‘ఖిల్లా’లో దొంగల హల్‌చల్‌

28 Apr, 2020 13:10 IST|Sakshi
ఫింగర్‌ప్రింట్లు సేకరిస్తున్న క్లూస్‌ టీం

రూ.2.30లక్షల నగదు, 23 తులాల బంగారు ఆభరణాలు చోరీ

సమీపంలోని తండాలో సెల్‌ఫోన్‌ చోరీ

డాగ్‌స్క్వాడ్, ఫింగర్‌ప్రింట్‌ టీంలతో పరిశీలన

ఖిల్లాఘనపురం (వనపర్తి): అర్ధరాత్రి వేళలో కొందరు దొంగలు ఓ గ్రామం, గిరిజన తండాలో దొంగతనాలకు పాల్పడి ప్రజలను భయబ్రాంతులకు గురిచేశారు. తాళం వేసి ఇంటిపై పడుకోగా, తాళం విరగ్గొట్టి ఇంట్లోకి చొరబడి నగదుతో పాటు బంగారు ఆభరణాలు చోరీ చేశారు. మండలంలోని సల్కెలాపురంలో ఆదివారం మధ్యరాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సల్కెలాపురం గ్రామానికి చెందిన తూడి జగన్నాథరెడ్డి కుటుంబీకులు ఆదివారం రాత్రి భోజనాలు ముగించుకుని ఇంటికి తాళం వేసి ఇంటిపై పడుకున్నారు. మధ్యరాత్రి సమయంలో దొంగలు ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడి బీరువాలో దాచుకున్న 23 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.2.30లక్షల నగదును దోచుకెళ్లినట్లు బాధితులు వాపోయారు. అదేవిధంగా గ్రామానికి సమీపంలో ఉన్న గిరిజన తండాలో ఓ ఇంటి వరండాలో నిద్రిస్తున్న గిరిజన యువకుడి సెల్‌ఫోన్‌ దొంగతనానికి గురైనట్లు తండావాసులు పోలీసులకు తెలిపారు. 

డాగ్‌స్క్వాడ్‌తో పరిశీలన..
బంగారు ఆభరణాలు, నగదు దొంగిలించినట్లు సమాచారం తెలుసుకున్న కొత్తకోట సీఐ మల్లికార్జున్‌రెడ్డి, ఖిల్లాఘనపురం ఎస్‌ఐ రామస్వామి సోమవారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకుని డాగ్‌స్క్వాడ్, ఫింగర్‌ప్రింట్‌ టీంలతో పరిశీలించి బీరువా, సమీపంలోని సామాన్లు తదితర వాటిపై ఫింగర్‌ప్రింట్స్‌ను తీసుకున్నారు. అలాగే గిరిజన తండాలో పోలీసులు పరిశీలించి తండావాసులతో వివరాలు సేకరించారు.

మరిన్ని వార్తలు