రెవె‘న్యూ’ సవాళ్లు..!

7 Nov, 2019 10:41 IST|Sakshi

 ‘పార్ట్‌–బి’ భూములతో సమస్యలు 

అందుబాటులోకి రాని ‘ధరణి’..! 

సాక్షి, సిరిసిల్ల: భూమి సూర్యుడి చుట్టు తిరిగితే.. మనిషి భూమి చుట్టు తిరుగుతున్నారు. మార్కెట్‌లో భూమి విలువ గణనీయంగా పెరిగడంతో భూవివాదాలు తలెత్తుతున్నాయి. భూమి కోసం మనిషి ఎంతకైనా తెగించే పరిస్థితి దాపురించింది. పట్టణీకరణ నేపథ్యంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పేరిట సాగులో లేని భూములకు సైతం పెట్టుబడి సాయం ఇవ్వడంతో పట్టా ఉంటే చాలు.. కబ్జాలో లేకున్నా సరే అన్న రీతిలో భూమి హక్కుల కోసం రెవెన్యూ అధికారులపై ఒత్తిళ్లు పెరిగాయి. ఆరు నెలలపాటు భూరికార్డుల ప్రక్షాళన పేరిట అధికారులు తాతల నాటి భూరికార్డులను శుద్ధి చేసేందుకు ఉపక్రమించగా.. ఇదే అదనుగా అనేక ప్రాంతాల్లో కొత్త సమస్యలకు తెరలేచింది.

భూరికార్డుల శుద్ధీకరణలో లోటుపాట్లుతో.. రెవె‘న్యూ’ సవాళ్లను ఎదుర్కొంటోంది. అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డిని సురేశ్‌ అనే వ్యక్తి సజీవంగా దహనం చేయడంతో రెవెన్యూ యంత్రాంగంలో అభద్రతాభావం నెలకొంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో చేపట్టిన భూప్రక్షాళన కొత్త సమస్యలకు తెరలేపినట్లు అయింది. ఉమ్మడి జిల్లాలో భూ సమస్యలు.. సవాళ్లపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. 

సాంకేతిక సమస్యలు.. 
రెవెన్యూ శాఖను సాంకేతిక సమస్యలు వేధిస్తున్నాయి. ఆన్‌లైన్‌ సమస్యలు, ధరణి సైట్‌ సరిగా లేకపోవడం, స్థానిక అధికారులకు తెలియకుండానే రికార్డుల్లో తప్పులు రావడం వంటి సమస్యలు ఉన్నాయి. కానీ కొన్ని మండలాల్లో పైరవీకారుల ప్రవేశంతో రికార్డుల్లో అధికారులు చేయి చేసుకుని కావాలనే మార్పులు చేసినట్లు ఆరోపణలున్నాయి. పార్క్‌–బీ పేరిట వివాదాస్పదమైన భూములను, కోర్టు కేసులు, అటవీ భూములు, దేవాదాయ భూములు, చెరువు శిఖం భూములు, అన్నదమ్ముల వివాదాలు ఉన్న భూములను పార్ట్‌–బీలో చేర్చారు. దీంతో ఆ భూముల జోలికి వెళ్లకుండానే రెవెన్యూ అధికారులు ఉమ్మడి జిల్లాలో భూరికార్డుల ప్రక్షాళన పూర్తి చేశారు.

దీంతో కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. తాము కబ్జాలో ఉన్నామని, తమకు పాస్‌ బుక్కులు ఎందుకు జారీ కావడం లేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. క్షేత్రస్థాయి సర్వేలు సమగ్రంగా లేక.. సాంకేతిక సమస్యలు అడ్డు రావడంతో రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయిలో రికార్డులను శుద్ధిచేయలేకపోయారు. ఈ కారణంగా ఇప్పుడు కొత్త సమస్యలు వస్తున్నాయి. కొందరు రెవెన్యూ అధికారులు రైతులను డబ్బులు డిమాండ్‌ చేస్తూ.. ఏసీబీకి పట్టుబడుతున్న ఘటనలు రెవెన్యూ అవినీతికి అద్దం పడుతోంది.

పని ఒత్తిడి కారణంగా సాప్ట్‌వేర్‌ సమస్యలతో రెవెన్యూ యంత్రాంగం సతమతమవుతోంది. ఏదీ ఏమైనా టైటిల్‌ గ్యారంటీ లేక.. భూవివాదాల పరిష్కరం లేక.. రెవెన్యూ క్షేత్రస్థాయి సిబ్బందికి భూరికార్డులపై అవగాహన లేక సమస్యలు సవాళ్లు విసురుతున్నాయి.

ఏడాదిగా చర్యలు లేవు.. 
మాది పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగారం. గ్రామ శివారులోని సర్వే నంబర్‌ 91లో 17 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎస్సీ కార్పేషన్‌ ద్వారా  కొనుగోలు చేశారు. ఊరిలోని ఎస్సీలకు పంపిణీ చేశారు. అదే భూమిని సదరు పట్టాదారు సోలార్‌ కంపెనీకి విక్రయించాడు. గ్రామ  వీఆర్వో.. ఆర్‌ఐను జిల్లా కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు. చిన్న ఉద్యోగులను బలి చేసి ఊరుకున్నారు. ఏడాదిగా అసలు బాధ్యులపై ఎలాంటి చర్యలు లేవు. 
– రవీందర్‌రెడ్డి, నాగారం

పని ఒత్తిడి ఉంది.. 
రెవెన్యూ అధికారులపై చాలా పని ఒత్తిడి ఉంది. ఏళ్ల నాటి భూసమస్యలు స్వల్ప కాలంలో తీర్చాలంటే కాదు. సాంకేతిక సమస్యలు ఉన్నాయి. సాఫ్‌వేర్‌ సమస్యలు ఉన్నాయి. భూమి విషయంలో సొంత అన్నదమ్ములే కొట్టుకుంటున్నారు. కోర్టు వివాదాలు ఉన్నాయి. ఇన్ని సమస్యలు ఉండగా.. అన్నింటికీ రెవెన్యూను బాధ్యులను చేస్తున్నారు. తహసీల్దార్‌ సజీవ దహనం ఎంతో బాధించింది.
– ఎన్‌.ఖిమ్యానాయక్,  డీఆర్వో, రాజన్న సిరిసిల్ల 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా