ఇక రెవెన్యూ రేంజ్‌లు..!

7 Oct, 2017 03:45 IST|Sakshi

 పాలన సంస్కరణల్లో మరో ప్రయోగానికి సర్కారు కసరత్తు

ఐదారు జిల్లాలకో రేంజ్‌... పర్యవేక్షణకు సీనియర్‌ ఐఏఎస్‌లు

సాక్షి, హైదరాబాద్‌: ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు పాలనలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. జిల్లా స్థాయిలోని సమస్యలను వెంటనే పరిష్కరించడంతో యంత్రాంగానికి సూచనలిచ్చేలా మార్పులు చేయబోతోంది. ఇందుకు పోలీసు శాఖ తరహాలోనే రెవెన్యూ వ్యవస్థలోనూ రేంజ్‌లు ఏర్పాటు చేయాలని యోచి స్తోంది. ఐదారు జిల్లాలకో రేంజ్‌ను ఏర్పాటు చేసి, సీనియర్‌ ఐఏఎస్‌ను ప్రత్యేకాధికారిగా పర్యవేక్షణకు నియమిస్తే మెరుగైన ఫలితాలొస్తాయని భావిస్తోంది. 

ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో..: రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటై ఏడాది కావస్తోంది. జిల్లాలు పెరగడం, రాష్ట్రంలో ఐఏఎస్‌ల కొరత వల్ల జూనియర్‌ ఐఏఎస్‌లకు కలెక్టర్లుగా పనిచేసే అవ కాశం లభించింది. 31 జిల్లాల్లో ఆరుగురు మినహా మిగతా వారంతా జూనియర్‌ ఐఏఎస్‌లే కలెక్టర్లుగా ఉన్నారు. ఏడాది కాలంలో వీరి పనితీరు బాగుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సీఎం సైతం కలెక్టర్లు చురుగ్గా పని చేస్తున్నారని ప్రశంసించారు. అయితే అనుభవం లేకపోవటంతో అప్పుడ ప్పుడు క్షేత్రస్థాయి సమస్యలొస్తున్నాయి. జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వానికి ఇవి ఇబ్బంది పెడుతున్నాయి. మరోవైపు ప్రజా ప్రతినిధులతో సమన్వయ లోపాలతో చిక్కులొస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్లకు సూచనలిచ్చేందుకు రేంజ్‌లు ఏర్పాటు చేయాలని, ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి విధానం అమల్లో ఉందని అధికారులు చెబుతున్నారు.

ప్రత్యేక ప్రధాన కార్యదర్శులకు బాధ్యతలు?
రాష్ట్రంలోని 10 మంది ప్రత్యేక ప్రధాన కార్యదర్శు లకు ‘రేంజ్‌’ బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం యోచి స్తోంది. వివిధ హోదాల్లో పనిచేసిన అనుభం, ప్రభుత్వ కార్యక్రమాలపై స్పష్టమైన అవగాహన వీరి పర్యవేక్షణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత వేగవంతం చేయొచ్చని భావిస్తోంది. ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీపీ ఆచార్య ఈ దిశగా కొంత మేర ప్రయత్నం చేస్తున్నారు. పాత వరంగల్‌ జిల్లా పరిధిలోని ఐదుగురు కలెక్టర్లకు సలహాలిస్తున్నారు. టీం కాకతీయ పేరుతో ప్రత్యేక వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేశారు. ఇదే తరహాలో మిగతా కలెక్టర్లకూ సీనియర్‌ ఐఏఎస్‌ల మార్గదర్శనం ఉండాలన్న ప్రతిపాదన అధికార వర్గాల్లో వినిపిస్తోంది.  

మరిన్ని వార్తలు