రాజకీయాల్లో నిబద్ధత, నిజాయితీ ఉండాలి : రేవూరి

5 Dec, 2018 09:32 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న కూటమి అభ్యర్థి రేవూరి ప్రకాష్‌రెడ్డి 

సాక్షి, వరంగల్‌: రాజకీయాల్లో నిబద్ధత, నిజాయితీ ఉండాలని, మద్దతు ఇస్తే మర్డర్‌ చేస్తామని బెదిరింపులకు భయపడే ప్రస్తకే లేదని వరంగల్‌ పశ్చిమ ప్రజాకూటమి అభ్యర్థి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్‌రెడ్డి అన్నారు. మంగళవారం హన్మకొండ భవానీనగర్‌లోని కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం రాత్రి వడ్డేపల్లి ప్రాంతానికి చెందిన రిటైర్డ్‌ డీఈని దాస్యం విజయ్‌భాస్కర్‌ ఫోన్‌లో నానా దుర్భాషలాడడమే కాకుండా ఇంటికి తన అనుచరులను పంపించి బెదిరింపులకు పాల్పడినట్లు ఆయన తెలిపారు. ఈ బెదిరింపులకు సంబంధించిన ఫోన్‌ రికార్డులు, సీసీ ఫుటేజీల ఆధారంగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేసి సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టినట్లు తెలిపారు.

దాస్యం సోదరులు చేస్తున్న పనులతో ప్రజల్లో మంచి పేరున్న స్వర్గీయ దాస్యం ప్రణయ్‌భాస్కర్‌కు మచ్చ తెచ్చే విధంగా ఉన్నాయన్నారు. ఎవరైనా ఫోన్‌లో బెదిరించినా ఇంటికి వచ్చినా వెంటనే 100 నెంబర్‌కు డయల్‌ చేసి ఫిర్యాదు చేస్తే వెంటనే పోలీసులు వస్తారని తెలిపారు. ఈ మేరకు పోలీస్‌ కమిషనర్‌కు వీరు చేస్తున్న ఆగడాలను దృషికి తీసుకుపోయామన్నారు. మాజీ మంత్రి కేటీఆర్‌ తనను చంద్రబాబుకు తొత్తు అని సంభోదించారని, ఆయన తండ్రి కేసీఆరే మోదీకి తొత్తుగా మారారని అన్నారు. సమావేశంలో కూటమి నాయకులు ప్రొఫెసర్‌ వెంకటనారాయణ, మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కోఆర్డినేటర్‌ జాటోత్‌ సంతోష్‌నాయక్, శంకర్, మార్గం సారంగంలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు