బియ్యం ధరలు పైపైకి

6 May, 2015 02:53 IST|Sakshi

ఆదిలాబాద్ అగ్రికల్చర్ : సన్నం బియ్యం ధరలు గత రెండు నెలల్లోనే ఆకాశాన్ని తాకేలా పెరిగాయి. బీపీటీ, సోనామసూరి, జేజీలుకు క్వింటాల్‌కు రూ.350 నుంచి రూ.600 వరకు పెరిగింది. సాధారణ రకం బియ్యం క్వింటాల్‌కు ధర మార్కెట్‌లో రూ.3,500 ఉండగా.. ప్రస్తుతం రూ.4,000లకు చేరింది. కొత్త బియ్యానికే ఈ ధర పలుకుతోంది. ఇక పాత బియ్యానికి అదనంగా రూ.300 వరకు చెల్లించాల్సి వస్తోంది. సన్న బియ్యం హెచ్‌ఎంటీ గతంలో క్వింటాల్‌కు రూ.5,500 ఉండగా.. ప్రస్తుతం రూ.6,000లకు చేరింది. జైశ్రీరామ్ క్వింటాల్‌కు రూ.5,500 నుంచి రూ.6,100కి పెరిగింది.

బీపీటీ (బాపట్టా) రూ.3,300 నుంచి రూ.4,000లకు చేరింది. ఇప్పటికే వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో వరి సాగు తగ్గి మార్కెట్‌కు ధాన్యం ఆశించిన స్థాయిలో రాకపోవడంతో వీటి ధరలకు రెక్కలొస్తున్నాయి.
 
కరువు కాటు..
జిల్లాలో గడిచినా ఏడాది ఖరీఫ్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు లేక రైతులు వరి సాగుకు మొగ్గు చూపలేదు. వరి విత్తనాలు అలికినా నాట్లు వేసుకునే సమయానికి వర్షాలు పడలేదు. దీంతో పొలాల్లోనే నారు వదిలేశారు. రబీ నీరు అందించేందుకు కరెంటు కోత తలెత్తేలా ఉం దని ప్రభుత్వమే వరి సాగు చేసుకోవద్దని సూచించింది. దీంతో పంట వేసుకోలేదు. సాధారణ వరి విస్తీర్ణం 1.45 లక్షల ఎకరాలు కాగా.. తీవ్రమైన వర్షాభావ పరిస్థితులతో 59 వేలకే పరిమితమైంది. రబీ సాధారణ వరి విస్తీర్ణం 72 వేల ఎకరాలకు గాను 29 వేల ఎకరాలే సాగైంది. ఇది కూడా ప్రధాన ఆయకట్టు కింద సాగు చేసిందే.

ఖరీఫ్‌లో కరువు కాటేస్తే, రబీలో అకాల వర్షా లు దిగుబడి దశలో తీవ్రంగా దెబ్బతిశాయి. ఏటా ఖరీ ఫ్, రబీలో ధాన్యం దిగుబడి 2 లక్షల 20 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సుమారుగా అందుబాటులో ఉండేది. కానీ.. ఈ ఏడాది ఖరీఫ్, రబీ కలిపి లక్ష మెట్రిక్ ట న్నులు కూడా అందుబాటులో లేకుండాపోయింది. వరి దిగుబడి అనంతరం రైతుల కోసం తమ వద్ద కొంత నిల్వ చేసేవారు. మిగతా ధాన్యాన్ని మార్కెట్ తరలించేవారు. కానీ.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అన్నదాతకు తినేందుకు తిండిగింజా దొరకని దుస్థితి దాపురించిం ది. ఖరీఫ్, రబీ సాగులో వరితోపాటు కంది, మినము లు, పెసర, శనగ, గోధుమ పంటలదీ అదే పరిస్థితి. సాధారణం కంటే సాగు తగ్గడమే కాకుండా విత్తుకున్న పంట దిగుబడి లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు.
 
రీసైక్లింగ్ దందా..
కరువు కారణంగా వినియోగానికి ధాన్యం అందుబాటు లో లేకపోవడంతో వ్యాపారులు, మిల్లర్లు కల్తీ వ్యాపారానికి తెరలేపారు. జిల్లాలో ప్రభుత్వం ఆహార భద్రతా కార్డుల ద్వారా అందిస్తున్న రేషన్ (దొడ్డు) బియ్యాన్ని కొంత మంది మిల్లర్లు ప్రధాన పట్టణాల్లో ఆధునిక యంత్రాల ద్వారా రీసైక్లింగ్ చేస్తే సన్నబియ్యంగా మార్చుతున్నారు. కొంత మంది మిల్లర్లు రేషన్ డీలర్లను మచ్చిక చేసుకుని లక్షల క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని క్వింటాల్‌కు రూ.1,200 నుంచి 1,400 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. బోగస్ రేషన్ కార్డుల ద్వారా తదితర జిమ్మిక్కులతో రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు.

దొడ్డు బియ్యాన్ని సన్నరకంగా మార్చి రూ.3,800 నుంచి రూ.4,500 వరకు అమ్మకాలు సాగిస్తున్నారు. జిల్లాలో నెలకు లక్షల క్వింటాళ్ల రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వినియోగదారులు గుర్తు పట్టనంతగా మారుతున్నాయి. క్విం టాలు దొడ్డు బియ్యం రీసైక్లింగ్ చేస్తే 75 నుంచి 80 క్విం టాళ్ల వరకు వస్తోంది. వ్యాపారులు, మిల్లర్లు  లక్షల్లో లా భాలు ఘడిస్తున్నారు. ప్రధానంగా ఈ రీసైక్లింగ్ వ్యవహారం బెల్లంపల్లి, మంచిర్యాల, కాగజ్‌నగర్, నిర్మల్, ఆదిలాబాద్ ప్రాంతాలలో ఎక్కువగా సాగుతోంది.   
 
నియంత్రణ కరువు..
బియ్యం ధరలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ధరలు సమీక్షించాల్సిన అధికారులు ఆ దిశగా చొరవ చూపకపోవడంతో వ్యాపారుల ధరలను ఇష్టానుసారంగా పెంచేస్తున్నారు. కొందరు వ్యాపారులు బియ్యంతోపాటు, నిత్యావసర పప్పులు అక్రమంగా నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుతున్నారు. గతేడాది ఇదే సమయంలో ఉన్నతాధికారులు సమీక్షించి ధరల నియంత్రణకు ప్రభుత్వం తరఫున పలు చర్యలు చేపట్టారు. సోనమసూరి బియ్యం రూ.కిలో 27 చొప్పున విక్రయించాలని జిల్లాలో ఎనిమిది కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ.. ప్రస్తుతం ఆ కేంద్రాల్లో అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బియ్యం ధరలకు కళ్లెం వేయాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు