రివార్డు.. రికార్డు

14 Nov, 2018 09:35 IST|Sakshi
సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందంతో సీపీ అంజనీకుమార్‌ తదితరులు

సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌కు రూ.5 లక్షల నగదు పురస్కారం

'‘మ్యూజియం దొంగలను’ పట్టుకున్నందుకే

అందించిన నగర కొత్వాల్‌ అంజనీకుమార్‌

కమిషనరేట్‌ చరిత్రలోనే అతిపెద్ద బహుమతి

సాక్షి, సిటీబ్యూరో: పాతబస్తీ, పురానీహవేలీలోని హిజ్‌ ఎగ్జాల్డెడ్‌ హైనెస్‌ (హెచ్‌ఈహెచ్‌) నిజాం మ్యూజియంలో వెలకట్టలేని విలువైన వస్తువులను చోరీ చేసిన దొంగలను పట్టుకున్న సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌కు నగర పోలీసు కమిషనర్‌ మంగళవారం రూ.5 లక్షల రివార్డును అందించారు. నగర పోలీసు కమిషనరేట్‌ చరిత్రలో ఇదే భారీ రివార్డు మొత్తం కావడం గమనార్హం. ఈ ఏడాది సెప్టెంబర్‌ 4 తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ నేరంలో నిందితులుగా ఉన్న ఇద్దరు దొంగల్ని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదే నెల 11న అరెస్టు చేసిన విషయం విదితమే. రాజేంద్రనగర్‌ ప్రాంతానికి చెందిన వెల్డర్‌ మహ్మద్‌ ముబిన్, సెంట్రింగ్‌ వర్కర్‌ మహ్మద్‌ గౌస్‌ పాషా పథకం ప్రకారం ఈ చోరీకి పాల్పడ్డారు.

సెప్టెంబర్‌ 4 తెల్లవారుజామున స్క్రూడ్రైవర్లు, కటింగ్‌ ప్లేయర్, మేకులు పీకే ఉపకరణం, తాడు, పది హాక్సా బ్లేడ్‌లతో బైక్‌పై మ్యూజియం వద్దకు చేరుకున్న వారు, వాటిని వినియోగించి లోపలకు దిగారు. ఓ అల్మారాను పగులకొట్టి అందులో ఉన్న అతి పురాతనమైన బంగారంతో చేసిన, వజ్రాలు పొదిగిన టిఫిన్‌ బాక్స్, కప్పు–సాసర్, స్ఫూన్‌ ఎత్తుకెళ్లారు. వీరి కోసం టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీ ఎస్‌.చైతన్యకుమార్‌ నేతృత్వంలో దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.మధుమోహన్‌రెడ్డి తన బృందంతో ముమ్మరంగా గాలించారు. దేశంలోనే మ్యూజియాల్లో జరిగిన వాటిలో భారీ చోరీ అయిన ఈ కేసును సెప్టెంబర్‌ 11న ఛేదించి నిందితులను అరెస్టు చేయడంతో పాటు మొత్తం సొత్తు యథాతథంగా రికవరీ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా మ్యూజియంలలో జరిగిన చోరీలు ఇంత త్వరగా కొలిక్కి రావడం, మొత్తం సొత్తు రికవరీ కావడం జరుగలేదని పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ అప్పట్లోనే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అత్యంత ప్రతిభ కనబరిచిన చైతన్యకుమార్, మధుమోహన్‌రెడ్డిలతో పాటు మొత్తం బృందానికి రూ.5 లక్షల రివార్డు అందించారు. కమిషనరేట్‌లో జరిగిన కార్యక్రమంలో అదనపు సీపీలు డీఎస్‌ చౌహాన్, టి.మురళీకృష్ణ, సంయుక్త సీపీ తరుణ్‌ జోషి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు