బియ్యం ధరలు పైపైకి...

24 Jun, 2014 01:45 IST|Sakshi
బియ్యం ధరలు పైపైకి...

సరిపోని రేషన్ బియ్యం  
- జాడలేని ప్రభుత్వ సన్నరకం విక్రయ కేంద్రాలు
- ప్రైవేటు దుకాణాల్లో ఇష్టారాజ్యంగా ధరలు  
- సామాన్యులకు తప్పని కష్టాలు

లక్సెట్టిపేట : బియ్యం ధరలు ఆకాశాన్నంటాయి. జిల్లాలో ప్రధాన పంటగా వరి పండిస్తున్నా బియ్యం ధరలు మాత్రం రోజురోజుకు పైపైకి ఎగబాకుతున్నాయి. వాటి ధర వింటేనే.. పేద, మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ధరల పుణ్యమా అని వారు మూడు పూటలా అన్నం తినే పరిస్థితి లేకుండాపోయింది.
 
అన్నం తప్పనిసరి..
జిల్లా ప్రజల్లో మూడు పూటలా అన్నం తినేవారి సంఖ్యే ఎక్కువ. జొన్న రొట్టె, చపాతితోపాటు అన్నం కచ్చితంగా ఉండాల్సిందే. అన్నంకు ఇక్కడి ప్రజలు అంతగా ప్రాధాన్యమిస్తారు. ఇంట్లో కూరలేమి లేకపోయినా వేడి అన్నంలో కాస్త ఊరగాయ వేసుకుని పెరుగుతో భోజనం ముగించి, తమతమ పనులకు వెళ్తుంటారు. అయితే పెరిగిన బియ్యం ధరలతో కడుపునిండా అన్నం తినే పరిస్థితి పేద, మధ్యతరగతి ప్రజలకు లేకుండా పోయింది.

రోజూ దొడ్డు బియ్యం తింటూనే బంధువులు వస్తే సన్నబియ్యం వండిపెట్టేవారు ప్రస్తుత ధరలతో బెంబేలెత్తుతున్నారు. అయితే వీరి అవసరం.. బియ్యం వ్యాపారులకు వరంగా మారింది. కొందరు ఇష్టారాజ్యంగా దొడ్డు, సన్నరకం బియ్యం ధరలు పెంచేసి అందినంత దండుకుంటున్నారనే విమర్శలున్నాయి.
 
సరిపోని రేషన్ బియ్యం..
ప్రభుత్వం తెల్ల రేషన్‌కార్డు ద్వారా నెలకు ఒక వ్యక్తికి నాలుగు కిలోల చొప్పున అందించే బియ్యం పక్షం రోజులకే సరిపోతున్నాయి. దీంతో మిగతా రోజుల గాసానికి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు దుకాణాలు, రైస్‌డిపోల నుంచి బియ్యం కొనాల్సిన పరిస్థితి. మార్కెట్లో కిలో దొడ్డు రకం బియ్యం ధర రూ.16 ఉండగా.. సన్నరకాల ధర రూ.40 పైనే ఉంది. అటు అధిక ధరలకు బియ్యం కొనలేక.. ఇటు రేషన్ బియ్యం సరిపోక పేద, మధ్యతరగతి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. గత్యంతరం లేక ఉన్నవాటిలో కాస్త తక్కువ ధరకు లభించే బియ్యాన్ని కొంటూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
 
 సన్నరకం బియ్యం కేంద్రాలేవీ..?
 సామాన్యులు సైతం సన్నరకం బియ్యం తినాలనే లక్ష్యంతో ప్రభుతం కొన్ని నెలల క్రితం సన్నరకం బియ్యం విక్రయ కేంద్రాలు ప్రారంభించింది. అధికారులు ఎంపిక చేసిన పట్టణాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో తెల్లరేషన్ కార్డుదారులకు రూ.29లకు కిలో బియ్యం చొప్పున విక్రయించింది. ఈ కేంద్రాల ఏర్పాటుతో సన్నరకం బియ్యం తినగలమనే ధీమా పేద, మధ్యతరగతి ప్రజల్లో కలిగింది. అయితే ఈ కేంద్రాలను ప్రారంభించిన నెల రోజులకే ఎత్తివేయడంతో పేదలకు నిరాశే మిగిలింది. రేషన్ బియ్యం సరిపోక.. బహిరంగ మార్కెట్లో సన్నరకం బియ్యం కొనుగోలు చేయలేక నానా అవస్థలు పడుతున్నారు.  
 
 పుట్టగొడుగుల్లా బియ్యం దుకాణాలు

 మండల కేంద్రంలో బియ్యం దుకాణాలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. రోజురోజుకు బియ్యం దుకాణాల సంఖ్య పెరుగుతోంది. కొందరు వ్యాపారులు సన్నబియ్యం పేరుతో దొడ్డు బియ్యం అమ్ముతూ పేదలను దోచుకుంటున్నారు. మరికొందరు నాసిరకం, పురుగులు ఉన్నవి అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. బియ్యం ధరలను నియంత్రించాల్సిన అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది.

మరిన్ని వార్తలు