నిజాయితీతో పనిచేయాలి..

20 Jan, 2015 05:58 IST|Sakshi
నిజాయితీతో పనిచేయాలి..

అధికారులు అప్రమత్తంగా ఉండాలి
జిల్లాలో ముఖ్యమంత్రి ఆకస్మిక పర్యటన
పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు..
సమీక్షలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం జడ్పీసెంటర్ : పథకాల అమల్లో నిజాయితీతో పనిచేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. కలెక్టరేట్‌లోని ప్రజ్ఞా సమావేశమందిరంలో పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకటరావు, కలెక్టర్ ఇలంబరితితొఓ కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఆకస్మికంగా ఉంటుందన్నారు.

అధికారులందరూ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. పథకాల అమల్లో పారదర్శకత పాటించాలన్నారు.  ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం అర్హులకు అందాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ముందుకు సాగుతున్నారని తెలిపారు. జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వాటర్‌గ్రిడ్‌పై పకడ్బందీ ప్రణాళికలు రచించాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు.

ప్రతి ఇంటికీ రక్షిత మంచినీరు అందించాలనే లక్ష్యంతో సీఎం భారీ ప్రాజెకుకు నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రభుత్వ అధికారులపై ఉన్న నమ్మకంతోనే సవాల్‌గా ఈ పథకం తీసుకున్నారని, అందుకు అనుగుణంగా అధికారులు పని చేయాలన్నారు. కాకతీయ మిషన్‌ను ఏజెన్సీ, నాన్ ఏజెన్సీలు పకడ్బందీగా చేపట్టాలన్నారు. అడవుల నరికివేతతో జాతికి తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు.

జిల్లాలో విచ్చలవిడిగా అడవులను నరికి వేశారని, తిరిగి మొక్కలను నాటి, జిల్లాను హరితవనంగా మార్చాలన్నారు. కోట్లాది రూపాయల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల నుంచి మండల కేంద్రాలు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రోడ్ల విస్తరణ, అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. జిల్లాలో ఆసరా అర్హులందరికీ అందలన్నారు. ఏ ఒక్క అర్హుడు ఆసరా అందలేదని ఫిర్యాదు చేసినా అధికారులే బాధ్యత వహించాలన్నారు. రెండు, మూడు రోజుల్లో గృహ నిర్మాణ పథకానికి సంబంధించి విధి, విధానాలను సీఎం ఖరారు చేస్తారని తెలిపారు.

అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. పోలీసు, రెవెన్యూ వ్యవస్థలు మెరుగైన సేవలందించాలన్నారు. అధికారులకు ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు.

జిల్లా యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు సమన్వయంగా వ్యవహరించి, జిల్లాను రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలపాలని సూచించారు. అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి, ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్ కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, తాటి వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు