ప్రవాస భారతీయులకు పరోక్షఓటింగ్‌

5 Oct, 2018 11:04 IST|Sakshi

లోక్‌సభలో సవరణ బిల్లు ఆమోదం

అమల్లోకి వస్తే ఎన్నికల్లో ఎన్నారైల కీలక పాత్ర

పరోక్ష ఓటింగ్‌పై భిన్నాభిప్రాయాలు

హైదరాబాద్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం

మహమ్మద్‌ హమీద్‌ ఖాన్, హైదరాబాద్, సిటీబ్యూరో: సార్వత్రిక ఎన్నికల్లో రక్షణ సిబ్బంది, భద్రతా దళాలకు వెసులుబాటు ఉన్న సర్వీస్‌ ఓటింగ్‌ తరహాలోనే ప్రవాస భారతీయులకు పరోక్షఓటింగ్‌ (తమ ప్రతినిధి ద్వారా ఓటు వేయడం) సదుపాయం కల్పించే ప్రజా ప్రాతినిధ్య సవరణ బిల్లు– 2017ను కేంద్రమంత్రివర్గం అంగీకరించింది. దానికి గతనెలలో లోక్‌సభలో ఆమోద ముద్రపడింది. రాజ్యసభలో బిల్లు పాస్‌కావాల్సి ఉంది. తర్వాత రాష్ట్రప్రతి ఆమోదముద్రతో చట్టసవరణ అమల్లోకి వస్తుంది. దీనిని ‘ప్రాక్సీఓటింగ్‌’ అంటారు. 

2010లోనే చట్ట సవరణ చేసినా..?  
వాస్తవానికి 2010లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాప్రాతినిధ్య చట్టసవరణ చేసింది. సెక్షన్‌ 20– ఏ ప్రకారం 18ఏళ్లు నిండి విదేశీ గడ్డపై నివసిస్తున్న ఎన్నారైలు భారతదేశంలో  ‘ఓవర్సీస్‌ ఎలక్ట్రర్స్‌’గా తమ పేర్లు నమోదు చేసుకునేందుకు వీలుంది. ఆయితే అప్పట్లో ప్రవాస భారతీయులు ఇక్కడకు వచ్చి ఓటేయాల్సిం దేనని ఎన్నికల సంఘం తేల్చిచెప్పడంతో కనీసం 25వేల మంది తమ ఓటుహక్కును నమోదు చేసుకోలేదు. కాగా వివిధ దేశాల్లో సుమారు కోటి 25లక్షల మందిపైగానే ఎన్నారైలు ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అరబ్‌ గల్ఫ్‌ దేశాల్లోనే సుమారు పది లక్షల మంది తెలంగాణ వలస కార్మికులు ఉన్నారు. సుమారు 25 అసెంబ్లీ, రెండులోకసభ నియోజకవర్గాల్లో  వీరి కుటుంబాల ప్రభావం ఉంటుందని రాజకీయ పరిశీలకుల అంచనా. 

భిన్నాభిప్రాయాలు..
ఎమిగ్రంట్స్‌ వెల్ఫేర్‌ఫోరం ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించిన సదస్సులో పలువు రు ఎన్నారైలు తమ అభిప్రాయాలు వ్యక్తంచేశారు. పరోక్ష ఓటింగ్‌ దుర్వినియోగమవుతోందని, దీనికి బదులు ప్రవాసీలంతా ఆయాదేశాల్లోని భారత రాయబార కార్యాలయంలో ఓటు వేసే ఏర్పాట్లు చేయాలని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కమిటీ ఇది కుదిరే పనికాదని స్పష్టం చేసిన విషయాన్ని మరి కొందరు గుర్తుచేశారు. అమెరికా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఇదే విధానం అనుసరిస్తున్నారు. పోస్టల్‌ బ్యాలెట్, ఈ– పోస్టల్‌ బ్యాలెట్‌ విధానాలపై కొందరు ఆసక్తి కనబర్చినా, లోపాలున్నాయన్న వాదన వినిపించింది. పరోక్ష ఓటింగ్‌లో సూచిం చిన వ్యక్తికే ఓటు వేస్తారనే నమ్మకం లేదన్న అభిప్రాయాన్ని పలువురు ఎన్నారై ప్రతినిధులు వ్యక్తం చేశారు.

ఓటుహక్కు అవసరం  
ఎన్నారైలు, వలస కార్మికులకు ఓటు హక్కు అవసరం.స్థానికంగా లేని కారణంగా ఓటు హక్కు తొలగిస్తున్నారు. దీంతో రాజకీయపక్షాలు వలస కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదు. గతంలో ప్రజాప్రాతినిధ్య చట్ట సవరణ జరిగినా ఇక్కడికి వచ్చి ఓటు వేయాలనే నిబంధన ఉండటంతో ప్రవాస భారతీయులు, కార్మికులు ఓటరు నమోదుపై పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. తాజాగా పరోక్ష ఓటింగ్‌ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం లభించింది. రాజ్యసభలో ఆమోదం తర్వాత అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.  – మంద భీంరెడ్డి, అధ్యక్షుడు ఎమిగ్రంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌   

ఓటుహక్కు కల్పించాల్సిందే..
ప్రవాస భారతీయులకు ఓటు హక్కు అవసరం. విదేశాల నుంచి ఓటింగ్‌ కోసం ప్రత్యేకంగా రావడం సాధ్యం కాదు. ఉన్న చోట నుంచే ఓటు వేసే విధంగా ప్రత్యేక ఏర్పాటు చేయాలి. నేరుగా ఓటు వేస్తేనే తమ హక్కు వినియోగించుకున్నట్లు సంతృప్తి ఉంటుంది. ఎన్నికల కమిషన్‌ ప్రవాస భారతీయుల ఓటు హక్కు కల్పనపై పరిశీలించాలి.– శాంతిప్రియ, మలేషియా

మన ఓటు మరొకరి ద్వారానా..?  
ఎన్నికల కోసం మనహక్కు ఇతరులకు అప్పజెప్పడమేమిటి..? దుర్వినియోగమయ్యే ప్రమాదం లేకపోలేదు. ప్రవాస భారతీయులకు కూడా ఓటు హక్కు అవసరం. ఎన్నికల అవసరాలకు ఎన్నారైల ఫండ్‌ అవసరం కానీ, ఓటు హక్కు గురించి ఎందుకు ఆలోచించరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద విదేశాలకు వెళ్లిన వారి జాబితా ఉంటుంది. దాని ఆధారంగా ఓటు నమోదు ప్రక్రియ చేపట్టాలి.  
– హేమంత్‌కుమార్, మస్కట్‌  

పరోక్ష ఓటుహక్కు దుర్వినియోగమే..
ఎన్నికల్లో పరోక్ష ఓటింగ్‌ విధానం దుర్వినియోగానికి దారితీస్తుంది. సూచించిన వ్యక్తికి ఓటు పడుతుందన్న నమ్మకం లేదు. ఉన్నచోట నుంచే ఓటు వేసే వెసులుబాటు కల్పించాలి. ప్రవాస భారతీయుల కోసం ఎంబసీలో బ్యాలెట్‌ ఏర్పాటు చేసి ఎర్లీ పోలింగ్‌ నిర్వహించాలి. ముందుగా ప్రవాస భారతీయులకు గుర్తింపు ఇవ్వాలి. రాజకీయాల్లో సైతం ప్రాధాన్యం కల్పించాలి.
– భవానీరెడ్డి, ప్రవాస భారతీయురాలు, ఆస్ట్రేలియా  

ఈ– ఓటింగ్‌ విధానం అనుసరించాలి  
విదేశాల్లో మాదిరిగా ప్రవాస భారతీయులకు ఈ– ఓటింగ్‌ విధానం వర్తింపజేయాలి. పరోక్ష ఓటింగ్‌ సరైనది కాదు. విదేశాల్లో ఉండి నేరుగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాటు చేయాలి. ఎన్నారైలకు సరైన గుర్తింపు ఇస్తే అభివృద్ధిలో మరింత భాగస్వాములయ్యే అవకాశం ఉంది.
– సురేశ్‌రెడ్డి, అమెరికా  

పరోక్ష ఓటింగ్‌కు వ్యతిరేకం   
ప్రవాస భారతీయులకు పరోక్ష ఓటింగ్‌ విధానం వర్తింపజేయడానికి వ్యతిరేకం. ఎవరి ఓటు హక్కు వారే వినియోగించుకోవాలి. ప్రవాస భారతీయుల ప్రతినిధి రాజకీయ ప్రలోభాలకు గురయ్యే అవకాశాలు లేకపోలేదు. రాజకీయపక్షాలు ఎన్నారైలను గుర్తించడం లేదు. కేవలం పార్టీఫండ్స్‌కు మాత్రమే వినియోగించుకుంటున్నారు. ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలి.– దేవేందర్‌రెడ్డి

ద్వినియోగం చేసుకోవాలి..  
ఎన్నారైలు, వలస కార్మికులకు ప్రజాస్వామ్య బద్ధంగా ఓటుహక్కు అవసరం. పరోక్ష ఓటింగ్‌ విధానం కన్నా పోస్టల్, లేదా బ్యాలెట్‌ వెసులు బాటు కల్పించాలి. ఓటు హక్కు వినియోగించకున్నప్పుడే సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి ఒత్తిడి చేసే అవకాశం ఉంటుంది. ఎన్నికల కమిషన్‌ కల్పించిన     అవకాశాన్ని ఎన్నారైలు, వలస కార్మికులు     సద్వినియోగం చేసుకోవాలి. 
– సునీల్‌కుమార్, గల్ఫ్‌ సినిమా డైరెక్టర్‌

ఎన్నారైలు ఓటర్లుగా నమోదు కావచ్చు
ప్రవాస భారతీయులు ఓటరుగా నమోదు చేసుకోవడానికి తమ పాస్‌పోర్టులో పేర్కొన్న చిరునామా ప్రకారం సంబంధిత శాసనసభ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారికి భారత ఎన్నికల సంఘం వారి ఫారం–6ఏలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించాలి. తరువాత భారత్‌లోని తమ చిరునామాలో బంధువులను విచారిస్తారు. ఏడు రోజులవరకు ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే ఓటరుగా నమోదు చేస్తారు. ఏదైనా తేడా వస్తే దరఖాస్తుదారు నివసిస్తున్న దేశంలోని భారత రాయబార కార్యాలయానికి సమాచారమిస్తారు. ‘‘ఓవర్సీస్‌ ఎలక్టర్స్‌ (ప్రవాసీఓటర్లు)గా నమోదు అయినవారు పోలింగ్‌ రోజున సంబంధిత పోలింగ్‌ బూత్‌ కు వచ్చి, ఒరిజినల్‌ పాస్పోర్ట్‌ చూపించి ఓటుహక్కును వినియోగించుకోవాలి. వీరికి ఎన్నికలలో పోటీ చేసే హక్కుతో పాటు సాధారణ ఓటరుకు ఉండే అన్ని హక్కులు సమానంగా ఉంటాయి.

ఇలా నమోదు చేసుకోవాలి...
https://www.nvsp.in/Forms/Forms/form6a?lang=en-GB ను క్లిక్‌ చేయగానే స్క్రీన్‌ పై ఫాం– 6ఏ కనిపిస్తుంది. ఓటరు నమోదు అధికారి రాష్ట్రం: తెలంగాణ, జిల్లా, నియోజకవర్గం పేరు నమోదు చేయాలి. పేరు, ఇంటి పేరు, పుట్టిన తేదీ (పాస్‌పోర్ట్‌ ప్రకారం), ఆ ఊరిలో ఉన్న ఒక బంధువు పేరు నమోదు చేయాలి. పుట్టిన స్థలం, జిల్లా, రాష్ట్రం, లింగము (స్త్రీ, పురుష, ఇతర), ఇమెయిల్, ఇండియా మొబైల్‌నంబర్‌ పేర్కొనాలి. పాస్‌పోర్టు నంబర్, అది జారీ చేసిన ప్రదేశం, జారీచేసిన తేదీ, గడువు తేదీ, వీసానంబర్, వీసా క్యాటగిరీ (సింగిల్‌ఎంట్రీ / మల్టిపుల్‌ఎంట్రీ / టూరిస్ట్‌ / వర్క్‌ వీసా), వీసా జారీ చేసిన తేదీ, గడువు ముగిసే తేదీ, వీసా జారీ చేసిన అథారిటీ పేరు తెలియాజేయాలి. ఇండియాలోని సాధారణ నివాసంలో గైర్హాజరు కావడానికి గల కారణాలు వివరించాలి. ఇండియాలోని సాధారణ నివాసంలో గైర్హాజరైన తేదీ పేర్కొనాలి. విదేశంలో నివసిస్తున్న ప్రదేశం యొక్క పూర్తి పోస్టల్‌ అడ్రస్‌ నమోదు చేయాలి. స్వదేశంలోని అడ్రస్, పూర్తి వివరాలు, పిన్‌కోడ్‌ నంబర్‌ సరిగా నమోదు చేయాలి. పాస్‌పోర్టుసైజ్‌ కలర్‌ ఫొటో, చెల్లుబాటులో ఉన్న పాస్‌పోర్టు, వీసా పేజీలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలి.  

వాగ్మూలం ఇలా ఇవ్వాలి..
‘‘నాకు తెలిసినంతవరకు ఈ దరఖాస్తులో పేర్కొన్న వివరాలు నిజమైనవి. నేను భారత పౌరుడిని. నేను ఇతర దేశము యొక్క పౌరసత్వము కలిగిలేను. ఒకవేళ నేను విదేశీ పౌరసత్వం పొందినట్లయితే వెంటనే భారత రాయబార కార్యాలయానికి తెలియజేస్తాను. ఓటరు నమోదు కొరకు ఇతర నియోజకవర్గాలలో దరఖాస్తు చేసుకోలేదు.తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే ప్రజాప్రాతినిధ్య చట్టం1950 సెక్షన్‌ 31 ప్రకారం నేను శిక్షార్హుడిని అని నాకు తెలుసు.’’

ఒమన్‌ రాయబారిగా మును మహావర్‌
‘‘ఒమన్‌ దేశపు భారతరాయబారిగా మును మహావర్‌ 21ఆగస్టు 2018న బాధ్యతలు స్వీకరించారు. 1996 ఐఎఫ్‌ఎస్‌ బ్యాచ్‌కు చెందిన మును మహావర్‌ గతంలో మాస్కో, జెనీవాలో, ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఐఐటీ ఢిల్లీ నుంచి ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో పట్టభద్రులైన మునుమహావర్‌ చత్తీస్‌గఢ్‌కు చెందినవారు.’’  

మరిన్ని వార్తలు