అటానమస్‌గా ​రిమ్స్‌

14 Jul, 2019 12:14 IST|Sakshi
మాట్లాడుతున్న వైద్య శాఖ మంత్రి ఈటల

ఆస్పత్రిలో నాణ్యమైన వైద్యం అందేలా చూస్తాం

మారుమూల ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు అధిక ప్రాధాన్యం

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌

సాక్షి, ఆదిలాబాద్‌టౌన్‌: రిమ్స్‌ ప్రస్తుతం సెమీ అటానమస్‌ పద్ధతిలో కొనసాగుతోందని..భవిష్యత్‌లో అటానమస్‌గా గుర్తించేందుకు చర్యలు చేపడుతామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. సర్కారు ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన శనివారం రిమ్స్‌ ఆస్పత్రిని పరిశీలించారు. అనంతరం రిమ్స్‌ వైద్యులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులతో రిమ్స్‌ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ప్రత్యేక గుర్తింపు కల్పిస్తామన్నారు. ఒకే చోట ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన వైద్యులకు బదిలీల్లో తగిన ప్రాధాన్యం ఇస్తామన్నారు.

రిమ్స్‌ ప్రస్తుతం సెమీ అటానమస్‌ పద్ధతిలో కొనసాగుతుందని, భవిష్యత్‌లో అటానమస్‌గా గుర్తించేందుకు చర్యలు చేపడతామన్నారు. ప్రొఫెసర్లు, వైద్యులు పనిచేసేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదని, అటానమస్‌ అయితే మరిన్ని నాణ్యమైన వైద్యసేవలు అందుతాయన్నారు. త్వరలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లాలో గిరిజనులతోపాటు అన్నివర్గాల వారికి నాణ్యమైన వైద్యసేవలు అందించాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు. చాలా మంది వైద్యులు వృత్తి నిబద్ధతతో పనిచేసేవారు ఉన్నారని, వైద్యులపై దాడులు జరగకుండా రక్షణ కల్పిస్తామని పేర్కొన్నారు. అయితే ప్రతీ వైద్యునిలో నిబద్ధతతో పనిచేస్తామనే తపన ఉండాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో పీహెచ్‌సీల్లో కనీస మౌలిక వసతులు ఉండేవి కావని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని మౌలిక వసతులను కల్పించామన్నారు. మోడల్‌ పీహెచ్‌సీగా తీర్చిదిద్దామని, నాన్‌ టీచింగ్, టీచింగ్‌ సిబ్బంది పోస్టులను భర్తీ చేస్తామన్నారు.

ఆదిలాబాద్‌ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. సమావేశంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్, ఆదిలాబాద్, బోథ్‌ ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్‌ బాపురావు, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ రమేశ్‌రెడ్డి, జెడ్పీవైస్‌ చైర్మన్‌ రాజన్న, రిమ్స్‌ డైరెక్టర్‌ కరుణాకర్, ఆర్‌ఎంఓ రాము, సూపరింటెండెంట్‌ సత్యనారాయణ, డీఎంహెచ్‌ఓ రాజీవ్‌రాజ్, తదితరులు పాల్గొన్నారు.

కార్యకర్తల హల్‌చల్‌..
రిమ్స్‌ ఆస్పత్రిని పరిశీలించేందుకు వచ్చిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసేందుకు కార్యకర్తలు హల్‌చల్‌ చేశారు. ఆస్పత్రిలో రోగులకు వైద్యసేవలు అందుతున్న విషయాలను తెలుసుకునేందుకు వెళ్లిన మంత్రి వెంట టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు వెళ్లడంతో ఆస్పత్రిలో రద్దీగా మారింది. కేవలం ఎంఐసీయూలో ఒక రోగితో మాత్రమే మాట్లాడారు. ఆ తర్వాత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశంలో హాలు అంతా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులతో నిండిపోయింది. వైద్యులకు కూడా కనీసం కూర్చోవడానికి కుర్చీలు ఇవ్వకుండా కార్యకర్తలే కూర్చోవడంతో కొంతమంది వైద్యులు వెనుదిరిగి వెళ్లిపోయారు. ఆ తర్వాత వారిని బయటకు పంపారు.    

మరిన్ని వార్తలు