నిర్లక్ష్యమే..

17 Dec, 2018 10:10 IST|Sakshi

రోడ్డు ప్రమాద కారణాలను విశ్లేషించిన ట్రాఫిక్‌ పోలీసులు

నెగ్లిజెంట్‌ డ్రైవింగ్‌ కారణంగానే అత్యధిక మరణాలు

అక్టోబర్‌ వరకు జరిగిన 247 ప్రమాదాల్లో 254 మంది మృతి

నగరంలో అత్యధిక రోడ్డు ప్రమాద మరణాలకు నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపటమే కారణంగా గుర్తించారు. అయితే, రోడ్డు ప్రమాదాలు, వాటిలో మరణిస్తున్న వారి సంఖ్య తగ్గుతున్నప్పటికీ ఏటా కనీసం 200 నుంచి 300 మంది వరకు మృత్యువాత పడుతున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌ వరకు 247 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 254 మంది కన్నుమూశారు. కొన్ని ప్రమాదాల్లో ఒకరు.. మరికొన్నింటిలో అంతకంటే ఎక్కువ మంది మరణిస్తుండడంతో ఫాటిల్‌ యాక్సిడెంట్స్‌ కంటే మృతుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఈ ప్రమాదాలను తగ్గించాలని ట్రాఫిక్‌ పోలీసులు ప్రమాద కారణాలపై అధ్యయనం చేశారు. వీటి ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుని మృతుల సంఖ్య, ఈ తరహా యాక్సిడెంట్స్‌ను తగ్గించాలని నిర్ణయించారు.

సాక్షి, సిటీబ్యూరో: రోగం ఎక్కడ ఉంటే మందూ అక్కడే వేయాలి... రోడ్డు ప్రమాదాలు, మరణాల నియంత్రణకు సిటీ ట్రాఫిక్‌ పోలీసులు ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. ఇందులో భాగంగా రోడ్డు ప్రమాదాలకు కారణాలపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో నగరంలో అత్యధిక రోడ్డు ప్రమాద మరణాలకు నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపటమే కారణంగా గుర్తించారు. ఇలా మొత్తం తొమ్మిది కారణాలను గుర్తించిన అధికారులు వీటిపై దృష్టి సారించి నిరోధక చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. 

ప్రమాదాలు తగ్గుతున్నా...
నగరంలో రోడ్డు ప్రమాదాలు, వాటిలో మరణిస్తున్న వారి సంఖ్య తగ్గుతున్నప్పటికీ ఏటా కనీసం 200 నుంచి 300 మంది వరకు మృత్యువాత పడుతున్నారు. ఈ ఏడాది ఆక్టోబర్‌ వరకు 247 రోడ్డు ప్రమాదాలు (మృతులు నమోదైనవి) జరగ్గా 254 మంది కన్నుమూశారు. కొన్ని ప్రమాదాల్లో ఒకరు... మరికొన్నింటిలో అంతకంటే ఎక్కువ మంది మరణిస్తుండటంతో ఫాటిల్‌ యాక్సిడెంట్స్‌ కంటే మృతుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీనిని గణనీయంగా తగ్గించాలని ట్రాఫిక్‌ పోలీసులు నిర్ణయించారు. ఇందుకుగాను ప్రమాద కారణాలపై అధ్యయనం చేశారు. వీటి ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుని మృతుల సంఖ్య, ఈ తరహా యాక్సిడెంట్స్‌ను తగ్గించాలని నిర్ణయించారు. 

పోలీసులు అందించిన డేటాతో...
ఇందుకుగాను శాంతిభద్రతల విభాగం అధికారుల సహాయం తీసుకున్నారు. నగర ట్రాఫిక్‌ కమిషనరేట్‌ పరిధిలో మొత్తం 25 ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్లు ఉన్నాయి.  నగరంలో ట్రాఫిక్‌ నియంత్రణ, ప్రమాదాల నిరోధానికి ట్రాఫిక్‌ పోలీసులు పని చేస్తారు. అయితే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దానిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసేది మాత్రం లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులే. ఈ నేపథ్యంలోనే ప్రాథమికంగా వారి వద్ద ఉన్న గణాంకాలు సేకరించి వాటిపై అధ్యయనం చేశారు. సదరు రోడ్డు ప్రమాదం ఏ కారణంగా చోటు చేసుకుంది? ఎంతటి ప్రభావం చూపింది తదితర అంశాలను పరిశీలించారు. కొన్ని అంశాల్లో నేరుగా ఘటనాస్థలాలకు వెళ్లి పరిశీలించి వచ్చారు. వీటిలో యాదృచ్ఛికంగా జరిగిన వాటిని మినహాయించారు. 

అత్యధికం మానవ తప్పిదాల వల్లే...
సిటీలోని ఆయా ప్రాంతాల్లో చోటు చేసుకున్న 247 ప్రమాదాలను విశ్లేషించిన పోలీసులు కొన్ని ప్రమాదాలకు కొన్ని రకాలైన కారణాలు ఉన్నట్లు తేల్చారు. సరోజినీ దేవి కంటి ఆస్పత్రి ప్రాంతంలో ఇతర  ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు ఎక్కువగా ప్రమాదాల బారినపడుతున్నారు. అత్యధికంగా రోడ్డు దాటే ప్రయత్నాల్లో ఉన్న పాదచారులే కావడం గమనార్హం. దీనికి వేగంగా వస్తున్న వాహనాలే కారణంగా మారాయి. తాడ్‌బంద్‌ ముస్లిం గ్రేవ్‌యార్డ్‌ ప్రాంతంలో రోడ్డు ఇరుకుగా ఉండటంతో పాటు ఇంజినీరింగ్‌ లోపాలు సైతం వాహనచోదకులు, పాదచారులకు శాపంగా మారాయి. నగరంలో అత్యధిక రోడ్డు ప్రమాద మరణాలు మానవ తప్పిదాలుగా భావించే ర్యాష్‌ డ్రైవింగ్, ఓవర్‌ స్పీడింగ్‌వల్లే జరిగినట్లు వెల్లడైంది. ఇకపై స్పెషల్‌ డ్రైవ్స్‌అన్నీ అయా ఉల్లంఘనల పైనే దృష్టి సారించడం ద్వారా వీటిని తగ్గించాలని భావిస్తున్నారు.   

నిపుణుల సహకారంతో అధ్యయనం
‘రోడ్డు భద్రత కోణంలో హైదరాబాద్‌ను సేఫ్‌ సిటీగా మార్చడం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. దీనికోసం కేవలం ట్రాఫిక్, శాంతిభద్రతల విభాగం అధికారులే కాకుండా మిగిలిన విభాగాలతోనూ కలిసి పని చేస్తున్నాం. రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి ప్రణాళికలు సిద్ధం చేయడానికే బ్లాక్‌స్పాట్స్‌తో పాటు అలా మారడానికి కారణాలనూ శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని నిర్ణయించాం.  దీనికోసం జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్‌ అధికారులతో పాటు సెంట్రల్‌ రోడ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, ట్రాన్స్‌పోర్ట్‌ ఇంజినీర్స్‌ సహాయం తీసుకోవాలని నిర్ణయించాం. ఇంజినీరింగ్‌ సహా మానవ తప్పిదాలు, ఇతర లోపాలను గుర్తించిన చోట్ల వాటిని సరిచేయాలని కోరుతూ ఆయా విభాగాలకు నివేదికలు అందించనున్నాం. ప్రమాద కారణాలపై వాహనచోదకుల్లో అవగాహన కల్పిస్తాం.’– నగర ట్రాఫిక్‌ పోలీసులు  

ఈ ఏడాది జనవరి–అక్టోబర్‌ మధ్య జరిగిన ప్రమాదాల్లో మరణాలు కారణాలు ఇలా...
మొత్తం ప్రమాదాలు:    247
మృతులు:              254
ర్యాష్‌ డ్రైవింగ్‌           110
ఓవర్‌ స్పీడింగ్‌:        79
అదుపు తప్పడం:    16
డ్రంక్‌ డ్రైవింగ్‌:         19
సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌:     3
రహదారి లోపాలు:  4
రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌:  6
మైనర్‌ డ్రైవింగ్‌:      8
ఇతర కారణాలు:    2

మరిన్ని వార్తలు