రెవెన్యూ సమస్య 

17 Jun, 2018 11:43 IST|Sakshi
రాత్రిపూట రికార్డుల పనులు చేస్తున్న రెవెన్యూ సిబ్బంది (ఫైల్‌)

అసలే సిబ్బంది కొరత.. ఆపై అదనపు పనిభారం.. రికార్డుల ప్రక్షాళనకు తక్కువ గడువు.. వేధిస్తున్న సాంతికేక సమస్యలు.. దీంతో రెవెన్యూ ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. పని ఒత్తిడి తగ్గించకపోతే సమ్మె బాట పట్టాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

కామారెడ్డి క్రైం : భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు రైతుబంధు పథకాన్ని అమలులోకి తీసుకువచ్చే ఉద్దేశంతో రాష్ట్ర ప్ర భుత్వం రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రారంభించిన వి షయం తెలిసిందే. మూడు నెలల్లో రికార్డుల ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం గడువు విధించింది. దీంతో గ్రామ, మండల, జిల్లా స్థాయి రె వెన్యూ అధికారులు, సిబ్బంది తీరికలేకుండా పనిచేసి మొదటి విడత కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఆపై రైతుబంధు అమలు, పాస్‌బుక్కుల జారీ తదితర ప్రక్రియలోనూ రెవెన్యూ   సిబ్బంది పాల్గొన్నారు. ఆగమేఘాల మీద పనులు చేయాల్సి రావడంతో పాసుబుక్కులు, రైతుబంధు చెక్కుల్లో చాలా పొరపాట్లు దొర్లాయి. ఇదే సమయంలో రికార్డుల ప్రక్షాళనకు ఉపయోగిస్తున్న సా ఫ్ట్‌వేర్‌ తరచుగా మొరాయిస్తుండడంతో పనులకు ఆటంకం కలుగుతూనే ఉంది. ప్రక్షాళన, రైతుబం ధు పాస్‌పుస్తకాల, చెక్కుల పంపిణీ, ఫిర్యాదుల స్వీకరణ, తప్పుల సవరణ తదితర పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలున్నాయి.

దీంతో సిబ్బం ది ఒత్తిడిలో పనిచేస్తున్నారు. ఓవైపు సాంకేతిక సమస్యలతో పనులు ఆలస్యం అవుతుండడం, మ రోవైపు త్వరగా పనులు పూర్తి చేయాలంటూ అధికారులనుంచి ఒత్తిడి పెరుగుతుండడంతో మానసి కంగా ఇబ్బంది పడుతున్నామని రెవెన్యూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక సమస్యలకు తోడు సిబ్బంది కొరత వేధిస్తోందని, దీం తో పనులు వేగంగా సాగడం లేదని పేర్కొంటున్నారు.  రాష్ట్రప్రభుత్వం గత సెప్టెంబర్‌ 15 న భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. మొదట మూడు నెలల్లో ప్రక్షాళన పూర్తవుతుందనుకున్నారు. ఇప్పటికి పది నెలలు గడిచినా ఒక కొలిక్కి రాలేదు. ఇంకా పార్ట్‌–బి కి సంబంధించిన భూ రికార్డుల ప్రక్షాళనను ప్రారంభించనే లేదు. ఎక్కువ సమయం ఇవ్వడం ద్వారా పని ఒత్తిడి నుంచి బయటపడేయాలని రెవెన్యూ ఉద్యోగులు కోరుతున్నారు.  

విధుల్లో ఒత్తిళ్లు...  
భూ రికార్డుల ప్రక్షాళన ప్రారంభం అయ్యాక రెవెన్యూ సిబ్బందికి పనిభారం ఎక్కువైంది. భూ సర్వే, వివరాల నమోదు, ఆన్‌లైన్‌ ఎంట్రీలు, వన్‌ బీల తయారీ, తప్పుల సవరణ, ఫిర్యాదుల స్వీకరణ, డిజిటల్‌ పాస్‌బుక్కుల తయారీకి ఏర్పాట్లు, రైతు బంధు చెక్కులు, పాస్‌బుక్కుల పంపిణీ లాంటి అన్ని కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు ఉన్నతాధికారులు మండల, గ్రామస్థాయి అధికారులకు లక్ష్యాలను నిర్దేశించారు. నిర్దేశిత సమయాన్ని కేటాయించి పనులు అప్పగించారు. అంతేగాకుండా పనులు చేపడుతున్న తీరుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సిబ్బందిని ఉరుకులు, పరుగులు పెట్టించారు. రైతుబంధు చెక్కుల పంపిణీ దృష్ట్యా ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉండటంతో గడువులోగా పనులు పూర్తి చేయాల్సిన పరిస్థితి తప్పనిసరైంది. రాత్రిపగలనక పనులు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో సిబ్బంది ఒత్తిడికి గురవుతున్నారని రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు పేర్కొంటున్నారు. లక్ష్యం పెద్దదిగా ఉండడం, సమయం తక్కువగా ఉండడంతో తీవ్ర ఒత్తిడిలో పనిచేయాల్సి వస్తోందంటున్నారు. పని ఒత్తిడి తగ్గించాలని కోరుతున్నారు.  

సాంకేతిక సమస్యలు...  
లక్ష్యాన్ని చేరుకోవడంలో రెవెన్యూ ఉద్యోగులకు సాంకేతిక సమస్యలు తలనొప్పిగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందజేసిన సాప్ట్‌వేర్‌ సక్రమంగా పనిచేయడం లేదని ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అష్టకష్టాలు పడి పనులు పూర్తి చేశామంటున్నారు. సాంకేతిక సమస్యలు, ఆన్‌లైన్‌ కనెక్షన్లు అస్తవ్యస్తంగా ఉండడం ఇబ్బందులు తప్పడం లేదని, పనులు ఆలస్యం అవుతున్నాయని పేర్కొంటున్నారు. వారంలో మూడు, నాలుగుసార్లు ఉన్నతాధికారులు గ్రామాల పర్యటిస్తుండడం కూడా సిబ్బందికి తలనొప్పిగా మారింది. రివ్యూలకే రోజుల తరబడి ఫైళ్లు మోసుకుంటూ తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు. 

వేధిస్తున్న సిబ్బంది కొరత....  
అసలే పని ఒత్తిడి తీవ్రంగా ఉన్న రెవెన్యూ శాఖను సిబ్బంది కొరత మరో విధంగా వేధిస్తుంది. కలెక్టరేట్‌లో ఆరుగురు తహసీల్దార్‌ పోస్టులు ఉండగా.. ప్రస్తుతం ఇద్దరే పనిచేస్తున్నారు. జిల్లా రెవెన్యూ అధికారి పోస్టే ఖాళీగా ఉంది. డీఆర్వో మణిమాల ఉద్యోగ విరమణ పొందాక ఆ స్థానం ఖాళీగానే ఉండిపోయింది. జిల్లాలో మొత్తం 31 మంది తహసీల్దార్‌లు ఉండాలి. కానీ 24 మందితో వెళ్లదీస్తున్నారు. పిట్లం, నాగిరెడ్డిపేట మండలాలకు ఇన్‌చార్జీలే ఉన్నారు. భిక్కనూరు తహసీల్దార్‌ రిటైరవడంతో అక్కడా ఇన్‌చార్జియే పనులు చూస్తున్నారు. జిల్లాలో 42 మంది డిప్యూటీ తహసీల్దార్‌ పోస్టులకుగాను 36 మందే పనిచేస్తున్నారు. సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 50 ఉండగా.. 22 మంది, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు 44 ఉండగా.. 22 మంది విధుల్లో మాత్రమే ఉన్నారు.  

జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 45కుగాను 31 మందే ఉన్నారు. జిల్లాలోని అన్ని రెవెన్యూ కార్యాలయాల్లో కలిపి 87 మంది అటెండర్‌లు ఉండాల్సి ఉండగా.. 49 మంది మాత్రమే ఉన్నారు. క్షేత్రస్థాయిలో అత్యంత కీలకమైన పోస్టు వీఆర్‌వోది. ఒక గ్రామానికి సంబంధించిన పూర్తిస్థాయి రికార్డులు, రెవెన్యూ వ్యవహారాలు చూసుకునే బాధ్యత వారిదే.. జిల్లాలో 255 వీఆర్వో పోస్టులు ఉండగా.. 207 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. మిగిలిన గ్రామాల్లో ఇన్‌చార్జీలే ఉన్నారు. దీంతో ఇన్‌చార్జీలుగా ఉన్న గ్రామాల్లో రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం వేగంగా సాగడం లేదు. జిల్లాలో వీఆర్‌ఏ పోస్టులు 1,523 ఉండగా.. 1,424 మంది పనిచేస్తున్నారు. భూ రికార్డుల ప్రక్షాళన, రైతుబంధు పథకాల పనుల భారాన్ని దృష్టిలో ఉంచుకుని పరిశీలిస్తే జిల్లా రెవెన్యూశాఖలో ఉన్న ఖాళీల ప్రభావం తీవ్రంగానే పడుతోంది. ఈ ఖాళీలను, సాంకేతిక సమస్యలను పనిభారాన్ని దృష్టిలో పెట్టుకునైనా తమపై ఒత్తిడి తగ్గించాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే అన్ని జిల్లాలలో కలెక్టర్లకు వినతిపత్రాలు అందించారు. ఒత్తిడి తగ్గించకపోతే సమ్మెకైనా వెనుకాడబోమని పేర్కొంటున్నారు. 

మరిన్ని వార్తలు