ప్రపంచంలోనే మూడో స్థానం

21 Sep, 2019 09:59 IST|Sakshi

అత్యంత వేగంగాఅభివృద్ధి చెందుతున్నశంషాబాద్‌ విమానాశ్రయం  

21.9 శాతం వృద్ధి రేటు ప్రపంచంలోనే మూడో స్థానం  

ఏసీఐ నివేదికలో వెల్లడి  

సాక్షి, సిటీబ్యూరో: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు (ఆర్‌జీఐఏ) ప్రయాణికుల వృద్ధి రేటులో దూసుకెళ్తోంది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానాశ్రయాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. ఎయిర్‌పోర్ట్స్‌ కౌన్సిల్‌ ఇంటర్నేషనల్‌ (ఏసీఐ) తాజాగా విడుదల చేసిన నివేదికలోఈ మేరకు వెల్లడైంది. గతేడాది నాటికి సుమారు 1.5 కోట్ల మందికి పైగా ప్రయాణికులతో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎయిర్‌పోర్టుల జాబితాలో బెంగళూర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం తొలి స్థానంలో నిలవగా.. టర్కీలోని అంటాలె అంతర్జాతీయ విమానాశ్రయం రెండో స్థానంలో ఉంది. ఇక శంషాబాద్‌ విమానాశ్రయం మూడో స్థానం దక్కించుకుంది. అదే విధంగా మన దేశంలో రెండో స్థానంలో ఉంది.

గతేడాదితో పోలిస్తే ఈసారి 21.9 శాతం వృద్ధి రేటు సాధించడం విశేషం. హైదరాబాద్‌ విమానాశ్రయం తర్వాత రష్యా ఫెడరేషన్‌లోని నుకోవ్‌ ఎయిర్‌పోర్టు, చైనాలోని జినాన్‌ ఉన్నాయి. ప్రపంచంలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య డెస్టినేషన్‌–టూరిస్టు ప్రదేశంగా హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక ప్రముఖ కేంద్రంగా మారుతోందని ఈ నివేదిక పేర్కొంది. ప్రస్తుతం ఇక్కడి నుంచి 29 ఎయిర్‌లైన్స్‌ దేశీయంగా, అంతర్జాతీయంగా 69 ప్రదేశాలకు విమానాలను నడుపుతున్నాయి. 2015–2019 మధ్య కాలంలో ఏటా సుమారు 20 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఇక్కడి నుంచి ప్రతిరోజు 60వేల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. 500కు పైగా విమానాలు హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు అందుబాటులో ఉన్నాయి. గతేడాదిలో ఇక్కడి నుంచి అత్యధిక మంది అమెరికా, యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, థాయ్‌లాండ్‌లకు వెళ్లగా... దేశీయంగా ఇక్కడి ప్రయాణికులు ప్రధానంగా ఢిల్లీ, ముంబై, బెంగళూర్, కోల్‌కతా, చెన్నైలకు ఎక్కువగా పయనిస్తున్నారు.  

విజయవంతంగా ఫేస్‌ రికగ్నేషన్‌..
డిజియాత్ర పథకంలో భాగంగా జీఎమ్మార్‌ హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ఇటీవల ప్రారంభించిన ఫేస్‌ రికగ్నేషన్‌ ట్రయల్స్‌ విజయవంతమయ్యాయి. దీంతో ముఖకవళికల నమోదు ఆధారంగా ప్రయాణికుల తనిఖీని సులభతరం చేసిన మొట్టమొదటి ఎయిర్‌పోర్టుగా నిలిచింది. అలాగే దేశీయ ప్రయాణికులకు ఈ–బోర్డింగ్‌ సదుపాయాన్ని కల్పించింది. బ్యాగ్‌ ట్యాగ్‌లను తొలగించిన మొట్టమొదటి విమానాశ్రయం కూడా హైదరాబాద్‌ కావడం గమనార్హం. కేవలం హ్యాండ్‌ బ్యాగేజ్‌తో వచ్చే వారి కోసం ఎక్స్‌ప్రెస్‌ సెక్యూరిటీ చెకిన్‌ ప్రవేశపెట్టారు.

మరిన్ని వార్తలు