రహదారుల రక్తదాహం

26 Aug, 2019 10:17 IST|Sakshi
శామీర్‌పేట్‌లో డివైడర్‌ను ఢీకొన్న కారు(ఫైల్‌)

ప్రమాదాలకు నిలయంగా 44వ జాతీయరహదారి

గాలిలో కలుస్తున్న ప్రాణాలు

రోడ్డున పడుతున్న కుటుంబాలు

25 రోజుల్లో 11 మంది మృత్యువాత

మేడ్చల్‌: మేడ్చల్‌ నియోజకవర్గం పరిధిలో రహదారులు ఎంతవేగంగా అభివృద్ధి చెందుతున్నాయో అంతే వేగంగా ప్రమాదాల సంఖ్యాపెరుగుతోంది. శామీర్‌పేట్‌ మండలం మీదుగా వెళ్లే హైదరాబాద్‌ – కరీంనగర్‌ రాజీవ్‌ రహదారి, మేడ్చల్‌ మండలం మీదుగా వెళ్లే 44వ జాతీయ రహదారి లపై ప్రయాణం   అంటేనే ప్రయాణికులకు వణుకు పుడుతోంది. రాజీవ్‌రహదారిపై తూంకుంట మున్సిపాలిటీ, మజీద్‌పూర్, శామీర్‌పేట్, అలియాబాద్‌ చౌరస్తా, తుర్కపల్లి గ్రామాల పరిధిలోని తరచూ జరుగుతున్న ప్రమాదాలతో ద్విచక్రవాహనదారులతో పాటు పాదచారులు మృత్యువాత పడుతున్నారు. 44వ జాతీయరహదారి పై మేడ్చల్‌ చెక్‌పోస్ట్‌ , కండ్లకోయ ఔటర్‌ జంక్షన్‌ , అత్వెల్లి మలుపు, మేడ్చల్‌ ఆర్టీసీ డిపో నుంచి ఆర్‌టీసీ కాలనీ, అంబేద్కర్‌ చౌరస్తా నుంచి చెక్‌పోస్ట్‌ వరకు ఈ ప్రాంతాల్లో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

వీటితో పాటు మేడ్చల్‌–శామీర్‌పేట్‌ రోడ్డు, అలియాబాద్‌–లక్ష్మాపూర్‌ రోడ్డు, ఈసిఐఎల్‌ –కీసర రోడ్డు, వరంగల్‌ జాతీయరహదారి, మేడ్చల్‌–గండిమైసమ్మ రోడ్లు, జవహర్‌నగర్‌ రహదారిపై వాహనదారులు నిబంధనలు పాటించకపోవడం, భారీ వాహనాల రాకపోకలు, ద్విచక్రవాహనదారులు కనీసం హెల్మట్‌లు కూడా ధరించకపోవడంతో చిన్న చిన్న ప్రమాదాల్లోనూ ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటోంది. రాజీవ్‌రహదారి, 44వ జాతీయరహదారి, వరంగల్‌ రహదారి విశాలంగానే ఉన్నా నాలుగు లైన్ల రోడ్డు ఉన్న ప్రమాదాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. విపరీతంగా రద్దీ పెరగడం దానికి తగినట్లు వసతులు పెరగకపోవడం, యూటర్న్‌లు, ట్రాఫిక్‌ ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్‌ పోలీసులు లేకపోవడం, ట్రాఫిక్‌ నిబంధనలను పాటించని కఠిన చర్యలు తీసుకోకపోవడం ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది. కీసర, జవహర్‌నగర్‌ లింకు రోడ్లు చిన్నగా ఉండటంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

25 రోజుల్లో 11మంది మృత్యువాత..
అగస్టు నెలల్లో నాలుగు మండలాల పరిధిలో చోటు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇప్పటి వరకు 11 మంది మృతి చెందారు. దాదాపు అన్ని ఘటనల్లో భారీ వాహనాలు ద్విచక్ర వాహనదారులను ఢీకొనడంతో జరిగినవే కావడం గమనార్హం.  రోడ్డు మలుపులు, డివైడర్లు లేకపోవడం, అతివేగం, మద్యం మత్తులో లారీలు నడుపుతున్న డ్రైవర్లు, ప్రమాదాలకు కారణంగా మారుతున్నారు. హెల్మెట్లు లేకపోవడం, ద్విచక్ర వాహనదారుల అతివేగం ప్రాణ నష్టానికి దారితీస్తోంది. ఓఆర్‌ఆర్‌పై కూడా అతివేగంగా  వాహనాలు రాకపోకలు సాగిస్తున్నందున రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

నిబంధనలు పాటించాలి
మద్యం సేవించి వాహనాలను నడపడంతో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, హెల్మెట్‌ లేకుండా బైక్‌లపై ప్రయాణించడం, మితిమీరిన వేగం కారణంగా ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయని సీఐ రఘువీర్‌రెడ్డి అన్నారు. హెల్మెట్‌ ధరించి తక్కువ వేగంతో ప్రయాణించడం, మద్యం సేవించి వాహనాలను నడపరాదన్నారు.      –రఘువీర్‌రెడ్డి, సీఐ, ఘట్‌కేసర్‌ 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా