నియంత్రణేది

30 May, 2017 16:51 IST|Sakshi
- అతివేగమే ప్రాణాంతకం
- ఔటర్‌ మరణాలన్నీ మానవతప్పిదాలే
- వేగనియంత్రణ వ్యవస్థేదీ లేదు
 
పటాన్‌చెరు : ప్రతి రోడ్డు ప్రమాదానికి ఏదోక కారణం ఉంటుంది. జాతీయ రహాదారిపై జరుగుతున్న ప్రమాదాలకు ప్రభుత్వాన్ని ప్రభుత్వ శాఖలను నిందించే అవకాశం ఉంది. కాని అత్యాధునిక పద్దతిలో నిర్మించిన ఔటర్‌పై ప్రమాదాలు కేవలం మానవ తప్పిదాలే అని చెప్పక తప్పని పరిస్థితి ఉంది. విశాలమైన రోడ్డు ఉండటంతో చోదకులు బ్రేకులున్నాయన్న సంగతే మరచి అతి వేగంగా ప్రయాణిస్తున్నారు. అదుపుతప్పిన వేగంతో ప్రయాణించడంతోనే ఔటర్‌పై ప్రమాదాలకు కారణమవుతున్నాయి. మహానగరం చుట్టూర ఉన్న ఔటర్‌ రింగ్‌రోడ్డుపై గత ఏడాది వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయారు. పటాన్‌చెరు పరిధిలో సుల్తాన్‌పూర్‌, ముత్తంగి, కొల్లురు జంక్షన్‌ల పరిధిలో గత అయిదు నెలల కాలంగా మొత్తం పదకొండు ప్రమాదాలు జరిగాయి. అయితే ఇందులో 11 మంది మృతి చెందారని పోలీసుల రికార్డులున్నాయి.
 
ఔటర్‌పై గుర్తు తెలియని రెండు శవాలను పోలీసులు గుర్తించారు. ఎక్కడో చంపి ఔటర్‌పై పడేసిన శవాలుగా భావించారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు అనుసంధానంగా ఉన్న సర్వీసు రోడ్లపై కూడ ప్రమాదాలు జరుగుతున్నాయి. వేగ నియంత్రణతోనే సమస్యను పరిష్కరిస్తామని అప్పట్లో హోమ్‌ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆ తరువాత కొన్ని రోజులు ఆయా కూడళ్ల వద్ద స్పీడ్‌ గన్స్‌ ఏర్పాటు చేశారు. కానీ వాటి పనితీరును ఎవరూ పట్టించుకోలేదు. ఆ తరువాత ఆ స్పీడ్‌ గన్స్‌ కరువయ్యాయి. ఇటీవల ఔటర్‌ రింగ్‌రోడ్డు నిర్వాహాక కమిటీ సమావేశంలో స్పీడ్‌ నియంత్రించాలని నిర్ణయం తీసుకున్నారు. ఔటర్‌పై ఎక్కే వాహానాల వేగ నియంత్రణ పరిమితిని ఏర్పాటు చేశారు. హీన పక్షంగా 40 కిలోమీటర్ల వేగంగా వెళ్లాలని వంద కిలోమీటర్లు/గంటకు తక్కువ కాకుండా వెళ్లాలని పరిమితులు విధించారు.
 
అయితే ఇప్పటి వరకు అందుకు సంబంధించిన వేగ నియంత్రికలను ఏర్పాటు చేయలేదు. పరిమితికి మించి వెళ్లే వారిపై ఏలాంటి చర్యలు తీసుకోలేదు. వేగంగా వెళ్తున్న వాహానాలు గుర్తించి వాటికి నోటీసులు పంపుతున్నారు. కాని అవి వాహాన యజమానికి చేరడం లేదు. ప్రత్యక్షంగా వాహాన యజమానులను ఆపి హెచ్చరించే వ్యవస్థ ఏది లేదు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు బొల్లారం(సుల్తాన్‌పూర్ జంక్షన్‌) పరిధిలో మొత్తం ఎనిమిది ప్రమాదాలు జరిగాయి.. ఇందులో ఇద్దరు మృతి చెందారు. పటాన్‌చెరు (ముత్తంగి జంక్షన్‌)పరిధిలో ఒక ప్రమాదం జరిగింది.. ఇందులో ఒకరు మృత్యువాత పడ్డారు.
 
ఆర్సీపురం(కొల్లూరు జంక్షన్‌) పరిధిలో రెండు ప్రమాదాలు జరిగితే.. అందులో 8 మంది మృతి చెందారు. పటాన్‌చెరు ముత్తంగి సమీపంలో జరిగిన ప్రమాదంలో ప్రీతమ్‌ రెడ్డి అనే బిటేక్‌ విద్యార్థి మృతి చెందారు. 2011 డిసెంబర్‌లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమారుడు ప్రతీక్‌ రెడ్డి మరో ఇద్దరు యువకులు ఔటర్‌ రింగ్‌రోడ్డు సర్వీసు రోడ్డుపై జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. ఓఆర్‌ఆర్‌ సర్వీసు రోడ్డుపై అతి వేగంగా ప్రయాణించడంతోనే ఆ ప్రమాదం జరిగింది. ఇదిలా ఉండగా ఎక్కుడో చంపిన మృత దేహాలను పటాన్‌చెరు ఓఆర్‌ఆర్‌ పరిధిలో పడేసిన సంఘటనలు రెండున్నాయి.
 
అసాంఘీక శక్తులకు అడ్డాగా.. 
పటాన్‌చెరు, బొల్లారం, బీడీఎల్ పోలీస్‌స్టేషన్ల్‌ పరిధిలోని ఓఆర్‌ఆర్‌ సర్వీసు రోడ్లపై అసాంఘీక శక్తులకు అడ్డాగా మారాయి. విశాలమైన సర్వీసు రోడ్లపై తాగు బోతులు పోకిరిలు కూర్చుని పిచ్చాపాటిగా కాలక్షేపం చేస్తున్నారు. తాగిన మద్యం బాటిళ్లను రోడ్డుపక్కన ఉన్న పేవ్‌మెంట్‌పై పాడేస్తున్నారు. ఆలాగే బాటిళ్ల గాజు ముక్కలు రోడ్లపై పారేస్తున్నారు. ఆయా గ్రామాలకు ద్విచక్రవాహానంపై వెళ్తున్న వారిని ఆ పోకిరిలు వేధిస్తున్నారు. ముత్తంగి నుంచి పాటి వెళ్లే దారిలో చాలా మంది మందుబాబులు రాత్రి 6 నుంచి 10 గంటల వరకు కూర్చుంటున్నారు.
 
రాత్రి పూట గస్తీ తిరుగుతున్నాం
రాత్రి పూట ఓఆర్‌ఆర్‌పై గస్తీ వాహానాలు తిరుగుతున్నాయి. అతి వేగంగా అజాగ్రత్తగా నడిపే వాహానాలను గుర్తించి వారిని హెచ్చరిస్తున్నాము. జంక్షన్‌ వద్ద తనిఖీలు కూడ చేపడుతున్నాము.
- వేణుగోపాల్‌రెడ్డి, సీఐ బీడీఎల్ పోలీస్‌స్టేషన్‌
 
జరిమానాలు విధిస్తున్నాం
ఔటర్‌పై ప్రమాదాల నివారణకు తమ ఉన్నతాధికారు సూచనల మేరకు వేగ నియంత్రణపై దృష్టిపెట్టాం. ఇప్పటి వరకు సీసీ కెమెరాలు ఉన్నాయి. స్పీడ్‌ను కొలిచే వ్యవస్థలున్నాయి. వాటితో అతి వేగంగా వెళ్తున్న వారికి నోటీసులు వెళ్తున్నాయి.
-రాజు, ఏజీఎం, హెచ్‌జీసీఎల్
మరిన్ని వార్తలు