హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం

13 May, 2017 00:12 IST|Sakshi
హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం

ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఐదుగురి దుర్మరణం

నందిగామ (షాద్‌నగర్‌): ఆగి ఉన్న లారీని వెనక నుండి వస్తున్న ఇండికా కారు వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ సంఘటన గురువారం అర్ధరాత్రి రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం 44వ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా సి.గూడూరు మండలం చింతమానుపల్లి గ్రామానికి చెందిన సోమన్న (65), అతని భార్య నర్సమ్మ (55), బంధువు సిద్ధమ్మ (50), సోమన్న కొడుకు సోమేశ్‌ (45) హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి నుండి అద్దెకు తీసుకున్న టాటా ఇండికా కారులో గురువారం అర్ధరాత్రి స్వగ్రామమైన కర్నూలు జిల్లాకు బయలు దేరారు.

ఈ కారు నందిగామ మండలంలోని 44వ నెంబర్‌ జాతీయ రహదారిపై వెళుతుంది. ఈ సమయంలో ఎంఎస్‌ఎన్‌ పరిశ్రమ సమీపంలో మరమ్మత్తుల కారణంగా లారీ ఆగిపోయి ఉంది. వెనక నుంచి అతివేగంగా వస్తున్న ఇండికా కారు లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇండికా కారు లారీ కిందికి సగభాగం వరకు దూసుకపోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురితో పాటు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కమ్మెట గ్రామానికి చెందిన కారు డ్రైవర్‌ మల్లేశ్‌ (35) కూడా దుర్మరణం చెందాడు.

కొడుకును చూడటానికి వచ్చి అనంతలోకాలకు..
సోమేశ్‌ హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి సమీపంలో మేస్త్రీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వారి తల్లిదండ్రులు సోమన్న , నర్సమ్మ ఈ నెల 10న కొడుకును చూడటానికి హైదరాబాద్‌ వచ్చారు. గురువారం ఉదయం సోమన్న ప్రమాదవశాత్తు కొడుకు ఇంట్లో కింద పడగా కాలు విరిగింది. సమీపంలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ వైద్య ఖర్చులు అధికంగా అవుతాయని వైద్యులు చెప్పడంతో సోమన్నను స్వగ్రామానికి తరలించి చికిత్స చేయించాలని కుటుంబ సభ్యులు భావించారు. దీంతో వీరి కుటుంబ సభ్యులందరూ కారును అద్దెకు తీసుకొని అర్ధరాత్రి స్వగ్రామానికి వెళ్తూ ప్రమాదానికి గురై దుర్మరణం పాలయ్యారు.

కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలు
గురువారం రాత్రి 11.30 గంటలకు అతివేగంగా వెళుతున్న ఇండికా కారు ఆగిఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మృతదేహాలు కారులో ఇరుక్కుపోయాయి. మృతదేహాలను వెలికి తీయడానికి పోలీసులకు రెండు గంటల సమయం పట్టింది. చివరికి క్రేన్‌ సహాయంలో కారును తొలగించి మృతదేహాలను బయటికి తీసి శవ పరీక్షల నిమిత్తం షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పార్కింగ్‌ లైట్లు వేయక పోవడమే.. ప్రమాదానికి కారణమా..?
44వ నెంబరు జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం ఆగీ ఉన్న లారీనే. లారీ హైదరాబాదు నుంచి కర్నూలు వైపునకు వెళ్తుండగా నందిగామ శివారులోని ఎంఎస్‌ఎన్‌ పరిశ్రమ సమీపంలో ఇంజన్‌లో సమస్య తలెత్తింది. దీంతో లారీ రోడ్డుపైనే ఆగిపోయింది. కనీసం అక్కడ పార్కింగ్‌ లైట్లు కూడా వేయలేదు. దీంతో లారీ కనిపించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.

మృతుల కుటుంబ సభ్యులు హైదరాబాద్, కర్నూలు నుండి షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలివచ్చారు. బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలతో ఆసుపత్రి ఆవరణలో విషాయఛాయలు నెలకొన్నాయి.

కమ్మెటలో విషాదం
నందిగామ వద్ద రోడ్డు ప్రమాదంలో కారుడ్రైవర్‌ మల్లేశ్‌ దుర్మరణం
చేవెళ్ల: నందిగామ వద్ద గురువారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్‌ మల్లేశ్‌ స్వగ్రామం కమ్మెటలో శుక్రవారం విషాదచాయలు అలుముకున్నాయి. ఆగిఉన్న లారీని కారు ఢీకొట్టిన   ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మరణించిన కారు డ్రైవర్‌  రావులపల్లి మల్లేశ్‌(35)ది చేవెళ్ల మండలం కమ్మెట. గ్రామానికి చెందిన రావులపల్లి ఎల్లయ్య చిన్న కుమారుడైన మల్లేశ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నాలుగేళ్ల కిత్రం లింగంపల్లికి వెళ్లి కుటుంబంతో అక్కడే ఉంటున్నాడు.

సొంతంగా ఇండికా కారు  తీసుకొని దానిని నడుపుకుంటూ జీవిస్తున్నాడు. గురువారం  లింగంపల్లి నుంచి కర్నూలు జిల్లా గూడురుకు కిరాయి రావటంతో కారులో ఐదుగురుని ఎక్కించుకొని వెళ్తుండగా నందిగామ వద్ద జరిగిన ప్రమాదంలో అతడు కూడా మరణించాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. శుక్రవారం ఉదయం కమ్మెట సర్పంచ్‌ హన్మంత్‌రెడ్డి, కుటుంబసభ్యులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని గ్రామానికి తీసుకు వచ్చి అంత్యక్రియలు చేశారు. మృతునికి భార్య శ్రీలత, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా