మావో నే‘తల’లపై పెరగనున్న వెలలు!

19 Dec, 2017 01:45 IST|Sakshi

కేంద్ర కమిటీ సభ్యులకు రూ.30 లక్షల పైనే 

గణపతిపై రూ.2.52 కోట్లు 

రాష్ట్రవ్యాప్తంగా 84 మంది జాబితా

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: సీపీఐ (మావోయిస్టు) పార్టీ కీలకనేతలపై మరో సారి రివార్డులు పెరగనున్నాయి. రెండేళ్ల క్రితం రాష్ట్రవ్యాప్తంగా రివార్డులను పెంచిన కేంద్ర హోం మంత్రిత్వశాఖ తాజాగా ప్రతిపాదనలు కోరినట్లు సమాచారం. ఈ మేరకు గతంలో రాష్ట్రవ్యాప్తంగా 84 మావోయిస్టు నేతల పేర్లతో జాబితా రూపొందించగా.. అందులో అత్యధికంగా తెలంగాణలోని 10 జిల్లాల నుంచి 62 మంది ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల్లో పనిచేస్తున్న నేతలున్నట్లు ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్, మహా రాష్ట్ర, ఒడిశాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో రెండు నెలలుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో జిల్లాలవారీగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల సంఖ్య, పేర్లు, వివరాలు, ఇప్పుడున్న రివార్డు, ఏ మేరకు పెంచాలన్న అంశాలపై తాజాగా వివరాలను కోరినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.

కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న కరీంనగర్‌ జిల్లాకు చెందిన ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్‌ గణపతిపై ఇప్పటికే రూ.2.52 కోట్ల రివార్డు ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. మహారాష్ట్రలో రూ.కోటి, ఛత్తీస్‌గఢ్‌లో రూ.కోటి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రూ.25 లక్షలు, జార్ఖండ్‌లో రూ.12 లక్షలు, ఎన్‌ఐఏ రూ.15 లక్షలు ప్రకటించాయి. కేంద్ర కమిటీ సభ్యులుగా ప్రాతి నిధ్యం వహిస్తున్న మావోయిస్టు నేతలు ఒక్కొక్కరిపై రూ. కోటి ప్రకటించగా, తెలుగు రాష్ట్రాల్లో రూ.25 లక్షలుగా ఉంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఒక ప్రకటన కూడా చేసింది. ఆ రివార్డులను తెలుగు రాష్ట్రాల్లో పెంచడం కోసం తాజా ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారన్న ప్రచారం ఉంది. 
 

మరిన్ని వార్తలు