రెవెన్యూ ప్రక్షాళన!

19 Jun, 2019 11:57 IST|Sakshi

భూ రికార్డుల ప్రక్షాళన నుంచి రెవెన్యూ సేవలు పూర్తిగా నత్తనడకన సాగుతున్నాయి. పట్టా మార్పిడిలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అక్రమంగా ఇతరులకు పట్టాలు చేయడం, కబ్జాదారులకు సిబ్బంది పరోక్షంగా సహకరిస్తుండడం, తప్పుడు సర్వే నంబర్లు నమోదు తదితర ఆరోపణలు కోకొల్లలు. పైగా తమ సమస్యల పరిష్కారం కోసం రైతులు, సాధారణ ప్రజలు నిత్యం పనులు మానుకొని తహసీల్దార్‌ కార్యాలయాలకు చెప్పులరిగేలా తిరుగుతున్నా ఫలితం లేకుండా పోతోంది. పాస్‌పుస్తకాల కోసం తిప్పించుకోవడం, రికార్డుల్లో తప్పులు సరిదిద్దడంలో ఎనలేని నిర్లక్ష్యాన్ని రెవెన్యూ సిబ్బంది ప్రదర్శిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రైతులు, అధికారులు ఆమ్యామ్యాలు సమర్పించుకున్నా పనుల్లో పురోగతి లేదు. ఓపిక నశించిన కొందరు రైతులు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనలూ జిల్లాలో చోటుచేసుకున్నాయి. అంతేకాకుండా చాలా మంది అధికారులపై డీఆర్‌ఓ, జాయింట్‌ కలెక్టర్, కలెక్టర్‌కు ఫిర్యాదులు అందాయి. వీటిని పరిగణించిన యంత్రాంగం ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఒకే ప్రాంతంలో ఎక్కువ కాలం పనిచేసిన వారిని బదిలీ చేస్తోంది. ఈ చర్యలపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎట్టకేలకు జిల్లా రెవెన్యూశాఖలో ప్రక్షాళన మొదలైంది. అవినీతి ఆరోపణలు, సేవల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే విమర్శల నేపథ్యంలో అధికారులపై బదిలీ వేటు పడుతోంది. కేడర్‌ వారీగా ఉద్యోగులకు స్థాన చలనం కల్పిస్తున్నారు. మూడురోజుల కిందట గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్‌ఓ)ను మూకుమ్మడిగా బదిలీ చేసి పోస్టింగ్‌లు ఇచ్చిన యంత్రాంగం.. తాజాగా డిప్యూటీ తహసీల్దార్లను మార్చింది. 13 మందిని బదిలీ చేసి ఆయా ప్రాంతాల్లో పోస్టింగ్‌లు ఇచ్చింది. భూ వ్యవహారాల్లో కిందిస్థాయి నుంచి ఉన్నతస్థాయి అధికారుల వరకు అందిన కాడికి వెనకేసుకుంటున్నట్లు బహిరంగంగానే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికితోడు ఒకే స్థానంలో ఏళ్ల తరబడి పాతుకుపోయి స్థానికంగా పలుకుబడి ఉన్న వ్యక్తులు, రాజకీయ నాయకులతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు.

అర్హులకు పదోన్నతులు.. 
ఒక పక్క బదిలీలు చేస్తున్న యంత్రాంగం.. మరోపక్క అర్హులకు పదోన్నతులు కల్పిస్తోంది. సీనియారిటీ ప్రాతిపదికన 32 మంది వీఆర్‌ఓలకు నాయబ్‌ తహసీల్దార్‌ కేడరైన సీనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించింది. అలాగే మరో 14 మంది సీనియర్‌ అసిస్టెంట్లను రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లుగా, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లను సీనియర్‌ అసిస్టెంట్లుగా బదిలీ చేసి పోస్టింగ్‌లు ఇచ్చారు. రెవెన్యూశాఖలో సీనియర్‌ అసిస్టెంట్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులను నాయబ్‌ తహసీల్దార్‌ కేడర్‌గా పరిగణిస్తారు. అయితే, ఒక్కో అధికారి సీనియర్‌ అసిస్టెంట్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా రెండేళ్ల చొప్పున పనిచేయాల్సి ఉంటుంది. అంటే నాయబ్‌ తహసీల్దార్‌ కేడర్‌లో నాలుగేళ్ల పాటు పనిచేసిన వారికి డిప్యూటీ తహసీల్దార్లుగా పదోన్నతులు కల్పిస్తారు.

త్వరలో తహసీల్దార్ల బదిలీలు! 
వీఆర్‌ఓ నుంచి డిప్యూటీ తహసీల్దార్ల వరకు అధికారుల బదిలీలు జరిగాయి. ఇక మిగిలింది తహసీల్దార్లు, ఆపై స్థాయి అధికారులే. వీరికి కూడా త్వరలో స్థాన చలనం తప్పదని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు 12 మంది తహసీల్దార్లు ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లారు. ఎన్నికల విధుల్లో ప్రత్యక్షంగా పాల్గొనే అధికారులను బదిలీ చేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఆదేశాల మేరకు వీరికి స్థానచలనం కలిగింది. హైదరాబాద్‌కు ఎనిమిది మంది, సంగారెడ్డి జిల్లాకు ముగ్గురు, నల్లగొండకు ఒకరు బదిలీ అయ్యారు. ఒకే ప్రాంతంల్లో మూడేళ్ల పాటు పనిచేయడంతోపాటు మాతృ జిల్లాలకు చెందిన తహసీల్దార్లకు బదిలీ వర్తించింది. ఎన్నికలు ముగియడంతో వారు తిరిగి మన జిల్లాకు బదిలీపై వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
 
ఎంపీడీఓలు కూడా 
శాసనసభ ఎన్నికల సమయంలో ఎంపీడీఓలు బదిలీపై వెళ్లారు. మూడేళ్లపాటు ఒకే ప్రాంతంలో పనిచేసిన 19 మందికి స్థాన చలనం కలిగింది. వీరు కూడా త్వరలో జిల్లాకు రానున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ విషయం ప్రభుత్వం పరిశీలనలో ఉందని పేర్కొంటున్నాయి.

మరిన్ని వార్తలు