-

గూడు గుబులు!

22 Jun, 2020 10:11 IST|Sakshi
సయ్యద్‌సాబ్‌కా బాడలోని డబుల్‌ బెడ్రూం ఇళ్ల సముదాయం ,లతీఫాబీ

డబుల్‌ బెడ్రూం ఇళ్లపై అధికారుల జులుం!!

ఓ ఇంటి వివాదాన్ని బూచిగా చూపించి..  

పలు గృహాలను సీజ్‌ చేసిన రెవెన్యూ సిబ్బంది

బేరసారాలతో మభ్యపెడుతున్న దళారులు

సయ్యద్‌ సాబ్‌కా బాడ లబ్ధిదారుల్లో ఆందోళన  

ఈ చిత్రంలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు లతీఫాబీ. వయసు 90 ఏళ్లు. పాతబస్తీలోని డబీర్‌పురా బిడ్జ్రి సమీపంలోని మురికివాడ సయ్యద్‌ సాబ్‌కా బాడలో నివసిస్తోంది. పిల్లలు పెళ్లిళ్లు చేసుకుని వేరుగా ఉంటున్నారు. భర్త మహ్మద్‌ ఖాసీం కొన్నాళ్ల క్రితమే మృతి చెందారు. లతీఫాబీ జీవనోపాధి కోసం స్థానికంగా ఓ చిల్లర కొట్టు పెట్టుకుని ఒంటరిగా జీవిస్తోంది. గతంలో ఆమెకు డబుల్‌ బెడ్రూం ఇల్లు మంజూరైంది.  భవన సముదాయంలోని రెండో అంతస్తులోని ఎస్‌ఎఫ్‌/11లో లతీఫాబీ ఒంటరిగా నివసిస్తోంది. కాలక్షేపం కోసం ఆమె అప్పుడప్పుడూ భవన సముదాయంలోని కింది అంతస్తులోని ఫ్లాట్స్‌కు వెళ్లి వస్తూ ఉంటుంది. ఈ నెల 6న రెవెన్యూ అధికారులు భవన సముదాయంలోని ఒక ఇంటి వివాదం విషయంలో వచ్చి లతీఫాబీ ఇంటిని సీజ్‌ చేసి వెళ్లిపోయారు. గూడు లేని పక్షిగా మారడంతో చుట్టుపక్కల వారు పెట్టింది తింటూ.. పదిహేను రోజులుగా భవన సముదాయం వరండాలోదిగులుతో అలమటిస్తోంది ఆ దీనురాలు.

సాక్షి, సిటీబ్యూరో: దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదనే చందంగా మారింది డబుల్‌ బెడ్రూం లబ్ధిదారుల పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మురికివాడల్లో నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇళ్లు పేదలకు శాశ్వత గూడు పరిష్కారం చూపిస్తున్నా.. ఆ తర్వాత చీటికీ మాటికీ రెవెన్యూ సిబ్బంది వేధింపులు మాత్రం తప్పడం లేదు. ఉన్నతాధికారులు ఆదేశాలు లేనప్పటికీ డబుల్‌ బెడ్రూం ఇళ్ల భవన సముదాయంలోని ఒకటి రెండు ఇళ్ల వివాదాలను బూచిగా చూపిస్తూ అందరినీ ఒకే గాటన కడుతున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా లబ్ధిదారుల ఇళ్లను సీజ్‌ చేస్తుండటం విస్మయానికి గురిచేస్తోంది. ఇదే అదనుగా కొందరు దళారులు రంగంలోకి దిగి ‘రెవెన్యూ’తో సమస్య లేకుండా చేస్తామంటూ లబ్ధిదారులతో బేరసారాలకు దిగడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఇదీ విషయం..
పాతబస్తీలోని డబీర్‌పురా బిడ్జ్రీ సమీపంలోని ఉంది సయ్యద్‌ సాబ్‌కా బాడా ప్రాంతం. నిజాం హయాం నుంచే కొన్ని కుటుంబాలు ఇళ్లు నిర్మించుకొని ఏళ్ల తరబడి నివాసం ఉంటున్నాయి.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంకంగా నిర్మిస్తున్న డబుల్‌ బెడ్రూం భవన సముదాయాల కోసం  అక్కడి నివాసం ఉంటున్న పేద కుటుంబాలందరికీ శాశ్వత గూడు కల్పిస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు. ఉమ్మడి కుటుంబాల వారికి సైతం ఏ,బీ, సీ కేటగిరీగా విభజించి దశలవారీగా ఇళ్లు కేటాయిస్తామని భరోసా కల్పించడంతో అక్కడి పేదలు తమ ఇళ్లను ఖాళీ చేశారు. సయ్యద్‌ సాబ్‌కా బాడలో డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. మొదటి విడతలో 34 మంది లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించారు.  లబ్ధిదారులు ఏడాది నుంచి ఇళ్లలో నివాసం ఉంటున్నారు.  

అధికారుల అత్యుత్సాహం..
సయ్యద్‌ సాబ్‌ బడా డబుల్‌ బెడ్రూం ఇళ్ల భవన సముదాయంలో తన పేరుమీద కేటాయించిన ఇంటిని మరొకరు అక్రమించి నివాసం ఉంటున్నారంటూ ఇటీవల ఓ మహిళ స్థానిక ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్లింది. ఆయన సిఫార్సుతో  రెవెన్యూ అధికారులు పోలీసుల సహకారంతో ఆ ఇంటిని ఖాళీ చేయించి సదరు మహిళకు అప్పగించారు. ఇక్కడితో కథ సుఖాంతమైంది. కానీ, ఇదే అదనుగా రెవెన్యూ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఆ ఇంటి వివాదాన్ని బూచిగా చేసుకొని మిగతా లబ్ధిదారుల ఇళ్లపైనా ప్రతాపం చూపిస్తున్నారు. ఎలాంటి నోటీసులు, స్పష్టమైన ఆరోపణల ఆధారాలు చూపకుండా టార్గెట్‌ చేసిన కొన్ని ఇళ్లను సీజ్‌ చేశారు. దీంతో పలు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇదేమని ప్రశ్నిస్తే ఆరోపణలున్నాయంటున్నారు. అసలు విషయాలు చెప్పకుండా దాటవేస్తున్నారంటూ బాధితులు పేర్కొంటున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పలువురు బాధితులు కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. వాస్తవంగా  జిల్లా స్ధాయి అధికారుల ఉదాసీన వైఖరి, పర్యవేక్షణ లోపంతో కిందిస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు