తహసీల్దార్‌ రిజిస్ట్రేషన్లు.. అంత ఈజీ కాదట!

18 Jan, 2018 02:40 IST|Sakshi

రెవెన్యూ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లపై అంతర్గత నివేదిక

367 మండలాల్లో రోజుకు 3, అంతకన్నా తక్కువగా రిజిస్ట్రేషన్లు

ఇందులో 128 మండలాల్లో సగటున రోజుకో డాక్యుమెంట్‌ మాత్రమే

ఏర్పాట్లకు రూ. 44.3 కోట్ల వ్యయం.. నిర్వహణకు ఏటా రూ. 5 కోట్లు

రాష్ట్ర భౌగోళిక స్థితి కారణంగా నెట్‌వర్క్‌ ఏర్పాటు కష్టం

సేవల కోసం పెద్ద సంఖ్యలో పోస్టుల అవసరం

ఎమ్మార్వోలు, సబ్‌రిజిస్ట్రార్లు వేర్వేరు శాఖల పరిధిలో..

ఎవరు ఎవరికి రిపోర్టు చేయాలనే సందేహాలు

మార్కెట్‌ విలువ నిర్ధారణ, నిషేధిత భూముల అంశంలో పారదర్శకత ఎలాగనే ప్రశ్న.. ప్రస్తుత విధానం కొనసాగింపే మేలన్న అభిప్రాయం

సాక్షి, హైదరాబాద్‌ : రెవెన్యూ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు అందించే ప్రతిపాదనపై భిన్నాభి ప్రాయం వ్యక్తమవుతోంది. అటు ప్రభుత్వ పెద్దలుగానీ, ఇటు ఉన్నతాధికారులుగానీ పైకి ఏమీ మాట్లాడకపోయినా ఈ ప్రతిపాదన సాధ్యాసాధ్యాలపై తీవ్రమైన తర్జనభర్జన జరుగుతోంది. కొత్త విధానం అమలు అంత సులువుకాదని, ప్రస్తుత విధానం కొనసాగింపే మేలన్న భావన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఈనెల 8న జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అంతర్గతంగా ఇచ్చిన నివేదిక కీలకంగా మారింది. ఎమ్మార్వో కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవల అమలు సాధ్యాసాధ్యాలకు సంబంధించి ఆ నివేదికలో పేర్కొన్న గణాంకాలు, సూచనలు ప్రభుత్వ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. ప్రస్తుత విధానాన్ని కొనసాగించడమే మంచిదని ఆ నివేదిక స్పష్టం చేసినట్లు తెలిసింది.నివేదికలోని ముఖ్యాంశాలివీ..

రోజుకు ఒకటి రెండు డాక్యుమెంట్లే!

  •  గతేడాది రాష్ట్రంలోని 567 గ్రామీణ మండలాల్లో వ్యవసాయ భూముల కేటగిరీలో 4,54,607 డాక్యుమెంట్లు రిజిస్టర్‌ అయ్యాయి.
  •  అందులో 373 మండలాల్లో సగటున రోజుకు మూడు అంతకన్నా తక్కువ సంఖ్యలో (260 మండలాల్లో రోజుకు రెండు.. ఇందులో 128 మండలాల్లో రోజుకో డాక్యుమెంట్‌ మాత్రమే) డాక్యుమెంట్లు రిజిస్టర్‌ అయ్యాయి.
  •  మిగతా 194 మండలాలకుగాను 65 చోట్ల సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. అంటే సబ్‌రిజిస్ట్రార్లు లేని 129 మండలాల్లో మాత్రమే రోజుకు మూడు కన్నా ఎక్కువ లావాదేవీలు జరుగుతున్నాయి.
  •  ఇలాంటి పరిస్థితుల్లో అన్ని మండల కార్యాలయాల్లో మౌలిక సదుపాయాలు, మానవ వనరుల కల్పన అనవసరపు భారంగా మారుతుంది.

‘శిక్షణ’తో తలనొప్పి

  • ప్రస్తుతం డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ల చట్టం–1908, స్టాంపుల చట్టం–1899 ప్రకారం రిజిస్టర్‌ అవుతున్నాయి.
  • ఇప్పుడు ఎమ్మార్వో కార్యాలయాల్లో రిజిస్టర్‌ చేయాలంటే.. ఎమ్మార్వోలకు ఈ చట్టాలు, నియమ నిబంధనలు, స్టాండింగ్‌ ఆర్డర్ల గురించి శిక్షణ ఇవ్వాలి.
  • స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రస్తుతం అమలు చేస్తున్న ‘కార్డ్‌ (కంప్యూటర్‌ ఎయిడెడ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ రిజిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌)’ వ్యవస్థపై కూడా 443 మంది ఎమ్మార్వోలకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది.
  • ఇక ఇప్పుడు సబ్‌ రిజిస్ట్రార్లున్న మండలాల్లో పనిచేస్తున్న ఎమ్మార్వోలకు వీటి గురించి అవగాహన ఉండదు. వారు తర్వాత సబ్‌రిజిస్ట్రార్లు లేని మండలాలకు బదిలీ అయితే శిక్షణ ఇవ్వాల్సి వస్తుంది.

బోలెడు సిబ్బంది అవసరం

  •  ప్రతి సబ్‌రిజిస్ట్రార్‌కు ఒక సీనియర్‌ అసిస్టెంట్, ఇద్దరు జూనియర్‌ అసిస్టెంట్లు, ఇద్దరు సబార్డినేట్లు, క్లర్కులు కావాలి.
  •  మార్కెట్‌ విలువ సర్టిఫికెట్ల జారీ, చెక్‌స్లిప్‌ల తయారీ, డాక్యుమెంట్ల స్కానింగ్, చలానాలు, ఈసీల తయారీ, బయోమెట్రిక్‌ వివరాల సేకరణ, వెబ్‌ల్యాండ్‌ను పోల్చడం, పాస్‌ పుస్తకాల పరిశీలన, రికార్డుల మెయింటెనెన్స్, స్టాంపుల అమ్మకాల వంటి బాధ్యతలు ఉంటాయి.
  • ఈ మేరకు పోస్టులు మంజూరు చేయాల్సి ఉంటుంది.

‘నెట్‌వర్క్‌’ ఎలా..?

  • రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో ‘కార్డ్‌ (కంప్యూటర్‌ ఎయిడెడ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ రిజిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌)’ వ్యవస్థ ఆధారంగా డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రతి ఎమ్మార్వో కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేయాలంటే ఆ మేరకు కంప్యూటర్లు, ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌ అనుసంధానం అవసరం.
  • రాష్ట్రంలోని భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతమున్న 141 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు నెట్‌వర్క్‌ను నిర్వహించడమే గగనంగా ఉంది
  • మారుమూల ప్రాంతాల్లోని 584 ఎమ్మార్వో కార్యాలయాలకు నెట్‌వర్క్‌ అందించడం చాలా కష్టం. 

సబ్‌రిజిస్ట్రార్ల పరిధితో తిప్పలు

  •  ప్రస్తుతం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు మండలాల ప్రాతిపదికన లేవు. కొన్ని మండలాల్లో సగం గ్రామాలు ఓ సబ్‌రిజిస్ట్రార్, మరిన్ని గ్రామాలు మరో సబ్‌రిజిస్ట్రార్‌ పరిధిలో ఉన్నాయి.
  •  ఇప్పుడు ఎమ్మార్వో కార్యాలయాల వారీగా విధానం అమలుతో.. పలు సబ్‌రిజిస్ట్రార్ల కార్యాలయాల పరిధిని మార్చాల్సి ఉంటుంది.

పర్యవేక్షణకు ఇబ్బందులు

  • ఇప్పుడున్న వ్యవస్థ ప్రకారం సబ్‌రిజిస్ట్రార్లు జిల్లా రిజిస్ట్రార్లకు, వారు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌కు బాధ్యులుగా ఉంటారు.
  • ఎమ్మార్వోలు నేరుగా కలెక్టర్లకు బాధ్యులుగా ఉంటారు.
  • ఇప్పుడు సబ్‌రిజిస్ట్రార్లతోపాటు ఎమ్మార్వోలు రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తే.. వారు ఎవరికి బాధ్యులుగా ఉండాలన్న సందేహం తలెత్తుతోంది.
  • దీనితో ఇరు శాఖల సమన్వయంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశముంది.


ఎమ్మార్వోలు అందుబాటులో లేకుంటే..?

  • ఎమ్మార్వోల వ్యవస్థ అత్యంత క్రియాశీలంగా ఉంటుంది.
  • వారు వారంలో మూడు రోజుల పాటు తమ పరిధిలో క్షేత్రస్థాయి పరిశీలనలతోపాటు వ్యవసాయం, సాగునీరు, ప్రోటోకాల్‌ లాంటి విధులకు హాజరుకావాల్సి ఉంటుంది.
  • ‘క్రాస్‌ చెకింగ్‌’కు ఇబ్బందే
  •  ప్రస్తుతం భూముల మార్కెట్‌ విలువలను సబ్‌రిజిస్ట్రార్లు కన్వీనర్లుగా ఉన్న కమిటీ నిర్ధారిస్తుంది. అందులో ఎమ్మార్వో సభ్యుడిగా ఉంటారు. ఇప్పుడు ఈ రెండూ ఎమ్మార్వోనే చేయాల్సి వస్తుంది.
  •  ఇక నిషేధిత భూముల జాబితాలను ఎమ్మార్వోలే సబ్‌రిజిస్ట్రార్లకు ఇస్తారు. సబ్‌ రిజిస్ట్రార్లు వాటిని పరిశీలించి రిజిస్ట్రేషన్ల సమయంలో క్రాస్‌ చెకింగ్‌ చేస్తారు. కొత్త విధానంతో రెండు పనులూ ఎమ్మార్వోనే చేయాల్సి వస్తే క్రాస్‌ చెకింగ్‌కు అవకాశం లేకుండా పోతుంది.

ఏటా తప్పని ఖర్చు

  •  రెవెన్యూ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు అందించాలంటే ఏర్పాట్ల కోసం ఒక్కో మండలంలో రూ.10 లక్షల వరకు అవసరం. ఈ లెక్కన రూ.44.3 కోట్లు ఖర్చవుతాయి. 
  •  తర్వాత నిర్వహణ కోసం కూడా ఏటా రూ.5 కోట్ల వరకు అదనంగా ఖర్చవుతుంది. ఇది అనవసరపు భారంగా పరిణమిస్తుంది.

ఈ యోచన సమంజసం కాదు!

  • కొత్త పాస్‌ పుస్తకాలు రైతులకు ఇబ్బంది లేకుండా సకాలంలో అందించాలంటే.. రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖలను ఎలక్ట్రానిక్‌ అనుసంధానం చేస్తే సరిపోతుంది.
  • ప్రభుత్వం అప్పటికీ చేయాలనుకుంటే రిజిస్ట్రేషన్ల చట్టానికి అనుగుణంగా ప్రతి మండలానికి, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు నోటిఫికేషన్లు జారీ చేయాలి.   
మరిన్ని వార్తలు