నదుల ఉగ్ర తాండవం  

6 Aug, 2019 02:43 IST|Sakshi
ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ గేట్లు ఎత్తివేయడంతో ఉరకలెత్తుతున్న వరద

కృష్ణా, గోదావరి నదుల్లో వరద ఉధృతం

జూరాలకు 2.662 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు

శ్రీశైలంలోకి 2.36 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

సాక్షి, హైదరాబాద్‌: వారం రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా, గోదావరి ఉగ్ర రూపం దాల్చుతున్నాయి. ఇప్పటికే వాగులు, వంకలన్నీ నిండటం, ఉప నదులు ఉప్పొంగుతుండటంతో నదుల్లో వరద ఉధృతి పెరుగుతోంది. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్, కోయినా, పశ్చమ కనుమల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్‌లోకి 2.5 లక్షల నుంచి 3 లక్షల క్యూసెక్కు ల మేర వరద వస్తుండగా అంతే మొత్తం దిగువ జూరాల, శ్రీశైలాన్ని చేరుతోంది. శ్రీశైలంలో నీటినిల్వ 121 టీఎంసీలకు చేరింది. 
భారీ వర్షాలు.. అంతే భారీ వరద

కృష్ణా బేసిన్‌లోని మహారాష్ట్ర మహాబలేశ్వర్‌లో ఆది, సోమవారాల్లో 38 సెం.మీ వర్షం కురవగా కోయినా పరిధిలో 25 సెం.మీ వర్షం కురిసింది. ఇతర చోట్ల సైతం భారీ వర్షాలు కురవడంతో కృష్ణా బేసిన్‌లోని ఉప నదులన్నీ పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఆల్మట్టి, నారాయణపూర్‌లకు వరద ఉధృతి 20 వేల క్యూసెక్కుల నుంచి 30 వేల క్యూసెక్కుల మేర పెరుగుతోంది. సోమవారం ఆల్మట్టిలోకి 2,59 లక్షల క్యూసెక్కుల (23.54 టీఎంసీలు) మేర వరద వస్తుం డగా నారాయణపూర్‌లోకి 3 లక్షల క్యూసెక్కుల (27.27 టీఎంసీలు) వరద వస్తోంది. దీంతో జూరాలకు 2.62 లక్షల క్యూసెక్కుల మేర వరద వస్తుండగా అంతేమొత్తంలో నీటిని దిగువ శ్రీశైలానికి వదులుతున్నారు.

శ్రీశైలానికి ప్రస్తుతం 2.36 లక్షల క్యూసెక్కుల (21.45 టీఎంసీలు) వరద నమోదైంది. ఎగువ కురిసిన వర్షాల వల్ల మంగళవారం నుంచి వరద పెరిగే అవకాశం ఉంది. కనిష్టంగా 3 లక్షల క్యూసెక్కుల మేర వరద వచ్చే అవకాశముందని కేంద్ర జలసం ఘం అంచనా వేసింది. అదే జరిగితే శ్రీశైలం 4–5 రోజుల్లోనే నిండనుంది. ఇప్పటికే శ్రీశైలం ద్వారా ఏపీ, తెలంగాణ తాగు, సాగు, విద్యుత్‌ అవసరాలకు 45,453 క్యూసెక్కుల నీటి విని యోగం మొదలు పెట్టింది. అయినా వరద ఉధృతి దృష్ట్యా ప్రాజెక్టు త్వరలోనే నిండనుంది. మహారాష్ట్రలోని ఉజ్జయినీ ప్రాజెక్టులోకి 1.60 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు వస్తున్నాయి. ప్రాజెక్టు వాస్తవ నీటి నిల్వ 117 టీఎంసీలు కాగా ఇప్పటికే నీటి నిల్వ 97 టీఎంసీలకు చేరుకుంది. మరో 20 టీఎంసీలు వస్తే ఉజ్జయినీ రెండ్రోజుల్లో నిండుతుంది. 

ఎల్లంపల్లి గేట్లు ఎత్తివేత...
గోదావరిలో వరద ఉధృతి పెరుగుతోంది. సోమవారం మేడిగడ్డ వద్ద 7.97 లక్షల క్యూసెక్కుల మేర వరద ప్రవాహం నమోదైంది. మేడిగడ్డ 81 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. మేడిగడ్డ పాయింట్‌ నుంచి 180 టీఎం సీల నీరు కిందికి వెళింది. వర్షాలతో ఎల్లంపల్లి నిండటంతో దానిలోకి వస్తున్న 35,953 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు. ఎస్సారెస్పీకి చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రవాహాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి.

నేడు గోదావరిని పరిశీలించనున్న సీఎం కేసీఆర్‌
మేడిగడ్డ నుంచి ధర్మపురి వరకు దాదాపు 140 కిలోమీటర్ల మేర సజీవంగా మారిన గోదావరి నదిని చూడడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం ఆయా ప్రాంతాల్లో పర్యటించనున్నారు. మేడిగడ్డ బ్యారేజీ, గోలివాడ పంప్‌హౌస్, ధర్మపురి పుణ్యక్షేత్రాలను సీఎం సందర్శిస్తారు. అధికారులు ఇంజనీర్లతోపాటు ఉదయం 10 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఈ పర్యటన సాగిస్తారు.
 

మరిన్ని వార్తలు