వస్త్ర దుకాణంలో చోరీ..

9 Dec, 2018 13:18 IST|Sakshi
మహబూబాబాద్‌లోని వట్టం ఉపేందర్‌భాగ్యమ్మ ఇంట్లో వివరాలు సేకరిస్తున్న క్లూస్‌టీం బృందం

రూ.63వేల నగదు...

విలువైన దుస్తుల అపహరణ

సీసీ పుటేజీలో ఆనవాళ్లు

మానుకోటలో ఓ ఇంట్లో దొంగతనం

సాక్షి, ఏటూరునాగారం: వస్త్ర దుకాణంలో దొంగలు చొరబడి రూ. 50 వేల విలువైన దుస్తులు, రూ. 63 వేల నగదు ఎత్తుకెళ్లిన సంఘటన ఏటూరునాగారం మండల కేంద్రంలోని బస్టాండ్‌ సమీపంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.  మండల కేంద్రంలో ఆర్‌ఆర్‌ రెడీమేడ్‌ షాపును మాచర్ల సారంగపాణి నడిపించుకుంటున్నారు. రోజువారిలాగానే షాపుకు తాళాలు వేసి ఇంటికి వెళ్లాడు. శనివారం ఉదయం షాపు తెరిచి లోనికి వెళ్లి చూడగా వెనుక ఉన్న బాత్‌ రూమ్‌ వెంటిలేటర్, షాపు వెనుకభాగంలో ఉన్న తలుపును గడ్డపారతో పలుగగొట్టి లోనికి చొరబడినట్లు గుర్తించానని షాపు యజమాని తెలిపాడు. బట్టల షాపులో విలువైన రెడీమెడ్‌ పాయింట్లు, టీషర్టులతో పాటు షాపులో రూ. 63 వేల నగదును ఎత్తుకెళ్లినట్లు బాధితుడు వెల్లడించారు. దొంగతనం విషయంపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు వచ్చి పరిశీలించినట్లు తెలిపాడు. 

సీసీ పుటేజీలో అనవాళ్లు

ఆర్‌ఆర్‌ రెడీమేడ్‌ షాపు పక్కనే ఉన్న స్వాతి జ్యూవెల్లరి నగల దుకాణం వెనుకాల అమర్చిన సీసీ కెమెరాలో దొంగల ముఖాలు కనిపించాయి. ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆ షాపు వెనుకాల రెక్కి నిర్వహించినట్లు తెలుస్తోంది. ఒకరు లోనికి చొరబడగా మరోకరు కాపలా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖం పూర్తిగా కనబడకపోవడంతో ఆ వ్యక్తి ఎవరు అనేది తెలియాల్సి ఉంది. సీసీ పుటేజీలో రికార్డు అయిన వీడియోను  పోలీసులకు అందజేయనున్నట్లు షా పు యజమాని తెలిపారు. అంతేకాకుండా పోలీసులు ఇటీవల గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లోని పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. 

మానుకోటలోని ఓ ఇంట్లో దొంగతనం

మానుకోట పట్టణంలోని నర్సంపేట బైపాస్‌రోడ్డులోగల  హోలియదాసరి బజార్‌లో నివాసం ఉండే వట్టం ఉపేందర్, భాగ్యమ్మ నివాసంలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. మానుకోట రూరల్, టౌన్‌ ఇన్‌చార్జి ఎస్సై పత్తిపాక జితేందర్‌ కథనం ప్రకారం...మానుకోట పట్టణంలోని నర్సంపేట బైపాస్‌రోడ్డులోగల  హోలియదాసరి బజార్‌లో నివాసం ఉండే వట్టం భాగ్యమ్మ వృత్తిరీత్యా ముత్యాలమ్మగూడెం ఏహెచ్‌ఎస్‌లో ఉపాధ్యాయురాలు.  

ఆమె ఎన్నికల విధుల్లో భాగంగా వర్ధన్నపేటకు గురువారం సాయంత్రం వెళ్లారు. ఆమె భర్త వట్టం ఉపేందర్‌ కొత్తగూడ మండలంలోని గోపాలపురంకు ఓటు వేయడం కోసం వెళ్లారు. ఆయన శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చి చూసే సరికి ఇంట్లోని సామానులు చిందరవందరగా పడేసి ఉన్నాయి.  బెడ్‌రూంలోకి వెళ్లి చూసేసరికి  బీరువా తలుపులు పగులగొట్టి కనిపించాయి. సమాచారం అందుకున్న టౌన్‌ సీఐ ఎస్‌.రవికుమార్, సీసీఎస్‌ సీఐ ఎన్‌.వెంకటేశ్వర్లు, క్లూస్‌టీం బృందం ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు

మరిన్ని వార్తలు