ఆవిరైన ఆనందం

20 Jun, 2014 03:36 IST|Sakshi
ఆవిరైన ఆనందం

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు  ప్రమాదం
ఏడు రోజుల పసికందు, బాలింత,మరో ఇద్దరు దుర్మరణం
అందరూ ఒకే కుటుంబానికి చెందినవారు
కోజన్‌కొత్తూర్‌లో విషాదం

 
పాప పుట్టిందన్న ఆనందం వారం రోజులకే ఆవిరైంది. నిజామాబాద్ జిల్లాలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పసికందు, పచ్చిబాలింతరాలైన తల్లితోపాటు మరో ఇద్దరు కుటుంబ సభ్యులను బలిగొంది. మహాలక్ష్మిని ఇంటికి తీసుకువస్తున్న సమయంలో మృత్యుదేవత కబళించడంతో మృతుల స్వగ్రామం కోజన్‌కొత్తూర్‌లో విషాదం అలుముకుంది.

 ఇబ్రహీంపట్నం :నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం గాండ్లపేట శివారులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోజన్‌కొత్తూర్ గ్రామానికి చెందిన నలుగురు మృతిచెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది.  కోజన్‌కొత్తూర్‌కు చెందిన సుంకరి నర్సయ్య, రాంబాయి దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. కుమార్తెలిద్దరికీ వివాహమైంది. నర్సయ్య, చిన్న కుమారుడు వినోద్ ఉపాధి నిమిత్తం దుబాయి వెళ్లివస్తున్నారు. రెండు నెలల క్రితం పెద్ద కుమారుడు గంగనర్సయ్య వివాహానికి హాజరైన వారిద్దరు వారం క్రితమే దుబాయి తిరిగెళ్లారు. పెద్ద కూతురు సుజాత(27) వివాహం నిజామాబాద్ జిల్లా గుత్పకు చెందిన పిట్ల ప్రవీణ్‌తో జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉండగా, సుజాత వారం క్రితం ఆర్మూర్ ఆస్పత్రిలో కూతురికి జన్మనిచ్చింది. వీరిని ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చేందుకు రాంబాయి(45) కొడుకు గంగ నర్సయ్య, చిన్న కూతురు సుమలత(25)తో కలిసి అద్దెకారులో ఆర్మూర్ వెళ్లింది. సుజాతను, వారం రోజు ల పసికందును తీసుకుని అదేకారులో తిరుగుపయన మయ్యారు. 

నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం గాండ్లపేట శివారులో 63వ నంబర్ జాతీయ రహదారిపై వీరి కారు ఓవర్‌టేక్ చేయబోయి మరో కారు, డీసీఎం వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాంబాయి అక్కడికక్కడే మృతి చెందింది.  సుజాతను జగిత్యాల ఆస్పత్రికి తరలిస్తుండగా, సుమలత, సుజాత కూతురు(ఏడు రోజుల పసికందు)ను మెట్‌పల్లి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. రాంబాయి పెద్ద కుమారుడు గంగనర్సయ్య, కారు డ్రైవర్ బోదాసు రాజేందర్ పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్‌కు తీసుకెళ్లారు. విషయం తెలిసి దుబాయిలో ఉన్న నర్సయ్య, వినోద్ స్వదేశానికి బయల్దేరారు. మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి.
 

మరిన్ని వార్తలు