పాస్‌లు దుర్వినియోగం చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు

22 Apr, 2020 13:16 IST|Sakshi

సాక్షి, హైద‌రాబాద్‌: న‌గ‌రంలో లాక్‌డౌన్‌ను ప‌టిష్టంగా అమలు చేస్తున్నామ‌ని రాచ‌కొండ క‌మిషనర్ మహేష్ భగవత్ అన్నారు. బుధ‌వారం ఆయ‌న సాక్షి టీవీతో మాట్లాడుతూ.. రాచ‌కొండ ప‌రిధిలో 27 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయ‌ని తెలిపారు. వీరిలో ఒక‌రు మ‌ర‌ణించ‌గా ఆరుగురు కోలుకుని ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యార‌ని పేర్కొన్నారు. మ‌రోవైపు ఢిల్లీలో వైర‌స్ ప్ర‌భంజ‌నానికి వేదిక‌గా నిలిచిన‌ నిజాముద్దీన్ మ‌ర్క‌జ్‌కు వెళ్లిన ఐదుగురు రోహింగ్యాల‌ను గుర్తించామ‌న్నారు. వారికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా నెగెటివ్ రిపోర్ట్ వ‌చ్చింద‌ని తెలిపారు. ఎవ‌రూ అపోహ‌లను న‌మ్మ‌వ‌ద్ద‌ని ప్ర‌జ‌లకు విజ్ఞ‌ప్తి చేశారు.

రాచ‌కొండ ప‌రిధిలో జిల్లా స‌రిహ‌ద్దులు ఉన్నందున అక్క‌డ ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. అత్య‌వ‌స‌ర ప్ర‌యాణాల‌కు అనుమ‌తించే పాస్‌ల‌ను దుర్వినియోగం చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. ఇక ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు జారీ చేసే పాస్‌ల‌పై ఉత్త‌ర్వులు జారీ అయ్యాయన్నారు. మే 7 వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రూ లాక్‌డౌన్ త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని కోరారు. ఉద‌యం 6 గంట‌ల నుంచి సాయంత్రం 6 వ‌ర‌కు ప్ర‌జ‌లు నిత్యావ‌స‌ర వ‌స్తువులు కొనుగోలు చేయ‌వ‌చ్చ‌ని సీపీ మ‌హేశ్ భ‌గ‌వ‌త్‌ సూచించారు. (‘చిరుత’ వీడియో ఆకతాయిల పనే!)

మరిన్ని వార్తలు