కాగితాలపైనే చట్టం..

24 Jun, 2017 16:13 IST|Sakshi
కాగితాలపైనే చట్టం..
అటకెక్కిన 25 శాతం రిజర్వేషన్లు   
పట్టించుకోని పాలకులు, అధికారులు  
రిజర్వేషన్లు కల్పించాలంటున్న తల్లిదండ్రులు
 
వైరా: విద్యాహక్కు చట్టం కాగితాలకే పరిమితమైంది. నిరుపేద, అనాథ, ఎయిడ్స్‌ బాధిత పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నా.. పట్టించుకునేవారు కరువయ్యారు. విద్యాహక్కు చట్టం ప్రకారం నిరుపేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్ల కేటాయింపు.. ప్రభుత్వమే వారి ఫీజులు భరించాలని చట్టంలో పేర్కొంది. కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇప్పటికే బాలబాలికలకు వేర్వేరుగా గురుకులాలు, మోడల్‌ స్కూళ్లను ప్రారంభించింది. అయితే ప్రైవేటు పాఠశాలల్లో నిరుపేద విద్యార్థులకు కేటాయించాల్సిన సీట్ల గురించి మాత్రం ఆలోచించడం లేదు. దీనిపై పలు స్వచ్ఛంద సంస్థలు, విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. 2016–17 విద్యాసంవత్సరం నుంచి ప్రైవేటు విద్యాసంస్థల్లో ఉచితంగా అడ్మిషన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించేందుకు ఎలాంటి ఇబ్బందులనైనా ఎదుర్కొని విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించినా.. ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం విద్యాసంవత్సరం ప్రారంభమైనా 25 శాతం రిజర్వేషన్‌పై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు.
 
అమలుకు నోచుకోని ‘సుప్రీం’ తీర్పు
విద్యాహక్కు చట్టం అమలులో భాగంగా ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయించాలని ఐదేళ్ల క్రితం సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఇది ప్రతి యేటా అమలవుతుందని పేద విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో ఆశపడ్డారు. ఆ తీర్పు ఆచరణ సాధ్యం కాకపోవడంతో పేద విద్యార్థులు ప్రైవేటు చదువులకు దూరమవుతున్నారు. ఇప్పటికైనా ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. 
 
రిజర్వేషన్‌ ప్రకారం భర్తీ చేయాలి..
విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతిలో 25 శాతం సీట్లను పేద విద్యార్థులతో భర్తీ చేయాలి. ఇందులో అనాథలు, ఎయిడ్స్‌ బాధితుల పిల్లలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు సీట్లను కేటాయించారు. అయితే పూర్తిగా వ్యాపార దృక్పథంలో నడుపుతున్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఈ చట్టాన్ని మొత్తానికే విస్మరించాయి. సంబంధిత శాఖ అధికారులు కూడా చట్టం అమలుపై దృష్టి సారించకపోవటంతో అబాసుపాలవుతోంది. 
 
ఫీజులు ప్రభుత్వమే భరిస్తుందా..
ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు కేటాయించేందుకు యాజమాన్యాలు సుముఖంగా లేవు. ఒకవేళ సీట్లు కేటాయించినా ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల్లో ఉన్న వేలకు వేల ఫీజులు భరిస్తుందా అనే అనుమానం తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాల్లోనూ ఉంది. టెక్నో, ఒలింపియాడ్, కాన్సెప్ట్, డిజిటల్, ప్లే స్కూల్‌ తదితర పేర్లతో వచ్చిన పాఠశాలల్లో ఫీజులు వేలాది రూపాయలు తీసుకుంటున్నారు. ప్రభుత్వానికి భారమైనా పేదలకు ప్రైవేటు విద్యను అందించేందుకు చట్టాన్ని అమలు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు, విద్యావేత్తలు ముక్తకంఠంతో కోరుతున్నారు. 
 
చట్టం అమలైతే..
జిల్లాలో సుమారు 172 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. విద్యాహక్కు చట్టం అమలుకు నోచుకుంటే సుమారు 5,454 మంది పేద విద్యార్థులకు మేలు జరగనుంది. 
 
నిబంధన ఉంది..
విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్‌ పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం రిజర్వేషన్‌ పద్ధతిన సీట్లు కేటాయించాలనే నిబంధన ఉంది. దీనిపై ఇప్పటికే ప్రైవేటు పాఠశాలలకు కూడా ఆదేశాల జారీ చేశాం. తప్పకుండా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పేద విద్యార్థులకు సీట్లు కేటాయించి సహకరించాలి.
ఎస్‌.విజయలక్ష్మీబాయి, జిల్లా విద్యాశాఖాధికారి, ఖమ్మం
 
 
 
 
 
 
 
 
 

Right to Education Act , private schools,  విద్యాహక్కు చట్టం, ప్రైవేటు పాఠశాలలు

మరిన్ని వార్తలు