86 నిమిషాలకో ప్రాణం..

25 Nov, 2019 03:14 IST|Sakshi

అక్టోబర్‌ చివరినాటికి రోడ్డు ప్రమాద మృతులు 5వేలు 

రోజుకు 16 మంది దుర్మరణం

ట్రాఫిక్‌ ఉల్లంఘనుల్లో మెజారిటీ విద్యావంతులే 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు ఠారెత్తిస్తున్నాయి. రోడ్డుపై నిర్లక్ష్యంగా, అడ్డూ అదుపు లేకుండా ప్రయాణిస్తూ పలువురు వాహనదారులు ప్రమాదాలకు కారణమవుతున్నారు. పోలీసులు, ప్రభుత్వం ఎంత ప్రచారం చేసినా..రోడ్డు ప్రమాదాలు ఆగకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ట్రాఫిక్‌ ఉల్లంఘనలే ప్రమాదాలకు ప్రాథమిక కారణమని అధికారులు చెబుతున్నారు. ఫలితంగా ప్రతీ 86 నిమిషాలకు ఒక ప్రాణం పోతుందని గణాంకాలు చెబుతున్నాయి. మనదేశంలో ఉన్న పరిస్థితుల ఆధారంగా ఏ వాహనానికైనా గరిష్ట వేగ పరిమితి కేవలం 80 కి.మీ మాత్రమే. అంతకుమించి వెళితే ఎవరూ ఏమీ చేయలేరు. కానీ, ఇక్కడ కార్లు, ఇతర వాహనాలు 120 కి.మీలు దాటి కూడా ప్రయాణం చేస్తున్నాయి. శనివారం గచ్చిబౌలి మైండ్‌స్పేస్‌ వద్ద జరిగిన ప్రమాదంలో కారు ఫ్లైఓవర్‌పై నుంచి పడేందుకు ప్రాథమిక కారణం మితిమీరిన వేగమేనని నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే.

ఏటా దేశవ్యాప్తంగా 4,80,652 ప్రమాదాలు జరుగుతుండగా 1.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు రోడ్డు రవాణా– హైవేల మంత్రిత్వశాఖ 2016లో ఇచ్చిన నివేదికలో పేర్కొంది. ఈ ప్రమాదాలలో 68% కారణాలు కేవలం మితిమీరిన వేగం వల్లేనని తెలిపింది. ఈ మరణాల్లో తెలంగాణ వాటా 5,000కుపైగా ఉంది. ప్రతీ నిమిషానికి ఇద్దరు ట్రాఫిక్‌ ఉల్లంఘనల (స్పీడ్‌)కు పాల్పడుతున్నారు. ఈ ఉల్లంఘనల కారణంగా రోజుకు 16 మంది మృత్యువాత పడుతున్నారు. గతేడాది రోడ్డు ప్రమాదాల్లో 6,603 మంది మరణించగా ఈ ఏడాది అక్టోబర్‌ నెలాఖరు వరకు ఈ సంఖ్య 5,024కు చేరుకుంది. ఇది నవంబర్‌ నెలాఖరునాటికి మరో 450 మరణాలు అధికంగా చేరవచ్చని అంచనా వేస్తున్నారు.

కాగితాల్లోనే రోడ్డు భద్రత కమిటీ!
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రత కమిటీని ఏర్పాటు చేయాలని ఏడాదికింద ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో మెడికల్, రవాణా, పోలీసు, ఆర్‌ అండ్‌ బీ అధికారులు భాగస్వామ్యం కావాలి. అయితే, ఇదింకా తుదిరూపు సంతరించుకోలేదు. దీనికి ఎవరు నేతృత్వం వహించాలి అన్న విషయంలో ఆయా శాఖల మధ్య ఇంకా స్పష్టత రాలేదు. దీనికి పోలీసులే నేతృత్వం వహించాలన్నది మిగిలిన శాఖల అభిమతంగా ఉంది.

దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కమిటీకి తుదిరూపు వచ్చి, పని మొదలుపెడితే రాష్ట్రంలో రోడ్డు ప్రమాద నివారణకు మరిన్ని చర్యలు చేపట్టవచ్చని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను, పాట్‌హోల్స్‌ను గుర్తించడం, రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు, రహదారుల వెంబడి వైద్యసేవలు వంటి కీలకమైన సిఫారసులు చేయాల్సిన బృహత్తర బాధ్యతలు కమిటీ భుజాలపైనే ఉంది. కానీ, ఈ కమిటీ ఇంకా కాగితాల్లోనే నలుగుతుండటం దురదృష్టకరం. 

మరిన్ని వార్తలు