కృష్ణా ప్రాజెక్టులకు గోదావరి నీరు

13 Mar, 2019 03:34 IST|Sakshi

ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయాలి 

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 

పాలమూరు, ఖమ్మం జిల్లా ప్రాజెక్టులపై సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో చేపట్టి, నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఏదైనా సందర్భంలో నీటి ప్రవాహం తగ్గడం వల్ల కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులకు నీరు లభ్యం కాకపోతే గోదావరి నీటిని అందించేందుకు ప్రత్యామ్నా య ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. ప్రతి ప్రాజెక్టును నిర్మించడంతో పాటు, నిర్వహణ కోసం అవసరమైన ప్రాజెక్టు ఆపరేషన్‌ మాన్యువల్‌ రూపొందించుకోవాలన్నారు. మహబూబ్‌నగర్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న సాగునీటి పథకాలపై సీఎం ఆయా జిల్లాల ప్రజా ప్రతినిధులతో మంగళవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, వెంకటేశ్వర్‌రెడ్డి, అంజయ్య యాదవ్, జైపాల్‌ యాద వ్, రాజేందర్‌రెడ్డి, అబ్రహం, రామ్మోహన్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, రేగా కాంతారావు, ఆత్రం సక్కు, బానోతు హరిప్రియానాయక్, రాములునాయక్‌ పాల్గొన్నారు. 

జిల్లా అంతటికీ సాగునీరు.. 
‘ఖమ్మం జిల్లాను ఆనుకునే గోదావరి నది ప్రవహిస్తుంది. ఆ జిల్లాలో అడువులు, వర్షపాతం ఎక్కువ. దుమ్ముగూడెం వద్ద పుష్కలమైన నీటి లభ్యత ఉంది. గరిష్టంగా 195 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోస్తే జిల్లా అంతా సాగునీరు ఇచ్చే అవకాశం ఉంది. ఇన్ని అనుకూలతలున్నా ఖమ్మం జిల్లాలో కరు వు తాండవం చేయడం క్షమించరాని నేరం. ఖమ్మం జిల్లా అంతటినీ సస్యశ్యామలం చేసేలా ప్రాజెక్టుల నిర్మాణం జరగాలి. దుమ్ముగూడెం వద్ద నుంచి గోదావరి నీటిని బయ్యారం చెరువు వరకు ఎత్తిపోసి జిల్లా అంతటికీ సాగునీరు అందించాలి. అవసరమైన చోట రిజర్వాయర్లు, లిఫ్టులు ఏర్పాటు చేయాలి. ప్రాజెక్టులతో నీరు అందని ప్రాంతాలను గుర్తించి, స్థానిక వనరులతో సాగునీరు అందించాలి.

ఆర్‌వోఎఫ్‌ఆర్, అసైన్డ్‌ భూములకు సైతం సాగునీరు అందించాలి. సమైక్య పాలనలో ఎక్కువగా నష్టపోయిన జిల్లా మహబూబ్‌నగర్‌. ఒక్క జూరాల నీటితోనే ఎక్కువ ప్రాజెక్టులకు రూపకల్పన చేయడం వల్ల నీరు సరిపోని పరిస్థితి నెలకొంది. అందుకే పాలమూరు ఎత్తిపోతల పథకానికి శ్రీశైలం వనరులతో నీటిని ఎత్తిపోయాలని నిర్ణయించాం. కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయల్‌సాగర్, భీమా ఎత్తిపోతల పథకాలతో పూర్తి ఆయకట్టుకు నీరందించడానికి వీలుగా ఎక్కడికక్కడ అవసరమైన రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేయాలి. చెరువులను నింపే ప్రణాళిక రూపొందించాలి. పాలమూరు జిల్లాలో చెన్నోనిపల్లి రిజర్వాయర్‌ను ఉపయోగంలోకి తెచ్చే విధానం రూపొందిస్తాం’ అని సీఎం వివరించారు.

మరిన్ని వార్తలు