అనుసంధానం ఏకపక్షం!

30 Dec, 2018 01:23 IST|Sakshi

అకినేపల్లి నుంచి తరలింపుపై గతంలోనే తెలంగాణ అభ్యంతరం

 తాజాగా జానంపేట్‌ నుంచి తరలింపు ప్రతిపాదన అధ్యయనానికి టెండర్లు

 ఎన్‌డబ్ల్యూడీఏ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన తెలంగాణ

 సంప్రదింపులు జరపకుండా తరలింపు సరికాదంటూ లేఖ 

చర్చించకుండానే ‘నదుల’పై ముందుకు వెళ్తున్న ఎన్‌డబ్ల్యూడీఏ

సాక్షి, హైదరాబాద్‌: గోదావరి–కావేరి అనుసంధాన ప్రక్రియలో జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. అనుసంధాన ప్రక్రియపై ఎలాంటి నిర్ణయాలు చేసినా, కొత్త ప్రతిపాదనలు తెచ్చినా ముందుగా రాష్ట్రంతో సంప్రదింపులు చేయాలని కోరుతున్నా పట్టనట్లే వ్యవహరిస్తోంది. ఇప్పటికే ప్రతిపాదించిన అకినేపల్లి విషయంలో అభిప్రాయాలు తీసుకోని ఎన్‌డబ్ల్యూడీఏ, తాజాగా జనంపేట్‌ నుంచి నీటిని       తరలించే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. అందుకు అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీకి ఎలాంటి సంప్రదింపులు, చర్చలు లేకుండానే టెండర్లు పిలవడం రాష్ట్ర ప్రభుత్వానికి ఆగ్రహం   తెప్పిస్తోంది.  

పలుమార్లు అభ్యంతరాలు... 
ఒడిశాలోని మహానది మొదలు తెలంగాణ, ఏపీలోని గోదావరి, కృష్ణాలను కలుపుతూ, తమిళనాడు, కర్ణాటకలోని కావేరి వరకు నదుల అనుసంధానాన్ని చేపట్టిన కేంద్రం, ఇప్పటికే దానికి అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మహానదిలో 360 టీఎంసీలు, గోదావరిలో 530 టీఎంసీల మేర మిగులు జలాలున్న దృష్ట్యా, ఇందులో 247 టీఎంసీల నీటిని ఖమ్మం జిల్లాలోని అకినేపల్లి నుంచి కృష్ణా, కావేరికి తరలించాలని ప్రతిపాదించింది. అయితే దీనిపై తెలంగాణ పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. గోదావరిలో తెలంగాణకు హక్కుగా 954 టీఎంసీల కేటాయింపు ఉందని, అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఆ మేరకు నీటిని వాడుకునే అవకాశం దక్కలేదని తెలిపింది. ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు సైతం చేపట్టడంతో ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలకు తెలంగాణకు 1,600 టీఎంసీలు కావాల్సి ఉందని తెలిపింది. ఈ నీటి వినియోగానికి వీలుగా కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, ఎల్లంపల్లి, ప్రాణహిత, దేవాదుల ఎత్తిపోతల వంటి పథకాలు చేపట్టామని వెల్లడించింది. ఈ పథకాలకు అవసరమయ్యే నీటిని పక్కనపెట్టి, అంతకుమించి నీటి లభ్యత ఉంటే దానిని నదుల అనుసంధానం ప్రక్రియకు వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. జాతీయ ప్రయోజనాల కోసం తెలంగాణ సహకరిస్తుందని, అయితే రాష్ట్ర ప్రయోజనాలను మాత్రం అందుకు పణంగా పెట్టలేమని చెప్పింది.  

110 యేళ్ల సరాసరి సరికాదు... 
అలాగే గోదావరిపై అకినేపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి నీటిని మళ్లించాలన్న కేంద్రం ప్రతిపాదనతో దాదాపు 45 గ్రామాలు, 48వేల ఎకరాలు ముంపునకు గురవుతాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. సీఎస్‌ ఎస్‌కే జోషి సైతం ఇటీవల ఎన్‌డబ్ల్యూడీఏకు లేఖ రాశారు. కాళేశ్వరం, కంతనపల్లి ప్రాజెక్టుల అనుమతికి సంబంధించి నీటి లభ్యత అంశంలో 40 సంవత్సరాల సరాసరి ప్రాతిపదికగా తీసుకున్న కేంద్ర జల సంఘం, నదుల అనుసంధానం ప్రతిపాదనలో మాత్రం 110 సంవత్సరాల సరాసరి తీసుకోవడం సరికాదని చెప్పారు. అనుసంధానంపై రాష్ట్రాలతో చర్చించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సైతం కోరారు. రాష్ట్ర అభ్యంతరాల నేపథ్యంలో ఎన్‌డబ్ల్యూడీఏ కొత్తగా ఖమ్మం జిల్లాలోని జనంపేట్‌ నుంచి గోదావరి నీటిని మళ్లించడానికి ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

ఇందుకు అవసరమైన డీపీఆర్‌ తయారు చేయడానికి టెండర్లు పిలిచింది. ఇప్పటికే మిగులు జలాలు లేవని స్పష్టంగా చెబుతున్నా, మళ్లీ ఎన్‌డబ్లు్యడీఏ ఏకపక్షంగా ముందుకెళుతోంది. నీటిని తీసుకెళ్లే మార్గాల్లో ఎలాంటి మార్పులు చేయకుండా, రాష్ట్రంతో సంప్రదింపులు జరపకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యతరం వ్యక్తం చేస్తూ ఇటీవలే మరోమారు ఎన్‌డబ్ల్యూడీఏకు లేఖ రాసింది. రాష్ట్రాలతో సంప్రదింపులు కొనసాగించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు చేస్తే ప్రతిపాదనలకు తుది రూపం ఇవ్వలేరని స్పష్టం చేసింది.    తాజా లేఖ నేపథ్యంలో అయినా ఎన్‌డబ్ల్యూడీఏ స్పందిస్తుందా? లేక యథావిధిగా తనపని తాను చేసుకుపోతుందా వేచి చూడాలి.   
 

మరిన్ని వార్తలు