రోడ్లు ఇలా.. ప్రయాణం ఎలా?

23 May, 2020 08:37 IST|Sakshi
ఫీవర్‌ చౌరస్తా వద్ద...

అసంపూర్తిగా కొనసాగుతున్న రోడ్డు పనులు

పట్టించుకోని అధికారులు

నల్లకుంట: లాక్‌డౌన్‌ కారణంగా రోడ్లు నిర్మానుష్యంగా మారడంతో ప్రభుత్వం రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి తదితర పనులును పునఃప్రారంభించింది. ప్రభుత్వం ఈ నెల 31వరకు లాక్‌డౌన్‌ పొడిగింపుతో నిబంధనలతో కూడి న అనుమతులు ఇవ్వడంతో ప్రజలు రోడ్ల మీదికి వస్తున్నారు. లాక్‌డౌన్‌కి ముందు ఆగిన పనులు, లాక్‌డౌన్‌ కొన సాగింపుతో ప్రారంభించిన పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అసంపూర్తిగా రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణ పనుల కోసం తవ్విన గుంతలు ప్రమాదాలకు తావిస్తున్నాయి. 

లాక్‌డౌన్‌కు ముందు ఆగిన పనులు..
నాలుగు నెలల క్రితం నల్లకుంట డివిజన్‌లోని నల్లకుంట రైల్వే ట్రాక్, నర్సింహ బస్తీ, విజ్ఞానపురి కాలనీ తదితర ప్రాంతాల్లో సీసీ రోడ్డు నిర్మాణం పనులను ప్రారంభించారు. పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌ ఆఘమేఘాలతో రోడ్లను తవ్వి వదిలేశారు. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా చేపట్టిన పనులు ముందుకు సాగలేదు. లాక్‌డౌన్‌కి ముందు నత్తనడకన సాగిన అభివృద్ధి పనులపై విమర్శలు వెలువెత్తడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు కాంట్రాక్టర్‌ను పురమాయించి పనులు పునఃప్రారంభించారు. ఇంతలో కోవిడ్‌–19 కారణంగా మళ్లీ పనులు నిలిచిపోయాయి. కొన్ని చోట్ల పూర్తయిన సీసీ రోడ్డు పనులకు క్యూరింగ్‌చేసే దిక్కు కూడా లేకుండా పోయింది. మరికొన్ని చోట్లల్లో అభివృద్ధి పనులు చేసినప్పటికీ రోడ్లపై పోసిన మట్టికుప్పలను తొలగించలేదు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం లాక్‌డౌన్‌లో సడలింపులు ఇవ్వటంతో నల్లకుంట బస్తీవాసులు బయటకి వస్తున్నా కొద్దిపాటి దూరానికి 2 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తోందని, కొందరు ఆ మట్టి దిబ్బలపై నుంచే రాకపోకలు సాగిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారని వాహనదారులు, స్థానికులు పేర్కొంటున్నారు.

పట్టించుకోని అధికారులు..
నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రి చౌరస్తాలో రెండు వారాల క్రితం కేబుల్‌ పనుల కోసం రోడ్డును తవ్వారు. పనులు పూర్తయినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వల్ల రోడ్డుకి ప్యాచ్‌వర్క్స్‌ పనులు పూర్తిచేయలేదు. దీంతో మట్టి రోడ్డుపైకి చేరుతుండడంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. ఆ మట్టి, దుమ్ము ధూళి కారణం ఎక్కడేం ప్రమాదం జరుగుతోందని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం, అధికారులు ఇప్పటికైనా స్పందించి తవ్వి వదిలేసిన రోడ్లకు ప్యాచ్‌వర్క్‌ పూర్తి చేసి, రోడ్లపై వదిలేసిన మట్టి దిబ్బలను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు