ఆర్టీసీ కార్మికులపై కక్ష సాధింపు సరికాదు

7 Apr, 2016 05:28 IST|Sakshi
ఆర్టీసీ కార్మికులపై కక్ష సాధింపు సరికాదు

టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి అశ్వత్థామరెడ్డి
ఆర్‌ఎం తీరుపై మండిపాటు
జిల్లాకేంద్రంలో నిరాహార దీక్ష
తరలివచ్చిన కార్మికులు

 
మహబూబ్‌నగర్ క్రైం: ఆర్టీసీ కార్మికులపై ఆర్‌ఎం కక్షసాధింపు సరికాదని టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి అశ్వత్థామరెడ్డి మండిపడ్డారు. కార్మికులు, సిబ్బంది యాజమాన్యం ఇంట్లో పనిచేసే పని మనుషులు కాదనే విషయం గుర్తించుకోవాలని హెచ్చరించారు. కార్మికుల సమస్యలపై ఆర్టీసీ యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి హోదాలో ఆయన మహబూబ్‌నగర్ ఆర్టీసీ బస్సు డిపో ఎదుట ఆయన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. కొన్నిరోజులుగా కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. నెలరోజుల్లో 20మంది కార్మికులను సస్పెండ్ చేశారని, వారందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు. జిల్లాలో కార్మికులతో 12నుంచి 14గంటల పాటు బలవంతపు విధులు నిర్వహింపజేస్తున్నారని, వాటిని మానుకోవాలని సూచించారు.


డాక్టర్ ఇచ్చి సిక్ లీవ్‌లకు అనుగుణంగా సెలవులు మంజూరుచేయాలని డిమాండ్ చేశారు. 26 సమస్యలతో ఎజెండా ఇస్తే నేటికీ మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అన్ని జిల్లాల్లో కారుణ్య నియామకాలు జరిగినా ఇక్కడ మాత్రం జరగలేదన్నారు. సమ్మెకు కార్మికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అంతకుమందు స్థానిక బస్టాండ్ నుంచి ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రాజసింహుడు, డీఎస్ చారి, కొండన్న, రవీందర్‌రెడ్డి, భానుప్రకాష్‌రెడ్డి, టీఎస్‌ఎస్‌రెడ్డి, విజయ్‌బాబు పాల్గొన్నారు.
 
 

 

Election 2024

మరిన్ని వార్తలు