‘శ్రీహిత చట్టం’ తీసుకురావాలి

27 Jun, 2019 15:59 IST|Sakshi

వరంగల్‌లో మహిళా అఖిలపక్షం ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం

వరంగల్ అర్బన్ : తొమ్మిది నెలల చిన్నారి శ్రీహితపై జరిగిన హత్యాచారం ఘటనను తీవ్రంగా ఖండిస్తూ మహిళాలోకం గళమెత్తింది. ఈ ఘటన  నేపథ్యంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు నిరసిస్తూ.. వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో మహిళా అఖిలపక్షం ఆధ్వర్యంలో గురువారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మహిళలు, చిన్నారులపై దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం  ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని ఈ సమావేశంలో మహిళా నేతలు డిమాండ్‌ చేశారు. శ్రీహిత  పేరుతో చట్టం తేవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ‘శ్రీహిత చట్టం’ తేవాలని డిమాండ్‌ చేశారు. ఇందుకోసం తాను ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని పేర్కొన్నారు. వరంగల్‌ ఘటనలో సీసీ ఫుటేజ్‌ ఆధారాలు ఉన్నా.. ఎందుకు ఇంకా చర్యలు తీసుకోవడం లేదో ప్రభుత్వం చెప్పాలన్నారు. షీ టీంలతో యువతులకు ఎక్కడ  న్యాయం జరిగిందో చెప్పాలన్నారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లోకి  చేర్చుకునేందుకు సమయం ఉంటుంది. కానీ వరంగల్‌ వంటి ఘటనపై ప్రభుత్వం ఎందుకు స్పందించదని దుయ్యబట్టారు.

వరంగల్ వంటి ఘటన ఎక్కడ జరగకుండా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రవళి డిమాండ్‌ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు ఎక్కడైనా  పునరావృతం అయితే నిందితులకు ఉరిశిక్ష వేయాలన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున ర్యాలీ తీసి.. వరంగల్ జిల్లాలో బంద్‌కు పిలునిస్తామన్నారు. ఇటీవల హన్మకొండలో 9నెలల చిన్నారి శ్రీహితపై అత్యంత దారుణంగా అత్యాచారం, హత్య జరిగిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం నిఘా ఏర్పాట్లు చేయాలని.. లేకపోక దశల వారిగా ఉద్యమిస్తామని వక్తలు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో శ్రీహిత తల్లిదండ్రులు, కాంగ్రెస్, బీజేపీతోపాటు పలు ప్రజా సంఘాల మహిళా నేతలు పాల్గున్నారు.

మరిన్ని వార్తలు