నోటు పడితేనే..

27 Jul, 2019 11:14 IST|Sakshi

నగరంలోని ఖైరతాబాద్‌ తహసీల్‌ పరిధిలో మమతాదేవి (పేరు మార్చాం) కుటుంబం ‘ఫ్యామిలీ మెంబర్‌షిప్‌ సర్టిఫికెట్‌’ కోసం ఏప్రిల్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారు. ఇప్పటి వరకు ఆ దరఖాస్తుపై కనీసం విచారణ కూడా చేయలేదు. ఆమె అప్పటి నుంచి తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ‘మళ్లీ వారం’ అంటూ తిప్పి పంపడం సర్వసాధారణమైంది. గ్రేటర్‌లోని ఇతర తహసీల్దార్‌ కార్యాలయాల్లో సైతం పరిస్థితి దీనికి భిన్నంగా ఏం లేదు. ప్రజలు కుల, ఆదాయ, నివాస, ఫ్యామిలీ మెంబర్‌షిప్‌ సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తులు చేసుకుని నెలల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. సాక్షాత్తు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్య తీరుకు ఇది నిలువుటద్దం. ప్రభుత్వ భూముల పర్యవేక్షణ పక్కన పెడితే కనీసం వివిధ ధ్రువీకరణ పత్రాల జారీలో కూడా సిబ్బంది నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు.  

సాక్షి, సిటీబ్యూరో: రాజధాని నగరంలో గల మండల రెవెన్యూ (తహసీల్దార్‌) కార్యాలయాలకు అందుతున్న వివిధ ధ్రువీకరణ పత్రాల దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా పెండింగ్‌లో పడిపోతున్నాయి. కనీసం క్షేత్ర స్థాయి విచారణకు నోచుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కింది స్థాయి విభాగాల సిబ్బందికి చేయి తడిపనిదే దరఖాస్తుల్లో కదలిక తేవవడం లేదనే విమర్శలు అధికమవుతున్నాయి. ప్రతి తహసీల్దార్‌ ఆఫీసు ముందు దళారులు తిష్ట వేయడం.. వారి ద్వారా అందిన దరఖాస్తులపైనే విభాగాల సిబ్బంది దృష్టి సారించడం బహిరంగ రహస్యంగా మారింది. దీంతో కుల, ఆదాయ, నివాస, ఫ్యామిలీ మెంబర్‌షిప్‌ తదితర దరఖాస్తులకు నిర్ణీత వ్యవధిలో మోక్షం లభించడం లేదు. మరోవైపు దరఖాస్తుల అత్యవసరాలను బట్టి మీసేవా, ఈసేవా కేంద్రాల నిర్వాహకుల్లో కొందరు అక్రమ మార్గాలను అవలంబిస్తున్న సంఘటనలు కూడా ఇటీవల వెలుగు చూస్తున్నాయి. ఉన్నతాధికారులు పర్యవేక్షణ కొరవడంతో రెవెన్యూ సిబ్బంది పనితీరు అధ్వానంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

ఆన్‌లైన్‌ ద్వారా..
విద్యార్థులు, నిరుద్యోగులు, పేద కుటుంబాలు వివిధ ధ్రువీకరణ పత్రాల కోసం మీసేవా, ఈసేవా కేంద్రాల ద్వారా  మండల తహసీల్దార్లకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని సంబంధిత పత్రాల కాపీలను కార్యాలయాల్లో అందిస్తున్నారు. దరఖాస్తుల పత్రులు అందిన వెంటనే వాటిపై క్షేత్ర స్థాయి విచారణ చేసి సంబంధిత వీఆర్వోలు రెవెన్యూ ఇన్స్‌పెక్టర్లకు సిఫార్సు చేయాలి. రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ల నివేదక ఆధారంగా సంబంధిత అధికారి దరఖాస్తులపై నిర్ణయం తీసుకుంటారు. అయితే, దరఖాస్తులపై క్షేత్రస్థాయి విచారణ సకాలంలో చేయకుండా పెండింగ్‌లో పెడుతున్నారు. ధ్రువీకరణ పత్రాలను సిటిజన్‌ చార్టర్‌ వ్యవధి లోపల విచారణ పూర్తిచేసి ఆమోదమో.. లేక తిరస్కరణో చేయాలి. కానీ వాటి అమలు మాత్రం కానరావడంలేదు. దీంతో దరఖాస్తుదారులు ధ్రువీకరణ పత్రాల కోసం తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం ఉండడం లేదు.  

రోజుకు 50 దరఖాస్తులు
హైదరాబాద్‌ రెవెన్యూ జిల్లా పరిధిలో 16 తహసీల్దార్‌ కార్యాలయాలు ఉన్నాయి. మీసేవా, ఈసేవా ద్వారా ఆన్‌లైన్‌లో నమోదైన వివిధ ధ్రువీకరణ పత్రాల  దరఖాస్తులు కాపీలు నిత్యం సగటున 30 నుంచి 50 తగ్గకుండా ప్రతి కార్యాలయానికి అందుతున్నాయి. సంబందిత బాధ్యులు దరఖాస్తులపై సిటిజన్‌ చార్టర్‌ వ్యవధిలోగా విచారణ పూర్తి చేయాల్సి ఉండగా, పెండింగ్‌లో పడేయడం సాధారణమైంది. దరఖాస్తు దారులు నేరుగా సమర్పించే దరఖాస్తులపై సిబ్బంది దృష్టిపెట్టకపోవడం గమనార్హం. గత రెండు నెలల వ్యవధిలో మీ సేవా, ఈసేవాల ద్వారా 10 వేలకు పైగా దరఖాస్తులు తహసీల్దార్ల లాగిన్‌కు అందితే అందులో కేవలం 4 వేల దరఖాస్తులు మాత్రమే క్షేత్ర స్థాయి విచారణ, అమోదం, తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన దరఖాస్తులు పెండింగ్‌లోనే పడిపోయాయి. ఆయా కార్యాలయాల ముందు తిష్ట వేసిన దళారులు దరఖాస్తుదారుడి వసరాన్ని బట్టి రూ.500 నుంచి రూ.2 వేల వరకు వస్తూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు