బిచ్చగాళ్లల్లో ఇద్దరు కోటీశ్వరులు

21 Nov, 2017 14:00 IST|Sakshi
రిచ్‌ బెగ్గర్స్‌.. ఫర్జానా, రబియా బసీరా

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో ఇవాంక ట్రంప్‌ పర్యటన నేపథ్యంలో బెగ్గర్‌ ఫ్రీ సిటీ కార్యక్రమాన్ని చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. మెహదీపట్టణంలోని ఓ దర్గా వద్ద బిక్షాటన చేస్తున్న వారిని పోలీసులు నవంబర్‌ 11న చర్లపల్లి ఆనంద ఆశ్రమానికి తరలించారు. అయితే ఈ బిచ్చగాళ్లలో చక్కని ఇంగ్లీష్‌ మాట్లాడుతున్న ఇద్దరి మహిళలను చూసి జైలు అధికారులు అవాక్కయ్యారు. దీంతో వారి పూర్తి వివరాలు తెలుసుకున్న పోలీసులు కోట్లకు కోట్ల ఆస్తి ఉండి.. విదేశాల్లో ఉద్యోగాలు చేసిన మహిళలని తెలుసుకోని ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ వివరాలు.. ఫర్జానా, రబియా బసీరా అనే మహిళలు గత కొద్దిరోజులుగా లంగర్‌ హౌస్‌లో భిక్షాటన చేస్తూ జీవితం సాగిస్తున్నారు. 

బాబా సూచనలతో..
హైదరాబాద్‌ ఆనంద్‌బాగ్‌కు చెందిన ఫర్జానా(50) ఏంబీఏ చదివింది. లండన్‌లో అకౌంట్స్‌ ఆఫీసర్‌గా కూడా పనిచేసింది. రెండేళ్ల క్రితం భర్త చనిపోయాడు. ఆ తర్వాత ఆర్కిటెక్చర్ అయిన కుమారుడి దగ్గర ఉండేది.  అనారోగ్యానికి గురైన ఫర్జానా. ఓ బాబాను సంప్రదించింది. వ్యాధి తగ్గాలంటే దేవుడి దయ ఉండాలని, దర్గా వద్ద భిక్షాటన చేయాలని సూచించడంతో ఈ వృత్తిని ఎంచుకుంది. తల్లిని వదిలించుకోవాలనే ఫర్జానా కొడుకు ఇలా చేశాడని జైలు అధికారులు భావిస్తున్నారు. 

కుటుంబ సభ్యుల మోసం..
రబియా బసీరాకు అమెరికా గ్రీన్‌ కార్డ్‌ కూడా ఉంది. గతంలో అమెరికాలో టీచర్‌గా కూడా పనిచేసింది. నగరంలో కోట్లకు కోట్ల ఆస్తి ఉంది. బంధువులతో కలిసి ఉండాలని హైదరాబాద్‌లోనే ఉంటుంది. కొన్నాళ్ల క్రితం భర్త చనిపోయాడు. తనకు అండగా ఉన్న కూతురు కూడా కన్ను మూసింది. కోడుకులు, బంధువులు మోసం చేసి ఆస్తి లాక్కొని ఒంటరిదాన్ని చేశారు. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో దర్గా వద్ద భిక్షాటన చేస్తోంది. ఈ ఇద్దరి బిచ్చగత్తెల స్టోరీ బిచ్చగాడి సినిమాను తలపిస్తోంది.

మరిన్ని వార్తలు