూసమస్యల విషయంలో అధికారులు తక్షణం స్పందించాలని, రైతుల సమస్యలు పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశిస్తున్నారు. అయినా కొందరు అధికారుల్లో మార్పు రావడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూలాల్లోకి వెళ్లి సమస్యలు పరిష్కారం చేసే ఉద్దేశం వారిలో కనిపించడంలేదు. అలా కాకపోతే ఉద్యోగులు ‘ఆశించిన ఫలితం’ దక్కడం లేదనే భావనతో కొన్ని పనులు పక్కన పడేస్తున్నారు.

మరికొన్నిచోట్ల సర్వేల పేరుతో పెండింగ్‌లో పెడుతున్నారు. సర్వే పూర్తి చేసుకుని తమ భూమి రికార్డుల్లో నమోదు చేయమని వెళ్తే ఆ సర్వే నంబర్‌లో ఖాళీ లేదని చెబుతున్నారు. లేదంటే చుట్టుపక్కల ఉన్న అందరూ కలిపి సర్వే చేయించుకోండి అంటూ ఉచిత సలహా ఇస్తున్నారు. దీంతో రైతులు వీఆర్వోలు, మండల కార్యాలయాల చుట్టూ తిరగలేక అలిసిపోతున్నారు. చివరకు మళ్లీ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడానికి ప్రతీ సోమవారం కలెక్టరేట్‌కు వస్తున్నారు. 

పైసలిస్తేనే పని...
అర్బన్‌ జిల్లాలో మెజార్టీ మండలాల్లో భూములు విలువ ఎకరానికి రూ.కోట్లల్లో ఉంది. ఇలాంటి చోట రైతు బందు పథకంతో పాటు విలువైన భూమిని తమ పేరుతో భద్రంగా ఉంచుకోవాలని రైతులు ఆరాటపడటం సహజం. దీనిని అదనుగా తీసుకుని రెవెన్యూ సిబ్బంది తమకు అడినంత ఇస్తేనే పనిచేస్తున్నారు. కొన్నిచోట్ల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో మిలాఖత్‌ అయి పక్కన భూములు ఉన్న రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.  భూమికి మార్కెట్‌లో ఉన్న ధరను బట్టి రెవెన్యూ సిబ్బంది తమ కమీషన్‌ డిమాండ్‌ చేన్నారు. రూ.కోట్లల్లో ధర ఉన్నచోట రూ.లక్షల్లో ఇవ్వాల్సిందే. రైతులకు సంబంధించి అన్ని రుజువులు ఉన్నా అడిగినంత ఇస్తేనే పనులు చేస్తున్నారు.

21 శాతం పార్ట్‌ బీలో...
రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన ప్రారంభం నుంచి ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 1,31,210 ఖాతాలతో పాస్‌ పుస్తకాలు మంజూరు చేశారు. ఇందులో 89,243 ఖాతాలు అంటే 68శాతం వ్యవసాయ భూములకు సంబంధించినవి ఉన్నాయి. మిగతా వాటిలో 14,430 అంటే 11శాతం వ్యవసాయేతర భూములు, ప్రభుత్వ అసైన్డ్‌ లాండ్స్‌కు ఖాతాలు మంజూరు చేశారు. ఈ లెక్కన వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు మొత్తంగా 1,03,673 ఖాతాలతో రైతులకు పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు మంజూరు చేశారు.  మిగతా 21 శాతం అంటే 27,537 ఖాతాలు పార్ట్‌ ‘బీ’ భూములకు సంబంధించినవి ఉన్నాయి.

మరిన్ని వార్తలు