భద్రాద్రి జిల్లా కోసం..

7 Sep, 2015 02:55 IST|Sakshi
భద్రాద్రి జిల్లా కోసం..

- ఊపందుకున్న ఉద్యమం
- రౌండ్‌టేబుల్ సమావేశం
- ఏకమైన రాజకీయ పక్షాలు
భద్రాచలం :
భద్రాచలాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్‌తో ఆదివారం పట్టణంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఆర్యవైశ్య సత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ పార్టీలతో పాటు గిరిజన, దళిత, వర్తక,వాణిజ్య, స్వచ్ఛంద సంస్థలు, పట్టణ ప్రముఖులు సుమారు 500 మంది పాల్గొని వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనతో భద్రాచలానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.  పోలవరం ప్రాజెక్టు కోసమని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయటంతో ఆ ప్రభావం భద్రాచలంపై తీవ్రంగా పడిందన్నారు. ఏజెన్సీ కేంద్రంతో పాటు, దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన శ్రీ సీతారామచంద్రస్వామి వారి క్షేత్రం వెలసిన భద్రాచలాన్ని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజనకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో భద్రాచలాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తేనే భవిష్యత్ ఉంటుందన్నారు. దీన్ని సాధించుకునేందుకు.. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఉద్యమబాట పడతామన్నారు. పార్టీలకతీతంగా చేపట్టే ఆందోళనకు గ్రామస్థాయిలో ప్రజానీకాన్ని కదిలిస్తామన్నారు. ఇందుకోసమని అన్ని రాజకీయ పార్టీల ముఖ్యులతో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఏపీలో విలీనమైన ముంపు మండలాలను తిరిగి తెలంగాణలో కలిపి భద్రాచలాన్ని జిల్లా కేంద్రం చేయూలని కొందరు, అది కాని పక్షంలో భద్రాచలాన్ని ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయాలని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది.
 
తాడో పేడో తేల్చుకోవాలి
భద్రాచలాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించుకునేలా రాజకీయ పార్టీలకతీతంగా అంతా ఏకం కావాలని నాయకులు పిలుపునిచ్చారు. జిల్లా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు ద్వారా ప్రభుత్వం దృష్టికి భద్రాద్రి వాసుల అభిప్రాయూన్ని తీసుకెళ్లాలని నిర్ణరుుంచారు. ఈ విషయంలో తాడోపేడో తేల్చుకునేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు