‘అంచనాలకు’ మించి అవినీతి!

6 Jun, 2018 11:16 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, పెద్దపల్లి : భూసేకరణలో అంచనాలు భారీగా పెంచి అక్రమాలకు పాల్పడ్డ ఆర్డీవో వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. అంచనాలకు మించి అక్రమాలు చోటుచేసుకున్నట్లు తేలుతోంది. వేలు, లక్షలు కాదు ఏకంగా కోట్లాది రూపాయలకు ఎసరుపెట్టిన అధికారుల తీరు ఆశ్చర్యపరుస్తోంది. ప్రభుత్వానికి సరెండర్‌ చేసిన పెద్దపల్లి ఆర్డీవో అశోక్‌కుమార్‌ ఉదంతమే జిల్లాలో భూసేకరణలో భారీ కుంభకోణాలకు సజీవ తార్కాణంగా నిలుస్తోంది.

లక్షలాది ఎకరాల భూ సేకరణ
కాళేశ్వరం ప్రాజెక్ట్, సింగరేణి విస్తరణలో భాగంగా జిల్లాలో లక్షలాది ఎకరాల భూసేకరణ అవసరం పడింది. కమాన్‌పూర్, రామగిరి, మంథని, రామగుండం మండలాల పరిధిలో సింగరేణి ఓసీపీల నిర్మాణానికి వేలాది ఎకరాల భూమిని సేకరించారు. ఇప్పటికీ అక్కడక్కడా భూసేకరణ కొనసాగుతూనే ఉంది.  కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణం జిల్లాలోనే అధికభాగం జరుగుతోంది. సుందిళ్ల, అన్నారం, గోలివాడ, మేడారంలలో బ్యారేజీలు, పంప్‌హౌస్‌లు, సొరంగమార్గాలు నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాల కోసం వేలాది ఎకరాల భూసేకరణ ఏళ్లుగా సాగుతోంది. దాదాపు పూర్తయింది. 

అధికారుల చేతివాటం
లక్షలాది ఎకరాల భూసేకరణ చేతిలో ఉండడంతో సంబంధిత అధికారుల చేతివాటాన్ని ప్రదర్శించడం మొదలెట్టారు. వీఆర్‌వో, తహసీల్దార్, ఆర్డీవో స్థాయిలో అధికారులు అంచనాలు పెంచి పరిహారంలో వాటాలు తీసుకున్నట్లు సంవత్సరాలుగా ఆరోపణలున్నాయి. పెద్దపల్లి ఆర్డీవో అశోక్‌కుమార్‌ వ్యవహారంతో అవి నిజమని తేలాయి. భూ నిర్వాసితులకు చెల్లించే పరిహారంలో వాటాలు కోరడం ఇక్కడ మామూలే. మామూళ్లు ఇస్తేనే పరిహారం వచ్చేట్లు చేయడం, లేదంటే చెప్పులరిగేలా తిరిగినా పరిహారం ఇవ్వకపోవడం బహిరంగరహస్యమే. ఇదంతా ఒక ఎత్తయితే ముందే ఒప్పందం చేసుకొని అంచనాలను భారీగా పెంచి కొంతమంది పెద్దలు వాటాలు పంచుకున్నారు. ఇందుకోసం ఏజెంట్ల వ్యవస్థను సృష్టించారు. ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయల గండికొట్టారు. 

రూ.2 కోట్ల నుంచి రూ.25 కోట్లు
జిల్లాలో భూసేకరణ, పరిహారం చెల్లింపులో జరుగుతున్న అవినీతి భాగోతం ఏరకంగా ఉందో రామగిరి మండలం జల్లారం ఉదంతం చూస్తే అర్థమవుతుంది. సింగరేణి భూసేకరణలో భాగంగా జల్లారంలో వ్యవసాయభూమికి రూ.2 కోట్లు పరిహారంగా చెల్లించాల్సి ఉండగా, ఇంటిస్థలాలుగా చూపి ఏకంగా రూ.25 కోట్ల పరిహారం కాజేయడానికి రంగం సిద్దం చేశారు. దీనికోసం ఆ ప్రాంతంలో కొంతమంది ఏజెంట్లును ఏర్పాటు చేసుకొని, అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. జల్లారంతో పాటు గోలివాడ, మేడారంలలో భూసేకరణలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు నిర్ధారణ అయింది. ఈ మొత్తం తతంగంలో కోట్లాది రూపాయలు స్వాహా చేయడానికి రంగం సిద్దం కావడం, అధికారుల విచ్చలవిడి అవినీతికి అద్దం పడుతోంది. భూసేకరణలో అక్రమాలకు కలెక్టర్‌ శ్రీదేవసేన
చెక్‌ పెట్టారు.

పెద్దపల్లి ఆర్డీవో అశోక్‌కుమార్‌ వ్యవహారంలో తీగలాగి డొంకను కదిలించారు. ఆర్డీవోపై గత కలెక్టర్ల హయంలోనూ ఆరోపణలు రాగా, అప్పుడు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. జల్లారంలో అంచనాలు భారీగా రూ.25 కోట్లకు పెంచడంతో, విచారణకు ఆదేశించిన కలెక్టర్, మిగిలిన కుంభకోణాలకు కూడా వెలికితీయగలిగారు. ధర్మారం మండలంలోని చామనపల్లి, మల్లారం, సాయంపేట, మేడారం నిర్వాసితులకు జిల్లా కలెక్టర్‌ రూ.23 కోట్ల 91 లక్షల 57 వేల 875 ఆమోదించగా, రూ.5,74,13,826 అదనంగా, మొత్తం రూ.29,65,71,701 ఆర్డీవో పరిహారంగా చెల్లించారు. అలాగే అంతర్గాం మండలం గోలివాడలో అనర్హులు 45 మందికి రూ.1 కోటి 02 లక్షల 12 వేలు చెల్లించారు. ఈ మూడు వ్యవహారాల్లో అవినీతి అక్రమాలకు బాధ్యుడు కావడంతో ఆర్డీవో అశోక్‌కుమార్‌పై వేటువేసినట్లు కలెక్టర్‌ తెలిపారు.

అవినీతిలో మరింతమంది
భూసేకరణలో అంచనాలు పెంచి అక్రమాలకు పాల్పడిన వ్యవహారం సంచలనం సృష్టిస్తుంటే, ఇలాంటి వ్యవహారాల్లోనే మరికొంతమంది రెవెన్యూ అధికారులున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రధానంగా  రామగుండం, ధర్మారం, మంథని ప్రాంతాల్లోని రెవెన్యూ అధికారులు జల్లారం స్థాయిలో కాకున్నా, అంచనాలు పెంచి వాటాలు అందుకున్నట్లు అధికారిక వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. భూసేకరణ అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి కలెక్టర్‌ సంకల్పంతో ఉండడంతో, ఈ అవినీతి అధికారుల వ్యవహారం కూడా బయటపడే అవకాశం కనిపిస్తోంది.  

మరిన్ని వార్తలు