ఎటువంటి ఇబ్బందులూ రావొద్దు!

26 Nov, 2017 01:57 IST|Sakshi
శనివారం గోల్కొండ కోటలో ఏర్పాట్లపై అధికారులతో చర్చిస్తున్న సీఎస్‌ ఎస్పీసింగ్, డీజీపీ మహేందర్‌రెడ్డి

జీఈఎస్‌ సదస్సు, మోదీ, ఇవాంకా పర్యటన ఏర్పాట్లపై సీఎస్, డీజీపీ 

ఉన్నతాధికారులతో భద్రతా చర్యలపై సమీక్ష 

సాక్షి, హైదరాబాద్‌: మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న మెట్రో రైలు, ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్‌) ప్రాంతం, భద్రతా ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, డీజీపీ మహేందర్‌రెడ్డి శనివారం పరిశీలించారు. ప్రధాని మోదీ, ఇవాంకా, ఇతర ప్రముఖులు ప్రయాణించే మార్గాలు, పర్యటించే ప్రదేశాలు ఏర్పాట్లపై సమీక్షించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. తొలుత సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు ప్రత్యేక బస్సులో హెచ్‌ఐసీసీ ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడ అనంతరం జీఈఎస్‌ సదస్సు జరిగే హెచ్‌ఐ సీసీ వేదికను డీజీపీ పరిశీలించారు. అక్కడ భద్రతా ఏర్పాట్లు, మోదీ, సీఎం, ఇవాంకా వచ్చే మార్గాలు, గ్రీన్‌ చానల్‌ ఏర్పాటు, డెలిగేట్లు వచ్చే మార్గం తదితరాలపై సమీక్షించారు.

ఇక 29న గోల్కొండ కోటలో జీఈఎస్‌ డెలిగేట్లకు విందు ఇవ్వనున్న ప్రాంతాలను సీఎస్, డీజీపీ పరిశీలించారు. ఆదివా రం నుంచి కోటను అదీనంలోకి తీసుకోవాలని.. ఎవరినీ అనుమతించకూడదని అధికారులను ఆదేశించారు. విందు మెనూను పరిశీలించారు. కోటలో హస్తకళల ప్రదర్శన మాత్రమే ఉంచాలని, అమ్మకాలను జరపవద్దని సూచించారు. సిబ్బంది, అధికారులు ఎప్పటి కప్పుడు సమన్వయం చేసుకోవాలని, ఇబ్బందులు తలెత్త కుండా, ట్రాఫిక్‌ సమస్యలు రాకుండా ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు.

ఇక డీజీపీ మహేందర్‌ రెడ్డి మెట్రో రైలు డిపో, మియాపూర్‌ స్టేషన్‌ తదితర ప్రాంతాల్లో పర్యటించి.. మెట్రో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమాలపై మెట్రోరైల్‌ అధికారులతో కలసి సమీక్షించారు. అధికారులతో కలసి మెట్రో రైలులో ప్రయాణించారు. ప్రతి మెట్రో స్టాప్‌లో చేపట్టాల్సిన భద్రతా చర్యలపై  సూచనలు చేశారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఏర్పాట్లు పరిశీలించారు. సదస్సు నేపథ్యంలో ఆదివారం నుంచి గురువారం వరకు పోలీసు శాఖ డేగకళ్లతో పహారా కాయబో తోంది. ప్రధాని మోదీ, ఇవాంకా ట్రంప్‌ల పర్యటన నేపథ్యంలో.. దాదాపు 4 వేల మంది పోలీసు అధికారులు, సిబ్బంది భద్రతా వ్యవహారాల్లో నిమగ్న మవుతున్నారు. 

మరిన్ని వార్తలు