'ఆర్జీఐఏ' పది వసంతాల పయనం

22 Mar, 2018 08:47 IST|Sakshi

రేపు దశాబ్ది వేడుకలు

‘ఎయిర్‌పోర్టు సిటీ’కి సీఎం శంకుస్థాపన

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ మహానగరకీర్తికిరీటంలో కలికితురాయి లాంటి రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పది వసంతాలు పూర్తి చేసుకోనుంది. ప్రపంచంలోని అన్ని ప్రధాననగరాలకు, దేశంలోని అన్ని మెట్రోపాలిటన్‌నగరాలకు విమాన సర్వీసులు అందిస్తున్నఅందజేస్తోన్న శంషాబాద్‌ విమానాశ్రయం‘ఎయిర్‌పోర్టు సిటీ’గా విస్తరించేందుకు సిద్ధమైంది. ప్రయాణికుల రవాణాలో, కార్గో రవాణా రంగంలోనూ అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్న ఎయిర్‌పోర్టు ఐటీ ఆధారిత సేవల వినియోగంలో  దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిచింది. ఈ నెల 23వ తేదీకి పదేళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

అంచలంచెలుగా ఎదిగి..
హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం జీఎమ్మార్, ఎయిర్‌పోర్టు అథారిటీస్‌ ఆఫ్‌ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంతో ఆవిర్భవించింది. 2008 మార్చి 23న ప్రయాణికులకు ఇక్కడ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఏటా సుమారు కోటి మంది ప్రయాణికులు, 1.50 మిలియన్‌ టన్నుల కార్గో రవాణా లక్ష్యంగా ఈ ఎయిర్‌పోర్టును నిర్మించారు. తొలి ఏడాది సుమారు 60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించగా.. ఇప్పుడు ఆ సంఖ్య 1.80 కోట్లకు చేరింది. మొదట్లో 28 జాతీయ, అంతర్జాతీయ నగరాలకు మాత్రమే ఫ్లైట్‌ సర్వీసులు అందుబాటులో ఉండగా ప్రస్తుతం 9 జాతీయ, 15 అంతర్జాతీయ, 3  ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ ద్వారా  60 జాతీయ, అంతర్జాతీయ నగరాలకు సర్వీలు నడుస్తున్నాయి. గత సంవత్సరం కొలంబో, వాషింగ్టన్‌ డీసీ, కువైట్, షార్జా, దోహ తదితర నగరాలకు సైతం డైరెక్ట్‌ సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ ఎయిర్‌పోర్టు ప్రారంభించిన ఏడాదిలోనే ప్రతిష్టాత్మకమైన ‘లీడ్‌’ అవార్డును సొంతం చేసుకుంది. సోలార్‌ విద్యుత్‌ వినియోగం, పర్యావరణ హితమైన ప్రమాణాల అమలులోనూ ముందుంది. 

‘ఎయిర్‌పోర్టు సిటీ’కి శంకుస్థాపన..
శుక్రవారం విమానాశ్రయంలోని హజ్‌ టర్మినల్‌ వద్ద నిర్వహించే దశాబ్ది ఉత్సవాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. పలువురు ప్రముఖులు పాల్గొనే ఈ వేడుకలో ఎయిర్‌పోర్టు విస్తణకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ‘హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు సిటీ’గా అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ చేపడతారు. సుమారు 600 ఎకరాల విస్తీర్ణంలో ఎగ్జిబిషన్‌ హాల్స్, మాల్స్, హోటళ్లు, హాస్పిటళ్లు, ఉద్యానవనాలు వంటి ఏర్పాట్లతో హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచేవిధంగా ఈ సిటీని నిర్మించనున్నారు.   

డిజిటల్‌ ఎయిర్‌పోర్టు దిశగా పరుగులు..
అన్ని విభాగాల్లోను సాంకేతిక సేవలను అందుబాటులోకి తేవడంతో ‘డిజిటల్‌  ఎయిర్‌పోర్టు’గా గుర్తింపు పొందింది. ప్యాసింజర్‌ ఈజ్‌  ప్రైమ్‌ కార్యక్రమంలో భాగంగా తనిఖీలను ‘స్మార్ట్‌’గా మార్చారు. త్వరలో ‘ఫేస్‌ రికగ్నైజేషన్‌’ యంత్రాలు సైతం అందుబాటులోకి రానున్నాయి. రెగ్యులర్‌ ప్రయాణికుల ‘ట్రావెల్‌ హిస్టరీ’ని నమోదు చేసేందుకు చర్యలు చేపట్టారు. దీంతో వారు తక్కువ సమయంలోనే తనిఖీలు పూర్తి చేసుకునే అవకాశం లభిస్తుంది. హ్యాండ్‌బ్యాగ్‌ స్కానింగ్, స్వతహాగా నడవలేని ప్రయాణికుల కోసం ఒక్క అలారంతో పార్కింగ్‌ వద్దకే వీల్‌చైర్‌ సేవలను అందుబాటులోకి తేవడం, బయోటాయిలెట్లు, పేపర్‌లెస్‌ సర్వీసులు తదితర సదుపాయాల ద్వారా ఎయిర్‌పోర్టును పూర్తిగా డిజిటలైజ్‌ చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు.

మరిన్ని వార్తలు