రాజన్న ఆలయంలో చోరీ!

22 Nov, 2019 05:05 IST|Sakshi
పట్టుబడిన వెండి ఆభరణాలు

బంగారు, వెండి ఆభరణాల అపహరణ

వేములవాడ: వేములవాడ రాజన్నకు భక్తులు సమర్పించే కానుకల చోరీ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో గత నెల 23, ఈ నెల 6న హుండీ లెక్కించారు. కానుకలను లెక్కిస్తున్న క్రమంలో హుండీలోని వెండి, బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఎంత మొత్తంలో ఆభరణాలు చోరీకి గురయ్యాయో తెలియరాలేదు. కాగా, వేములవాడలోని శాస్త్రీనగర్‌కి చెందిన ఫిరోజ్‌ నిత్యం రాజన్న గుడిలో భక్తులు ఆలయంలోని విగ్రహాలపై చల్లిన బియ్యం సేకరించి అమ్ముకుంటుంటాడు. కొద్ది రోజుల క్రితం క్యూలైన్ల వద్ద బియ్యం సేకరిస్తున్న క్రమంలో కార్పెట్ల కింద ఓ సంచిని చూశాడు. అందులో అభరణాలు ఉండటంతో వీటిని అమ్మేందుకు కరీంనగర్‌ వెళ్లాడు. అనుమానం వచ్చిన వ్యాపారులు పోలీసులకు సమాచారమిచ్చారు. అనంతరం సీసీఎస్‌ పోలీసులు ఫిరోజ్‌ను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు గురువారం అప్పగించారు. ఆభరణాలు ఎలా బయటకు వచ్చాయి? అనే కోణంలో టౌన్‌ సీఐ వెంకటస్వామి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా