గిరిజనులకు ఇక నేషనల్‌ ఫెలోషిప్‌

9 May, 2019 03:57 IST|Sakshi

కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ ద్వారా అమలు

పీహెచ్‌డీ, ఎంఫిల్‌కు ప్రత్యేక స్కాలర్‌షిప్‌

ఒక్కో విద్యార్థికి 25 లక్షల వరకు అందజేత

సాక్షి, హైదరాబాద్‌: గిరిజన తెగలకు చెందిన పరిశోధన విద్యార్థులకు ఫెలోషిప్‌ కార్యక్రమాన్ని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ నిర్వహిస్తోంది. గతంలో యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌) ద్వారా ఫెలోషిప్‌ కార్యక్రమాన్ని నిర్వహించినప్పటికీ... కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులతో ఫెలోషిప్‌ కార్యక్రమ అమలు గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోకి వచ్చింది. ఈ క్రమంలో పరిశోధన విద్యార్థుల ఎంపికను ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేసింది. గైడ్‌ టీచర్ల ఎంపిక ప్రక్రియ మొదలు దరఖాస్తు విధానం, సబ్జెక్టుతో పాటు ప్రజెంటేషన్‌ తదితర అంశాలను నిశితంగా పరిశీలించిన తర్వాతే అర్హతను నిర్ధారిస్తుంది. కార్యక్రమ అమలులో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి యూనివర్సిటీ రిజిస్ట్రార్లకు అవగాహన కార్యక్రమాల్ని చేపట్టింది.

గిరిజన పరిశోధన విద్యార్థుల కోసం అమలు చేస్తున్న ‘నేషనల్‌ ఫెల్లోషిప్‌ అండ్‌ స్కాలర్‌షిప్‌ ఫర్‌ హైయర్‌ ఎడ్యుకేషన్‌ ఆఫ్‌ ఎస్టీ స్టూడెంట్స్‌’కార్యక్రమానికి సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్‌లో దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 10 యూనివర్సిటీల పరిధిలో 157 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. గిరిజన తెగల నుంచి పరిశోధన విద్యార్థులు ఇంత పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకోవడం ఇదే తొలిసారి. వర్సిటీల వారీగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా 750 మంది గిరిజన పరిశోధన విద్యార్థులకు మాత్రమే ఈ కార్యక్రమం కింద అవకాశం కల్పిస్తారు. ఈ నేపథ్యంలో దరఖాస్తులు పెద్ద సంఖ్యలో రావడంతో జాగ్రత్తగా వడపోసి అర్హులను ఎంపిక చేసేందుకు శాస్త్రీయ పద్ధతిని అవలంభించనున్నారు.

పీవీటీజీ తెగలకు చెందిన గిరిజనులకు 3 శాతంతో పాటు మహిళలకు 30 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తున్నారు. అభ్యర్థులు సమర్పించిన దరఖాస్తులను ఈ నెల 15వ తేదీలోపు పరిశీలించి ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను కేంద్రానికి పంపిస్తారు. అనంతరం వాటిని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ వడపోసి తుది జాబితాను రూపొందిస్తుంది. ఎంఫిల్‌ విద్యార్థులకు ప్రతి నెల రూ.25 వేల చొప్పున రెండేళ్ల పాటు చెల్లిస్తారు. అలాగే సంవత్సరానికి రూ.22 వేలు కంటింజెన్సీ కింద ఇస్తారు. అదేవిధంగా పీహెచ్‌డీ విద్యార్థులకు ప్రతి నెల రూ.28 వేలు చొప్పున ఐదేళ్ల పాటు అందిస్తారు. కంటిజెన్సీ కింద ఏటా రూ.45,500 ఇస్తారు. సగటున ఒక్కో పరిశోధన విద్యార్థికి ఏడేళ్ల కాలానికి రూ.25 లక్షల వరకు ఆర్థిక సాయం అందనుంది.  

ఎంఫిల్‌కు... 

  • రెండేళ్ల పాటు ప్రతి నెలా 25 వేల చొప్పున ఇస్తారు. 
  • కంటింజెన్సీ కింద ఏటా 22 వేలు ఇస్తారు. 

పీహెచ్‌డీ... 

  • ఐదేళ్ల పాటు ప్రతి నెల 28 వేల చొప్పున ఇస్తారు. 
  • కంటింజెన్సీ కింద ఏటా రూ.45,500 ఇస్తారు. 
మరిన్ని వార్తలు